అమ్మా ! నాకు మంత్రము తెలియదు. యంత్రము తెలియదు. నాకు ధ్యానము చేయుట కుదరడంలేదు. నీ గురించి కథలు, స్తోత్రములు, పూజాదికములు తెలియవు. అన్నివిధములైన కష్టములు నుండి కడతేర్చెడు దయగల అమ్మవు నీవు. మా కష్టాలను దూరము చేసే అమ్మవు నీవు, నీచాటున ఉండిపోవాలని గట్టిగా తలచాను. డబ్బువున్నా, సోమరితనముచేత నీ సేవను చేయలేక పోతున్నాను. ప్రేమమూర్తి వైన అమ్మా బిడ్డలు చేసే పొరపాట్లను అన్నింటిని దొడ్డమనుస్సుతో క్షమించమని నా ప్రార్ధన.
అతి చంచల స్వభావమైన నన్ను విడిచిపెట్టుట మాత్రము న్యాయముకాదమ్మా! లోకంలో బిడ్డలు తుంటరివారుగా ఉండవచ్చుగాని, దయలేని తల్లి మాత్రం ఉండనే ఉండదు కదా! చంద్రునివలె చల్లని మనస్సు గల ఓ అమ్మా! నాకు సాంసారిక భోగభాగ్యములు కావాలని నేను ఆశ పడటంలేదు, జ్ఞానము కావాలని, సుఖభోగాలు అనుభవించాలని కోరుకోవడం లేదు. నా జీవితకాలమంతా నీ పేరును స్మరించుకుంటూ వుండాలని మాత్రమే కోరుకొంటున్నాను.
తప్పులను క్షమించే ఓ తల్లీ, మమ్మల్ని చేరదీసి ప్రేమతో, కృపతో కరుణతో కాపాడుము. ఆకలివేసినపుడు, బిడ్డ తల్లిని గుర్తు చేసుకొనును. ఆపదలలో చిక్కుకున్నపుడు నిన్ను గుర్తు చేసుకొనుచున్నాను. ఇటువంటి నా స్వభావమును మన్నించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను.
అమ్మా నీ కరుణచే సంపదలు వచ్చినా, కీర్తి ప్రతిష్టలు వచ్చినా వాటిలోవుండి నిన్ను మరవకుండా.. నిత్యము నీ నామము.. నా మనోఫలకంపై వుండాలని కోరుకొంటున్నాను. నా మాటలు ఆలకిస్తున్నావు. దీవిస్తున్నావు. సర్వదా వెంట వున్నావు. నిన్ను ఏమని పొగడాలి. అమ్మా విశ్వజననీ!