అమ్మంటే ఎవరు?….
1923 వ సం.లో చైత్ర శుద్ధ ఏకాదశి నాటి తెల్లవారుజామున మన్నవ గ్రామంలో రంగమ్మా సీతాపతిగార్లకు పుట్టిన శిశువు. ఆ పిల్లకు వారు పెట్టుకున్న పేరు అనసూయ. పేరుకు మాత్రమే కాదు; తీరుకు కూడా అనసూయే ఆ తల్లి. జిల్లెళ్ళమూడి కరణంగారి భార్యగా వచ్చి, కాలక్రమేణ ‘జిల్లెళ్ళమూడి అమ్మ’ గా ప్రసిద్ధి కెక్కింది.
చిన్ననాటి నుంచీ ఎందరెందరో బిడ్డలకు ప్రేమను పంచి, ‘అందరి అమ్మ’గా ఈనాడు మన పూజల నందుకుంటున్నది.
ప్రేమంటే సర్వ సమర్పణ భావమే. ప్రేమకు రూపం లేదు. ప్రేమ అనేది ఒక మధుర భావన. అంటే, ప్రేమను మనసారా అనుభవించి ఆనందించవలసినదే.
అమ్మంటేనే ప్రేమ. అమ్మ ప్రేమకు కారణాలతో పనిలేదు. అది అవ్యాజము… ఆ తల్లి ప్రేమ సర్వ వ్యాప్తమైనది.
అలాంటి ఆ తల్లి ప్రేమ ప్రవాహంలో కుత్తుకబంటిగా మునిగి, ఆనంద డోలికలలో తేలియాడిన వారు ఎందరెందరో… అలాంటి వారిలో అస్సలు ఈ ప్రపంచ పోకడలే తెలియని అమాయకపు పసిపిల్లలే కాదు. ప్రపంచాన్ని కాచి వడబోసిన మహా మేధావులూ ఉన్నారు. లౌకిక విషయాలతో కొట్టుమిట్టాడే వారితో పాటు ఆధ్యాత్మికతలోని అంచులు చూసినవారూ ఉన్నారు. ఆస్తికులూ ఉన్నారు. నాస్తికులుగా ప్రసిద్ధి కెక్కిన వారూ ఉన్నారు. దేశీయులే కాదు; విదేశీయులూ ఆ తల్లి ప్రేమలో కరిగి పోయి… ఆమెను ప్రేమస్వరూపిణిగా దర్శించి, తరించినవారు ఉన్నారు. ఇలా ఎందరెందరినో తన ఒడిలోకి తీసుకుని ప్రేమతో లాలించిన ఆ తల్లి ప్రేమ అపారమైనది. అపురూపమైనది.
“ప్రేమ అనే మాట వచ్చు. ఎట్లా వ్రాయాలో తెలుసు. కాని, ప్రేమ ఏమిటంటే చెప్పలేరు.” అని చెప్పిన అమ్మ ప్రేమస్వరూపిణి.
“సృష్టే ప్రేమ మయం. సృష్టంటేనే మాతృత్వం.” అని చెప్పిన అమ్మ ఆ మాతృప్రేమను తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిపై ప్రసరించి, వారికి స్వచ్ఛమైన తల్లి ప్రేమను చవి చూపించింది. అమ్మలోని ప్రేమకు స్త్రీ- పురుష, బాల-వృద్ధ, పండిత పామర, బీద- ధనిక విచక్షణ లేదు.
కుల, మత, వర్గ భేదాలకు అతీతమైనది అమ్మ ప్రేమ.
ఆ తల్లి ప్రేమ విలక్షణమైనది, విశిష్టమైనది, వినూత్నమైనది, పరమాద్భుతమైనది, అపురూపమైనది. అందుకే అమ్మను దర్శించడం, స్పృశించడం, ఆమెతో సంభాషించడం వంటివి. మధుర స్మృతులుగా ఈనాటికీ మన హృదయాలలో నిలిచి ఉన్నాయి.
సహజ ప్రేమ అంటే – “దారిన పోయేవాడికీ, సంబంధం లేనివాడికీ సహాయం చేస్తే ఆ ప్రేమ అవ్యాజం. ఆ ప్రేమ సహజం.” అని చెప్పిన అమ్మకు ఈ సృష్టిలోని జీవరాసులన్నింటిపై ప్రేమే. అందుకే అంటుంది అమ్మ “నేను నీకు, మీకు, క్రిమి కీటకాదులకు, పశుపక్ష్యాదులకు కూడా తల్లిని.” ఇలా చెప్పిన అమ్మకు ఆ అందరింటి ఆవరణలోని కుక్కలు, పిల్లులూ, కోతులూ అన్నీ ప్రీతి పాత్రమైనవే. చీమా, దోమా కూడా ముద్దుబిడ్డలే.
బిడ్డ లందరికీ తీర్థ మిచ్చిన అమ్మ తనకు ఎదురుగా ఉన్న కుక్కకు కూడా తీర్ధ మిచ్చి, తన ప్రేమను దానిపై వర్షించింది. ఒక కోతి చనిపోతే దానికి యథావిధిగా అంత్యక్రియలు జరిపించింది. ఈ సంఘటన రామాయణంలోని జటాయువు వృత్తాంతాన్ని స్ఫురింప చేస్తోంది.
మంచివాళ్ళలోని మంచి అమ్మను ఏడిపిస్తుందిట. చెడ్డవాళ్ళలోని చెడుకు అమ్మకు జాలి వేస్తుందిట. అయితే అమ్మ ప్రేమకు ఇరువురూ అర్హులే.
ఒకసారి నక్సలైట్లు జిల్లెళ్ళమూడి ఆవరణలోకి ప్రవేశించి, అతలాకుతలం చేశారు. కొందరిని చంపే ప్రయత్నం కూడా చేశారు. వారిపై అమ్మ ఎలాంటి ఆగ్రహమూ ప్రకటించ లేదు సరికదా… వారిని గుర్తించేందుకు అమ్మ వద్దకు తీసుకు వస్తే, ‘ముందు వారికి ఆకలిగా ఉంది. అన్నం పెట్టండి’ అని చెప్పింది. అలాంటి ఆ తల్లి ప్రేమకు కొలమానం ఏముంటుంది?
అందరింటి సోదరులు కొందరు అమ్మ గదిని పాడుచేస్తున్న పిల్లి పిల్లలను తొలగించే ప్రయత్నం చేయబోతే, వారిని వారించిన ఆ తల్లి ప్రేమకు కొలబద్ద ఏదీ?
ఇలాంటి ప్రేమమూర్తి “జిల్లెళ్ళమూడి అమ్మ” ను గురించి ఎంత చెప్పినా, చెప్పవలసిన దెంతో ఉంటుంది.
ప్రస్తుతానికి సెలవా మరి…