1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మంటే ధర్మం

అమ్మంటే ధర్మం

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : May
Issue Number : 10
Year : 2022

చరాచరాత్మకమైన సృష్టిలో ప్రతి దానికీ దాని ధర్మం దానికి ఉంటుంది. ప్రేమ లాగానే ధర్మానికి కూడా రూపం ఉండదు.

నీటికి ప్రవహించడం ధర్మం. నిప్పుకు కాల్చి వేయడం ధర్మం. గాలికి ఎగుర కొట్టడం ధర్మం. అవి తమ పనుల ద్వారా తమతమ ధర్మాలను తెలియచేస్తున్నాయి.

క్రిమి కీటకాదులకు, పశుపక్ష్యాదులకు కూడా వాటి వాటి ధర్మాలు వాటికి ఉన్నాయి.

ప్రాణంలేని వస్తు సముదాయానికి కూడా దాని ధర్మం దానికి ఉంది.

మానవులకు కూడా ఈ ధర్మం పలురకాలుగా ఉంటుంది. కొన్ని వ్యక్తిగతమైనవి కాగా, కొన్ని

కుటుంబ పరమైనవి, మరికొన్ని సమాజం కోసం చేయవలసినవి. ఒక వ్యక్తి తండ్రిగా, కొడుకుగా తన ధర్మం నెరవేర్చ వలసి ఉంటుంది. తాను పనిచేసే సంస్థలో ఉద్యోగ ధర్మాన్ని పాటించవలసి ఉంటుంది. అలాగే స్త్రీలు తల్లిగా, కూతురుగా, భార్యగా, అత్తగా, కోడలుగా తన ధర్మాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. పాలకులకు, పాలితులకు కూడా ఎవరి ధర్మం వారికి ఉంది. ధర్మం లేనిది ఏదీ ఈ సృష్టిలో లేదనిపిస్తుంది.

అలాంటి ధర్మం ఎవరిలోనైనా, దేనిలోనైనా ప్రవర్తనద్వారా వ్యక్త మవుతూ ఉంటుంది. ‘ధర్మాధారా’ అయిన అమ్మ మాటల్లో, చేతల్లో, నడవడిలో ఈ ధర్మం ప్రతిక్షణం ప్రత్యక్షమవుతూ ఉంటుంది.

“తెలియనిది తెలియచెప్పటానికే నా రాక” అని స్పష్టంగా చెప్పిన అమ్మ మనకు తెలియని ఎన్నో ధర్మాలను తాను ఆచరించి మనకు మార్గ దర్శకత్వం వహించింది.

“ధర్మం కోసం తల్లి కాదు; తల్లి ధర్మం చూపించటానికే” అని చెప్పిన అమ్మ మొదటగా తల్లి ధర్మం ఏమిటో మనకు తెలియచేసే విధంగా ప్రవర్తించింది.

ధర్మాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం తల్లి బాధ్యత అని ఈ వాక్యానికి అర్థం. ‘తల్లి – ధర్మం’ అనే రెండు పదాలను కలిపి తల్లిధర్మంగా భావిస్తే అలాంటిది ఆ తల్లి ధర్మం మనకు చూపించటానికే అమ్మ రాక అని అర్థమవుతుంది.

అలాకాక, ‘తల్లి ధర్మం చూపించటానికే’ అని విభాగం చేసుకుంటే ధర్మం అంటే ఏమిటో చూపించడానికే ఈ తల్లి అవతరించింది అని మరొక అర్థం స్ఫురిస్తుంది.

అర్థం ఏదైనా ఇక్కడ మనం గ్రహించవలసినది ధర్మ స్వరూపమే అమ్మ అని. ‘నాకు ధర్మాలు పనికి రావు. నాది ప్రేమ తత్త్వం’ అని ఒక సోదరి అంటే “నీది ప్రేమ తత్త్వ మయితే ధర్మాన్ని ప్రేమించు” అని ఆ సోదరికి చక్కని సూచన చేసి, ధర్మం వైపు ఆమె దృష్టిని మరల్చిన అమ్మ ధర్మానికి ఇచ్చిన ప్రాధాన్యం తెలుస్తోంది.

ఒక సందర్భంలో ఒక సోదరి అమ్మను చూడటానికి జిల్లెళ్ళమూడికి వచ్చింది. అయితే అనుకోని విధంగా ఆమె వెంటనే తన భర్త వద్దకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది.

ప్రేమ ఉన్నా ధర్మానికి కట్టుబడక తప్పలేదు. అది అన్ని వందల మైళ్ళ దూరంనుంచి నాకోసం పరిగెత్తుకు వచ్చినా, భర్త దగ్గరకు పంపించటం నా ధర్మం.

ప్రేమ కంటే ధర్మం గొప్పదని ఋజువు చేసింది ఈ అర్జెంటు ప్రయాణం” అని అమ్మ అప్పటికప్పుడు ఆ సోదరిని భర్త వద్దకు పంపే ఏర్పాటు చేసింది.

ఆ సోదరిపై తనకు ఉన్న ప్రేమా, ఆ సోదరికి తనపై ఉన్న భక్తీ కాక ప్రస్తుతం పాటించవలసిన ధర్మానికి ప్రాధాన్య మిచ్చి, ఆమెను భర్త దగ్గరకు పంపిన ధర్మస్వరూప మన అమ్మ.

భార్యాభర్తల దాంపత్యం విషయంలో కూడా ధర్మానికి అమ్మ ఇచ్చిన ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. “(భర్త) ఎట్లాంటి వాడైనా సరే – ఆయన సేవ చేయటం నీ ధర్మం” అని ఒక సోదరికి ధర్మప్రబోధం చేసిన అమ్మ, అక్కడితో ఆగలేదు. “పురుషులకు ఏకపత్నీ వ్రత మొక్కటే వ్రత” మని స్పష్టంగా చెప్పి, ధర్మబద్ధమైన జీవితం గడపడానికి వారికి మార్గ నిర్దేశం చేసింది.

ధర్మాలను ప్రబోధించటం వేరు. ఆచరించటం వేరు.

అమ్మ… ఒక కూతురుగా, కోడలిగా, భార్యగా, తల్లిగా, అత్తగా, వదినగా… ఇలా గృహస్థ ధర్మంలో ఎన్ని బంధాలూ, అనుబంధాలూ, బాంధవ్యాలూ ఉంటాయో వాటన్నిటినీ పాటించి, ఉత్తమ ఇల్లాలుగా, తన ధర్మాన్ని ఏమాత్రం ఏమరుపాటు లేకుండా నిర్వర్తించి ధర్మానికి ఆధారంగా, ధర్మమే తానుగా మన మధ్య మసలిన తల్లి.

ఆ ధర్మానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ…

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!