1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మంటే ఎవరు ?

అమ్మంటే ఎవరు ?

Gamteda Chinnam Naidu
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : August
Issue Number : 1
Year : 2013

(గతసంచిక తరువాయి భాగం)

“అనుకున్నది జరగదు తనకున్నది తప్పదు” అని చెప్పి వేదనాభరితమైన మానవ సమాజానికి గుండె ధైర్యాన్ని నూరిపోసింది అమ్మ. అడుగడుగున ముహూర్తాలు ముసుగులో మగ్గిపోతూ ప్రతి కష్టానికి ముహూర్తమే కారణమన్న భావనతో నలిగిపోతున్న సంకుచిత స్వభావులకు “తిథులు విధిని మార్చలేవని” “పెట్టింది ముహూర్తం కాదని – జరిగిందే ముహూర్తమని” వివరించి మనసులోని మానవ సందేహాలను మటుమాయం చేసింది. ఎంతో గొప్ప సందేశమిది. “మంచితనం, మానవత్వాన్ని మించిన మహిమలు లేవని” “నీకున్నది తృప్తిగా తిని నలుగురికీ ఆదరంగా పెట్టుకోమని ఆచరించి చూపింది అలా మనల్నీ నడుచుకోమని చెప్పింది. ఏది జరిగినా అంతా దైవమే చేస్తున్నాడనుకోమని ప్రబోధించింది. గీతాసారాన్ని బోధించిన కృష్ణతత్త్వం… అమ్మతత్త్వం ఒకేలా అన్పించడం లేదూ? అందర్నీ నేనే కన్నాను. కాకపోతే ఆయా తల్లులకు పెంపుడిచాను అని అనడం ఎవరి వల్ల నవుతుంది. విశ్వజనని అమ్మకు గాక. “మహాతత్త్వానికి మహిమలతో పనిలేదు” అని చెప్పింది అమ్మ. ఇదే విషయాన్ని స్వామి వివేకానంద కూడా చెప్పారు. స్వామి తన శిష్యబృందానికి, మిత్రులకు లేఖల ద్వారా ఏమని చెప్పారంటే శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క జీవితచరిత్రను, తాను ప్రపంచానికి, లోకకళ్యాణానికి చేసిన జ్ఞానబోధనలు గురించి మాత్రమే ప్రచారం చేస్తూ రచనలు చేయండి తప్ప మహిమలు- మంత్రాలు, అతీంద్రియ శక్తులు. దివ్యదృష్టి అనే విషయాల గురించి చెప్పనవసరంలేదని, గురుదేవుల జీవితచరిత్రను తెలియచేస్తే చాలని – తక్కినవాటి గురించి వాటంతటవే ప్రపంచానికి తెలుస్తాయని చెప్పడం జరిగింది. అలాగే జిల్లెళ్ళమూడి అమ్మ కూడా ఎప్పుడూ మంత్రాలు. మహిమలు తాంత్రిక శక్తులు అనేవాటి జోలికి పోనే లేదు. తన చుట్టూ పిల్లల్ని పోగేసుకోవడం, పిల్లలకోడిలా వారితో ముచ్చట్లాడు కోవడం, కడుపునిండా అన్నం తినిపించడం వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి మురిసిపోవడం. అల్పమైన వాక్యాల్లో అనల్పమైన అర్థాలను వివరిస్తూ జీవిత సత్యాలను బోధించడం …. సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడం. ఇలా అమ్మ ఓమంచం మీద కూర్చొని మాట్లాడుతున్నట్లు కన్పిస్తూ మనల్ని మాయలో పడేస్తూనే ప్రపంచంలో ఎక్కడ ఏమూల తన బిడ్డ తలుచుకున్నా, కష్టాల కడలిలో కూరుకుపోతున్నా, వెంటనే వార్ని ఏదో రూపంలో ప్రత్యక్షమై ఆదుకుంటుంది శ్రీమన్నారాయణుడిలా …. ఆదిపరాశక్తి దుర్గాదేవిలా అలా జరిగిన సందర్భాలు కోకొల్లలు. కొన్నిసార్లు డాక్టర్లే ఇంక బ్రతకడం కష్టమని చెప్పేసిన కేసుల్లో – అమ్మే స్వయంగా డాక్టరవతారమెత్తి రోగాలను నయం చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. అసాధ్యమనుకున్న ఎన్నో పనులు ఆశీర్వాదబలంతో సాధ్యమైన సంగతు లనేక మున్నాయి. ఇవన్నీ నిజమా ? అని అనిపించక తప్పదు. కానీ నమ్మాలంటే – ముందు విశ్వాసం కావాలి. ఎందుకంటే “విశ్వాసమే భగవంతుడని” కదా అమ్మ చెప్పింది.

– సశేషం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!