ఏ ఇరువురి మధ్య అయినా ప్రేమ భావన ఉంటే దానికి మనం పెట్టుకున్న పేరే అనురాగం. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, తల్లీ బిడ్డలు, తండ్రీ కొడుకులు, ఆలూ మగలు, స్నేహితులూ… ఇలా అన్ని అనుబంధాలూ అనురాగంతో ముడి వేసుకుని ఉంటాయి. అయితే, సామాన్య మానవులమైన మన అనురాగం కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. కొందరి పట్ల మాత్రమే ఉంటుంది.
అమ్మ అనురాగానికి అవధి లేదు. అందుకే “సర్వత్రా అనురాగమే విరాగం” అని వైరాగ్యానికి సరికొత్త నిర్వచనాన్ని అనుగ్రహించింది అమ్మ. అందరి పట్ల అనురాగం గల మహానుభావులందరికీ ఈ నిర్వచనం చాల చక్కగా సరిపోతుంది. అందుకే అలాంటి వారి సన్నిధిలో ప్రతి ఒక్కరికీ పూర్తి ప్రేమను పొందిన అనుభూతి కలుగుతూ ఉంటుంది.
“నా గర్భతీపి సర్వత్రా ఉంటుంది”.. అని చెప్పిన అమ్మకు తన బిడ్డలందరి మీదా అనురాగం ఉంటుంది కదా. అందుకే.. “ఇది మమతల గర్భగుడి… విరాగిని కాదుగా నాన్నా! కాబట్టి అందరినీ చూసుకోవాలని ఉంటుంది” అని చాలా స్పష్టంగా చెప్పింది అమ్మ.
“ఒక లక్షమంది పిల్లలుంటే, అందరికీ ‘ రహి’ అని పేరు పెట్టుకుని, ఒక్కసారి ‘రహీ!” అని అందులో ఒక పిల్లవాడిని పిలిస్తే, అందరూ ఒక్కసారి ‘ఓయ్’, ‘ఓయ్’ అని పలికితే- అబ్బా! అప్పు డెట్లా ఉంటుంది?” అనే కోరిక గల ఈ తల్లి అనురాగమూర్తి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, పదులూ వందలూ కాదు. ఏకంగా లక్షమంది పిల్లలను ఒకే పిలుపుతో పలకరించాలనీ, వారంతా ముక్త కంఠంతో ‘ఓయ్’ అని పలకాలనీ కోరుకుని, మురిసి పోయినవారు ఈ ప్రపంచంలో అమ్మ కాక మరొక రున్నారా?
మరొక సందర్భంలో… లక్ష ఊయలలు కట్టి, వాటిల్లో లక్షమంది పసి పాపలను పడుకోబెట్టి, అన్ని ఉయ్యాళ్ళూ ఊపుతుంటే ఎంత బాగుంటుందో… అని మన ఊహకు కూడా అందని ఒక అద్భుత దృశ్యాన్ని మన కనులకు కట్టించిన మహనీయమూర్తి అనురాగాన్ని అంచనా వేయగల శక్తి ఎవరికి ఉంటుంది?
“నేనంటూ కదిలితే….. ప్రతి ఇంటికీ రాగలగాలి. కూలీనాలీ చేసుకునేవాళ్ళూ, చెంచులవాళ్ళూ, పాకీ వాళ్ళూ అందరి ఇళ్ళకూ వెళ్ళగలిగితేనే ప్రయాణం అనేది పెట్టుకుంటా” అని ఆలోచించే అమ్మ అనురాగానికి అరమరికలు లేవు.
అమ్మ అనురాగం అక్కడితో ఆగలేదు. ఎంత దూరం వెళ్ళిందో అమ్మ మాటలే మనకు పరమ ప్రమాణం. ” అమ్మకు ఏమీ పెట్టలేం కదా’… అనుకునే వాళ్ళుంటారు. వాళ్ళకు నేనే పెట్టి, వాళ్ళచేత పెట్టించుకోవాలి.”… అని ఆ అనురాగ హృదయం ఆరాట పడింది.
పోనీ ఇక్కడితో తృప్తి పడిందా ఆ తల్లి మనస్సు. లేదే! ” చూడాలని ఉన్నా రావటానికి కాళ్ళు లేనివాళ్ళూ, కుంటీ, గుడ్డీ, ముసలీ, ముతకా… అందర్నీ నేనే వెళ్ళి చూసి రాగలగాలి. అట్లా అయితే బయల్దేరాలి”.. అని అన్నది అమ్మ. అంటే తాను జిల్లెళ్ళమూడి నుంచి ప్రయాణమై ఏ ఊరుకైనా వెళ్ళాలి అంటే ఇంత ఆలోచన చెయ్యాలి- అని చెప్పిన అమ్మకు తన బిడ్డలందరిపై ఎంత అనురాగమో కదా!
“కుష్టువాళ్ళకూ తినాలని ఉంటుంది కదా! వాకిళ్ళ ముందు తిరిగే వాళ్ళ కేదయినా దొరుకుతుంది. కానీ, హాస్పిటల్లో పెట్టీ, పెట్టకా… కనుక వాళ్ళకు పెట్టాలి”… అని ఆలోచించిన అమ్మ మనసులోని అనురాగం ఏ కొలబద్దకు అందుతుంది? మాటలకు మాత్రమే పరిమితం కాలేదు అమ్మ ప్రేమ. బాపట్ల లోని కుష్టువారి ఆసుపత్రిని సందర్శించి, వారిని సమాదరించి, తన మాటలను అక్షరాలా ఆచరించి చూపిన అనురాగ వల్లరి అమ్మ.
అమ్మ ఎక్కడికైనా ప్రయాణం అనుకుంటే దారిలో కనిపించేవారికి ఇవ్వడానికి ఏదో ఒకటి పట్టుకెళుతూ ఉంటుంది. అలా ఒకసారి మన్నవ వెళుతూ పటికబెల్లం వెంట తీసుకెళుతూ, అక్కడితో ఆగక దారిలో పదకొండు అరటి పళ్ళ గెలలు కొని, దారిపొడుగునా పంచుతూ వెళ్ళిందంటే ఆ తల్లి ఎంతటి అనురాగమయి!
మీకు డబ్బు ఉన్నది కనుక రమ్మని అడగ్గలుగుతున్నారు…. కానీ డబ్బు లేనివాడు అడగలేడు కదా! నాకు ప్రతి వాడి దగ్గరకూ వెళ్ళాలని ఉంటుంది. ఉన్నవాడు కారుల్లో తీసుకెళ్ళవచ్చు. గాలి గదుల్లో ఉంచ వచ్చు. కానీ, లేనివారు ‘ మనం అమ్మకు అన్ని సౌకర్యాలూ చెయ్యలేం కదా’ అని నన్ను రమ్మని అడుగలేరుకదా! నేను అటువంటి వారి ఇళ్ళకు కూడా వెళ్ళ గలిగిన నాడు బయల్దేరుతాను”… అని డబ్బులున్న వారి కంటే డబ్బులు లేని పేదవారి గురించి ఆలోచించిన అమ్మ హృదయంలోని అనురాగపు లోతులు తెలియగల వారెవ్వరు?
వివక్ష ఎఱుగని, విచక్షణ లేని అమ్మ… రూపు కట్టిన అనురాగమే కదా….
—
విజయనగరంలో అమ్మ కళ్యాణోత్సవం
అమ్మ కళ్యాణోత్సవ సందర్భంగా జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి విజయనగరం సభ్యుల ఆధ్వర్యంలో 5-5-2023 వ తేదీన Pushapagiri Eye Hospital లో సుమారు రెండు వందల మందికి అమ్మ ప్రసాదం (భోజనం) అందించబడినది. శ్రీ శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి, నిత్య అన్నప్రసాద వితరణ సేవా ట్రస్టు వారు భోజనసదుపాయం పులిహోర చక్రపొంగలి అన్నం కూర సాంబారు పెరుగన్నం లడ్డు అందించారు. వారికి ధన్యవాదాలు మరియు అమ్మ ఆశీస్సులు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు త్రినాథరావు, రంగాచార్యులు, తులసీరావు, మోహనరావు, గోవిందరాజు, గొట్టాపు రామారావు, సరిత రామారావు, రామ్మోహన్, రమణ, మాచర్ల ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.