1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మంటే – అన్నపూర్ణ

అమ్మంటే – అన్నపూర్ణ

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : September
Issue Number : 2
Year : 2022

‘అన్నపూర్ణ’… అంటే భారతదేశంలో తెలియని వారు ఉండరు. కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణాదేవి అష్టకం చదివిన తరువాతనే అన్నం తినేవారు ఈ భారతావనిలో ఎందరో ఉన్నారు. తనకు కొన్నిరోజులుగా అన్నం దొరక లేదని కాశీపైనే అలిగి, కాశీక్షేత్రాన్నే శపించాలని అనుకున్నాడు వ్యాసమహర్షి. అలాంటి వ్యాసుణ్ణి, అతని పదివేలమంది శిష్యులతోసహా ఆదరించి, విందు భోజనం పెట్టి, వారి ఆకలి తీర్చిన తల్లి అన్నపూర్ణాదేవి. అలాంటి అన్నపూర్ణాదేవి అపరావతారమే అర్కపురిలో అడుగిడిన అనసూయమ్మ.

“నా రాశి బియ్యపు రాశి” అని ప్రకటించిన అమ్మ అన్నావతారమే. అంటే సాక్షాత్తూ అన్నపూర్ణాదేవియే. ‘అన్నపూర్ణ’ అంటే అన్న సమృద్ధికి ప్రతీక. జిల్లెళ్ళమూడిలో ఆనాటినుండి ఈనాటివరకు అన్నార్తులకోసం అన్నం గుండిగ ఆదరంగా ఎదురుచూస్తూ ఉంటుంది అనటం అతిశయోక్తి కాదు.

“జిల్లెళ్ళమూడికి ఎవరైనా ఆకలితో రావచ్చును కానీ, జిల్లెళ్ళమూడి నుంచి ఒక్కరైనా ఆకలితో వెళ్ళకూడదు” అనేది అమ్మ ఆదేశం. అమ్మ భౌతికంగా తిరుగాడిన ఆరోజుల నుంచీ ఈరోజు వరకూ అమ్మ సంకల్పం అలా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఆనాడే ” ఇది జగన్నాథుని రథం. కదిలితే ఆగదు.” అన్నది తాలు మాట లేని అమ్మ.

“ఈ కలిలో నా కాకలి లేదు” అని చెప్పిన అమ్మ చిన్నతనం నుంచీ కూడా ఒక దగ్గర కూర్చుని పట్టె డన్నం తిన్న సంఘటన కనిపించదు. తనకు పెట్టిన అన్నాన్ని పశుపక్ష్యాదులకూ, బిచ్చగాళ్ళకూ, సన్యాసులకూ పెట్టి, తాను తిన్నట్టుగా తృప్తిగా త్రేన్చేది. ” మీరు తింటే నేను తిన్నట్టే”, ” మీకు పెట్టుకోక పోతే నేను చిక్కి పోతాను” అని తాను తినకుండా మనకు కడుపునిండా అన్నం పెట్టి ఆకలి తీర్చిన తల్లి అన్నపూర్ణే కదా!

“అడగకుండా పెట్టేదే అమ్మ” అని క్రొత్తగా నిర్వచించడమే కాక, “అన్నం పెట్టడానికి ఆకలే అర్హత” అని స్పష్టంగా చెప్పింది అమ్మ. దేనికైనా పాత్రతను బట్టి మనం దానమో, ధర్మమో చేయవచ్చు. కానీ అన్నం పెట్టడానికి ఏ అర్హతా అక్కరలేదు. ఆ వ్యక్తికి ఆకలి ఉంటే చాలు అనేది అమ్మ సిద్ధాంతం. అందుకే అన్నం పెట్టటానికి డ్రస్సుతో, ఎడ్రస్సుతో పని లేదు… అని చాల స్పష్టంగా చెప్పింది అమ్మ. మన ఇంటికి ఆకలితో వచ్చినవాడు ఎవరైనా.. ఆఖరికి గజదొంగైనా, ప్రబల శత్రువైనా సరే వాడికి కడుపునిండా అన్నం పెట్టాలనేదే అమ్మ సందేశం.

లక్షమంది తిన్నప్పటికీ ఒక్కడు తినకపోయినా ఆ తల్లి మనసు తల్లడిల్లి పోయేది. ” ఒక్కడు చాలడూ తినకుండా వెళితే” అని బాధపడే అమ్మ అన్నపూర్ణకు అపరావతారమే.

తన స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా “ఒకే పంక్తిలో లక్షమంది భోజనం చేస్తుంటే చూడాలని ఉంది” అని కోరిన అమ్మకు తన బిడ్డలకు అన్నం పెట్టుకోవడంలో ఆనందం అనిర్వచనీయం.

ఒకసారి అంధుడైన భక్తునితో “భోజనం చేసి రా” అని, “తీసుకెళ్ళి అన్నం పెట్టించండి” అని చెప్పటంతో ఆగలేదు అమ్మ. ఆ అంధుని తీసుకుని వచ్చిన రిక్షా అతనికి కూడా పిలిచి అన్నం పెట్టించండి” అని చెప్పిన తల్లి అన్నపూర్ణ కాక మరెవరు?

ఇతరులకు అన్నం పెట్టాలనుకోవటం అమ్మ ఒకరిని చూసి నేర్చుకున్నది కాదు. ఈ లక్షణం అమ్మ స్వభావంలోనే ఉన్నది.

తన చిన్న వయస్సులోనే అమ్మ…. మధూకరం కోసం వచ్చిన బిచ్చగాళ్ళకోసం అన్నం అడిగి పెట్టించుకుని మరీ పెట్టి వచ్చేది. తన కోసం ఎప్పుడూ, ఎవరినీ అన్నం అడుగని అమ్మ అన్నార్తులకోసం అన్నం పెట్టించుకుని

వాళ్ళకు పెట్టి సంతోషించేది.

పెళ్లి నాటికి అమ్మ వయసు నిండా పదమూడేండ్లు అయినా లేవు. కాని, ఆ నాడే అమ్మ పెళ్ళికి వచ్చిన అందరినీ “భోజనం చేసి వెళ్ళ” మని చెప్పింది.

జిల్లెళ్ళమూడిలోని భోజనశాలకు అమ్మ పెట్టిన పేరు ‘అన్నపూర్ణాలయం’. అంటే అక్కడ అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటుందనుకుంటే పొరపాటు. అక్కడ అన్నపు రాశియే అన్నపూర్ణాదేవి. అంటే ఎప్పుడూ (24/7) అన్నం గుండిగ నిండుగా ఉండే చోటు అన్నమాట. “అన్నపూర్ణాలయం నా గుండె” అని చెప్పిన ఆ తల్లి అన్నపూర్ణయేగా మరి!

ఆ అన్నపూర్ణాలయంలో ఒక నిర్ణీత సమయ మంటూ లేకుండా నిరంతరమూ ‘అన్నం’ వడ్డన జరుగుతూనే ఉంటుంది.

‘ఇదెలా సాధ్యం’ అనుకునే వారికి – “దీన్ని గురించి ఆలోచించే పని లేదు. అంటే అంతటా పెట్టేది నేనై నప్పుడు ఇక్కడ గురించి ఆలోచనే లేదు.” అని చెప్పిన అనసూయమ్మే అన్నపూర్ణ.

అమ్మను దర్శించి, పూజించుకోవాలని ఎక్కడెక్కడనుంచో వేలాదిగా వచ్చిన వారికి, మౌనంగా చేతి సన్న గానీ, లేదా “భోజనం చేసి రా” అనే చిన్న మాట కాని అమ్మ నుంచి వెలువడే మొదటి పలకరింపు.

“నీ కున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అనేది అన్నపూర్ణ అపరావతారమైన అమ్మ మనకు చేసిన ఉపదేశం.

ఉదారంగా అన్నప్రసాద వితరణం.

శ్రీ తనుకొండ శ్రీకృష్ణదేవరాయలుగారు మరియు వారి కుటుంబ సభ్యులు అమ్మ అనుగ్రహసిద్ధ్యర్ధం, ఇష్టకామార్థ సిద్ధ్యర్ధం అమ్మ అన్నప్రసాదవితరణకు వరుసగా పదిరోజులకుగాను రు.50,000/- లు విరాళమును అందించారు. వారు, వారి కుటుంబ సభ్యులపై అమ్మ శుభాశీస్సులు సదా వర్షించుగాక!!

– S.V.J.P. Trust, జిల్లెళ్ళమూడి

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!