1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమృతస్పర్శ ఓదార్పు

అమృతస్పర్శ ఓదార్పు

Kondamudi Subba Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : February
Issue Number : 7
Year : 2014

ఏ అవతార వ్యక్తి గురించి తీసుకున్నా ‘స్పర్శ’ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కృష్ణుని స్పర్శతో కురూపి ‘కుబ్జ’ జగదేకసుందరి అయింది. రాముడి పాదస్పర్శతో పాషాణము సౌందర్యరాశి అహల్యగా మారింది. అదే అవతార వ్యక్తి ‘అమ్మ’ అయితే ఇక చెప్పేదేముంది? ఈ విషయంలో రామకృష్ణ అన్నయ్య అంటాడు.

“అగ్నికి వేడిమీ, నీటికి చల్లదనమూ ఎంత సహజమో ఆ చేతికి ‘కాపు’ అంత సహజం. ఆకరస్పర్శలో ఎందరో ఆరోగ్యవంతులయినారు మరెందరో పునర్జీవు లయినారు. ఆ కరచాలనంలో ఎందరో క్రొత్త పిలుపు విన్నారు, ఎందరో మంచిదారులకు మళ్ళారు. ఆ చేతిలో సంజీవని ఉన్నది. ఆ చేతిలో చింతామణి ఉన్నది. ఆ చేతిలో అమృతకలశమున్నది. ఆ చేతిలో అభయముద్ర ఉన్నది.

జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ మెడికల్ సెంటరు ప్రారంభోత్సవ సమయంలో జరిగిన సంఘటన గమనించండి. నిత్యరోగి అయిన అమ్మ డాక్టర్ కుర్చీలో ఆసీనకాగా ప్రసిద్ధుడైన డాక్టర్ సుబ్బారావు గారు మొదటి పేషెంట్గా వెళ్ళి బల్లపై కూర్చొన్నాడు. అమ్మ అతడిని ఆ పరీక్షా ఈ పరీక్షా చేస్తూ కుడిచెయ్యి మణికట్టు వద్దపట్టుకున్నది. డాక్టర్ గారికి అంతకు ముందు కొన్ని వారాలుగా అక్కడ నొప్పి ఏర్పడి ధర్మామీటరు కూడా విదిలించనివ్వటం లేదట. కాని అమ్మ అమృతస్పర్శతో నొప్పి మాయమయింది.

ఇదేదో కాకతాళీయం అనుకోవటానికి వీలులేదు. లోగడ ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఏకా పుండరీకాక్షయ్యగారు, రాజుపాలెం రామచంద్రరావు గారు, ఇలాంటి అదృష్టాన్ని పొంది ఇందుకు సాక్షీభూతంగా నిలిచారు. అలాగే మోగులూరు రామచంద్రరావుగారు కూడా ఒకసారి దారిలో గోతిలో పడి కాలువిరిగి కట్టుతో జిల్లెళ్ళమూడి వస్తే అమ్మ కరస్పర్శతో ఆ కాలు అతుక్కుని నొప్పి మాయమయింది.

ఒకసారి అమ్మ చిన్నతనంలోనే ఒక తాత మరణిస్తే అతనిని పునర్జీవుతుణ్ణి చేసింది. మరోసారి రైల్లో ప్రయాణిస్తూ ఒక పిల్లవాడిని తన స్పర్శతోనే ప్రాణదానం చేసింది. అలానే ఒకసారి సీతాపతి తాతగారు మరణించారని అందరు అనుకున్నారు. డాక్టర్లు కూడా ధృవీకరించారు. అమ్మమ్మ వగైరాలు గొల్లుమన్నారు. కాని అమ్మ అమృత స్పర్శతో పునర్జీవులైనారు.

అమ్మ తనవాత్సల్య యాత్రలో కృష్ణాజిల్లా పర్యటనలో మందపాడు హరిజనవాడకి వచ్చింది. అక్కడ ఒక కన్య కొన్నాళ్ళుగా మతిభ్రమణంలో బాధపడ్తూ నిరాహారి అయి మృత్యుశయ్య చేరిన ఆమె వద్దకు అమ్మ వెళ్ళింది. ఆదరంతో ఆకన్య కరగ్రహణం చేసింది. నాడి చూసింది. ప్రేమగా నొసటన నిమిరింది. అంతే మరునాటికి ఆకన్య సుస్థిర మతీ, ఆరోగ్యవతి అయి అందరికి ఆశ్చర్యం కలిగించింది.

ఇలాంటిదే మరో సంఘటన శ్రీ గరుడాద్రి సుబ్రహ్మణ్యంగారి అన్నయ్య వెంకట సుబ్బయ్య గారి విషయంలో జరిగింది. ఆయనకు ఆరునెలలుగా పచ్చ కామెర్లు. అందుకు ఎంతోమంది డాక్టర్ల దగ్గర ఎన్నో చికిత్సలు పొందాడు. కాని లాభం లేకపోయింది. లివర్ పూర్తిగా చెడిపోయింది. అతని బ్రతుకుపై అందరు ఆశలు వదులుకున్నారు; అలాంటి స్థితిలో ఉన్నవాడు కూడా అమ్మ కర స్పర్శతో పునర్జీవితుడైనాడు.

ఇంతెందుకు ఎవరు ఎన్ని కష్టాల్లో ఉండి అమ్మ దగ్గరకు వచ్చినా వారికి ఉపశమనం అమ్మ అమృత స్పర్శలోనే. వారు అమ్మదగ్గరకు రాగానే వారి వయస్సుతో సంబంధం లేకుండానే అమ్మ చేసేది ఒకటే. దగ్గరగా తీసికొని లాలనగా, తలా, బుగ్గా నిమిరేది. చేతిలో ఉన్న అరటిపండో, మరో ఫలమో వారికి ప్రేమగా తినిపించేది. అంతే అవతలవాడు ఎంతటివాడైనాసరే ఎంతటి చక్రవర్తి అయినా దుఃఖము ఆపుకోలేకపోయేవాడు. శ్రావణపయోధ రాలు కుంభవృష్టి కురిసిన పిమ్మట గగనమండలం నిర్మలమై శుభ్రమై కాంతివంతమయినట్లు ఆ దుఃఖం తర్వాత అనంతమైన ఓదార్పులు లభించేది. అలా ఆ తల్లి స్పర్శ అనంత ఓదార్పునిచ్చేది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!