శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాదుగారు అమృత హృదయుడు. స్నేహశీలి. నిర్మల సద్గుణనిరతుడు. పరసేవాపరాయణుడు. నిత్య సాహిత్యవ్రతుడు. పద్యకవితా రచనాధురంధరుడు. జిల్లెళ్ళమూడి అమ్మ తనకు ధారక పోషకములుగా భావించువాడు. నిరంతరం జయహెూమాత! అని మాతృపదార్చన సల్పువాడు. సహస్రాధిక సభానిర్వహణ సమ్రాట్టు. సాహితీ రూపకాలలో, విప్లవకవిగా, తెనాలి రామకృష్ణునిగా ప్రేక్షకుల కరతాళధ్వనులను కొల్లగొట్టినవాడు. సద్గృహస్థు. అన్నగారైన కుర్తాళం పీఠాధిపతులు సాహితీపుంభావసరస్వతులను నిరంతరం ప్రేమించువాడు. ఆయన పది విషయాలు చెబితే, అన్నారు. అందులో ఐదు జిల్లెళ్ళమూడి అమ్మ గారిని గురించే.
నిజంగా గృహస్థ ధర్మం సక్రమంగా నిర్వర్తించిన వారిలో ఆద్యుడు. పెద్దనగారు మనుచరిత్రలో గృహస్థుని గూర్చి వర్ణించిన విశేషాలు నూటికి నూరుపాళ్లు వీరికి అన్వయిస్తాయి. ఆనుకూల్యమైన దాంపత్యం. వినమ్ర సంతానం. తండ్రి మాటకు జవదాటనివారు. దువ్వూరు రామిరెడ్డిగారు చెప్పినట్లు ఆయన యింటో తినక త్రావకపోయిన సాహితీమిత్రులుండరు. ఆయన యిల్లాలు మహాసాధ్వి. “అన్నపూర్ణకు ముద్దియౌ అతని గృహిణి, అతిథు లేతేర నడకి రేయైనదెట్టు” అన్నట్లుగా అపరాత్రి అర్థరాత్రి అనే భేదభావం లేకుండా వీరు తీసికొని వచ్చిన అతిథులకమృతాహారం వండి వడ్డించేది. ఆయన కుమారులందరిని విద్యాపరిణతులు చేశారు. అందరు ఉన్నత విద్యావంతులే. ఉన్నతోద్యోగ పదవీ విరాజితులే. ఆచార్యకత్వం చేస్తున్న పెద్దకుమారుడు అకాల మరణంపాలైనా భార్య స్వర్గస్థురాలైనా చలింపని స్థితప్రజ్ఞుడు.
ఎన్నో పద్యకావ్యాలు వ్రాశారు. నిరంతర సాహితీ వ్రతుడు. అనుమానంవస్తే నివృత్తి చేసుకొనేదాకా విడిచేవారుకాదు. ఈ మధ్యకాలలంలో తనకీ జీవితంపై విరక్తి జనించిందని, తనను వెంటనే తన యొద్దకు చేర్చుకొమ్మని అమ్మను ప్రార్థిస్తూ నూరు పద్యాలదాకా వ్రాశారు. నేను చూచి “అయ్యా! అప్పుడే ఏమితొందర? మనచేతిలో లేదుగదా!” అంటే “వృషాద్రిపతిగారూ ఎన్నాళ్లు బ్రతికినా యింతేకదా! నవ్యత్వ మేముంది? ఎప్పటికైనా అందరం అక్కడకు చేరవలసిన వారమే కదా!” అన్నారు.
దానశీలి తనకు నచ్చిన పుస్తకమైతే సొంత డబ్బులిచ్చి అచ్చువేయించేవారు. ముద్రణకోసం ముందే పెట్టుబడి పెట్టేవారు. పేదసాదల నాదుకోవాలనేవారు. ఒకసారి నేనూ పి.యస్.ఆర్. గారు గురువుగారు కూర్చుని ఉండగా వీరి దానగుణాన్ని నే నభినందించాను. అప్పుడు గురువుగారు, “వాని దగ్గర డబ్బెక్కు వున్నదిలే ఇవ్వనీయవయ్యా!” అన్నారు. అప్పుడాయన ‘నాకు పెన్షన్లు వస్తాయి. మా పిల్లలు వారి సంపాదనవారు చేసుకొంటూ హాయిగా జీవిస్తున్నారు. వారు “నాన్నగారూ! మీ పెన్షన్ డబ్బులు మేమాశించం. మీరు ఖర్చుపెట్టుకోండి. మీ యిష్ట” మన్నారు. నేనేం చేసుకుంటాను? అన్నారు. ఆయన హృదయం వైరాగ్యభాసుర మైందనటానికింతకన్న ఇంక ఋజువేంకావాలి?
ఆయన మాజేటిగురవయ్య హైస్కూలులో ఆఫీసు స్టాఫ్ హెడ్ గా పనిచేశారు. తన చేతిలో ఉన్న పనిని వెంటనే చేసి వారి కృతజ్ఞతకు పాత్రులయ్యేవారు. అందరికీ తలలోని నాల్కగా ఉండేవారు. ఏదైనా తన కిష్టం లేనిదైతే ముఖంమీద కుండబద్దలు కొట్టేవారు. ఏమాత్రం సంశయం ఉండేది కాదు. ఎవ్వరితోనైనా అంతే. అందుకే ఉద్యోగాంతంలో కూడా అందరకూ ఆయన ప్రీతిపాత్రుడైనాడు. సహృదయ శేఖరుడుగా ఖ్యాతి నందుకొన్నారు.
గురువుగారితో కలసి ఆసేతుహిమాచలం పర్యటించారు. అన్నగారికి అన్నివిధాల విశ్వాస పాత్రునిగా ఆయనను సేవించారు. శ్రీ పి.యస్.ఆర్ పేరుతో ప్రసిద్ధుడైన యీయన శరీరమెక్కడున్నా ఆత్మ జిల్లెళ్ళమూడిలో ఉండేది. ప్రతి క్షణం తలచుకొనేవారు. ఆయన ఆత్మ అమ్మ సన్నిధిలో ప్రశాంతితో ఉందని, అక్కడ ఆయన తన అర్ధాంగిలక్షితో, జ్యేష్ఠ పుత్రునితో అమ్మ సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నారని ప్రగాఢ విశ్వాసం. ***