“నేటి ప్రజలందరూ అమ్మ నుండి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది. అరిషడ్వర్గాలకు అతీతమైన ఆమె నుండి తోటి ప్రజలను ప్రేమించడం, ఉన్నదాంట్లో వీలైనంత దానం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వంటివి వాటిలో చాలా ముఖ్యం. ప్రజారాధనే దైవారాధన. దేవాలయంలో దేవుడిని పూజించినట్లు తోటివారిని పూజించాలి అన్నారు అమ్మ”.
– శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి,
కుర్తాళం పీఠాథిపతి
చైతన్యమే తానై ప్రేమను, జ్ఞానాన్ని పెంచిన అన్నపూర్ణగా, సమదర్శినిగా, సర్వసమత్వంతో, సహజ సహనంతో అవతరించిన అనసూయాదేవి జిల్లెళ్ళమూడి అమ్మగా అందరి హృదయ మందిరాల్లో కొలువు దీరారు. చైత్రశుద్ధ ఏకాదశిన అమ్మ జన్మతిథి. ఈ సందర్భంగా అమ్మ జీవనతత్వాన్ని, తాత్విక జీవనాన్ని తలచుకుని తరిద్దాం. అమ్మ ఏ సాధనగా చేయలేదు (సాధన లేదనలేదు). అమ్మకు గురువులు లేరు, తాను గురువు కాదు, ‘నాకు శిష్యులు ఎవరూ లేరు. అంతా శిశువులే’ ||అన్నది. మన కొరకు తన చుట్టూ ఉన్నవి పరిశీలించి వానిలో తాను అనుభవించిన ఉదాహరణలు తీసుకుని బిడ్డలకు చెప్పారు. అమ్మ తనది సర్వసమ్మతమైన మతమన్నది. తనది ‘సరే’ మంత్రమన్నది. అలా నడిచి చూపించింది.
ప్రేమైకమూర్తిగా, అవతారమూర్తిగా తన సేవా కార్యక్రమాల పరంపరతో మహిమలతో భక్తులచే ఆరాధింప బడ్డారు.
గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని మన్నవ గ్రామంలో మన్నవ సీతాపతి, రంగమ్మలకు జన్మించిన అనసూయాదేవి – బ్రహ్మాండం నాగేశ్వరరావు ధర్మపత్నిగా బాపట్ల మండలం, జిల్లెళ్ళమూడిలో అడుగు పెట్టారు. అడుగు పెట్టిందే తడవు ఆ ప్రాంత పేదల పరిస్థితి చూసి చలించి పోయి పిడికెడు బియ్య పథకంతో తన సేవాతత్పరతను చాటారు. మాతృసంస్థ అయిన శ్రీవిశ్వజననీ సంస్థకు అనుబంధం మాతృశ్రీ విద్యా పరిషత్, మాతృశ్రీ పబ్లికేషన్స్, మాతృశ్రీ వైద్యాలయం, ఆదరణాలయం, అన్నపూర్ణాలయం, హైమాలయం, అనసూయేశ్వరాలయం స్థాపించి కుల, మత వర్గాల కతీతంగా సేవలందించారు. అన్నపూర్ణాలయంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ ఎంత ఆదర్శ ప్రాయమైందంటే టీటీడీ అధికారులు వచ్చి సందర్శించి అన్నప్రసాద వితరణ ఎంత సమర్థవంతంగా నిర్వహించాలో ఇక్కడ అధ్యయనం చేశారు.
“20 సంవత్సరాలుగా పత్రిక సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అమ్మతత్వాన్ని, బోధలను నేటి తరానికే కాదు. భవిష్యత్ తరాలకు కూడా అందించాలని నా తపన. అప్పుడే సమాజంలో సమానత్వం, శాంతి నెలకొంటుంది.”
– పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ సంపాదకులు,
విశ్వజనని మాసపత్రిక
అమృతోక్తులు
మనకు జీవితం, జీవనం భగవంతుడు ఇచ్చినవే. అందరూ ఒకటే. వర్గం లేనిదే స్వర్గం.
కుమార్తెను, కోడలును, ఒకే విధంగా చూడడమే అద్వైతం.
భౌతిక పూజ కన్న మానసిక పూజే ప్రధానం. రక్తమంతా ఈశ్వరతత్వమే. భగవంతుడు ఉన్నాడని గుర్తించింది మానవుడు, పుస్తకాలు రాసింది మానవులేగా? మానవుడు లేకపోతే దేవుడు లేడు.
గుర్తు తేడా తప్ప మాధవత్వం, మానవత్వంలో * ఉన్నట్టేగా?
మనమెంత అనుకోవాలి గాని మనమెంతటి వాళ్ళమో – అనుకుంటే ఎట్లా?
బ్రహ్మచర్యమంటే కేవలం పెండ్లి చేసుకోకపోవడం కాదు. లింగభేదం, రూపభేదం, స్పర్శ భేదం లేకుండా ఉండటం.
అమ్మకు ఆత్మకు మార్గమేముంది… కనబడేదంతా ఆత్మ అయినప్పుడు మార్గమెక్కడికని?
నిర్గుణుడంటే అన్ని గుణాలూ తనవే కలిగినవాడనీ, నిరాకారుడంటే అన్ని ఆకారాలూ ఆయనవే అనీ అర్థం చేసుకోవాలి.
సుప్రసిద్ధ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు, కమ్యూనిస్టు పార్టీ మాజీ ఎంపీ వీరమాచనేని ప్రసాదరావు, శ్రీశ్రీశ్రీ ఓంకారానందగిరిస్వామి వంటి ఆధ్యాత్మిక వేత్తలు, మేధావులు ఎందరో అమ్మను ఆరాధించిన వారిలో ఉన్నారు.
– (సాక్షిపత్రిక 26.4.2021 సౌజన్యంతో)