పెద్దవారికి చిన్నవారిపై కలిగే ప్రేమకు మనం పెట్టుకున్న పేరే వాత్సల్యం. అయితే… అమ్మ విషయంలో వాత్సల్యం అంటే మనం అనుకున్న పై నిర్వచనం అంతగా సరిపోదు. ఎందుకంటే… అడ్డాల బిడ్డ దగ్గర నుంచి గడ్డాల తాత వరకూ అందరూ అమ్మకు బిడ్డలే. అందువల్ల అమ్మ తన చిన్ననాటినుంచే ఈ వాత్సల్య గంగలో ఎందరినో మునకలు వేయించి ఆనంద పరవశులను చేసింది.
చిన్నపిల్లగా ఉన్న అమ్మ రెండున్నర నెలలకు పైగా చిదంబరరావు తాతగారిని వదిలి, తన పినతల్లిగారైన భాగ్యమ్మగారి వద్ద ఉండిపోవలసి వచ్చింది. ఆ రోజుల్లో అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురి అయింది. అది తెలిసిన సీతాపతితాతగారు (అమ్మ తండ్రి) అమ్మను బాపట్లలోని చిదంబరరావు తాతగారింటికి తీసుకువచ్చారు. ఆ తాతగారు అమ్మతో ‘మమ్మల్ని వదిలిపెడితే నీక్కూడా దిగులుటమ్మా!’ అని ఆశ్చర్యం ప్రకటించారు.
వారితో అమ్మ ” నాకు అంత వాత్సల్యం లేకపోతే మీ దగ్గర ఎట్లా ఉంటాను?” అంటుంది. అప్పుడు వారు ‘వాత్సల్యం అంటే తల్లికో, తండ్రికో వర్తిస్తుంది. నీ వేమో పసిపిల్లవు కదా! అమ్మాయివి కదా!’ అని మనం సర్వసామాన్యమైన అర్థంలో వాత్సల్యం అంటే ఏమిటో వివరిస్తారు.
అప్పుడు అమ్మ ఇచ్చిన సమాధానం…“మాయి అంటే అమ్మ అనే”. అంటే అంత పసిప్రాయంనుంచే అమ్మ నిర్ద్వంద్వంగా తన విశ్వమాతృత్వాన్ని ప్రకటించి, తన వాత్సల్యామృతాన్ని అందరికీ పంచింది.
అందుకే, అమ్మ….
అడ్డాల బిడ్డలకు అన్నప్రాశన ఎంత గౌరవంగా చేస్తుందో, అంతే గారాబంగా గడ్డాల తాతలకు కూడా గోరుముద్దలు తినిపించి, వారిని ఆనంద పరవశులను చేస్తుంది.
బాల్య నుంచే అమ్మ తనకంటే వయస్సులో పెద్దవారిని కూడా బిడ్డలుగానే భావించి, వారిపై తన వాత్సల్యాన్ని కనబరిచేది అనటానికి మరొక చిన్న సంఘటన..
ఇంట్లోని వారంతా భోజనం చేసినా, బయటకు వెళ్ళిన రాఘవరావు మామయ్య ( అమ్మకు అన్నయ్య) అన్నానికి రాలేదు. చిన్నపిల్లగా ఉన్న అమ్మ ” అన్నయ్య ఇంకా అన్నానికి రాలేదు. అందరం తిన్నాము. తల్లికి ఒక బిడ్డ రాకపోయినా దిగులే” అని బాధ పడింది. వరస ప్రకారం అన్నయ్యగా చెప్పినా, వారిని కూడా అమ్మ తన బిడ్డగానే తలచింది. అంత చిన్న వయస్సులోనే అందరి పట్ల మాతృత్వ భావనతో ఉండటమే కాక, వారిపై మాతృ వాత్సల్యాన్ని కురిపించిన వాత్సల్యామృతవర్షిణి అమ్మ.
అందరింటిలో రకరకాల పనులు చేసి, అలిసిపోయి వచ్చిన పిల్లలు ఆకలిని కూడా మర్చిపోయి, ఆదమరచి నిద్రలోకి జారుకునేవారు. వాత్సల్య స్వరూపిణి అయిన అమ్మ తనకు లేని ఓపికను తెచ్చి పెట్టుకుని, లేచి వచ్చి, వాళ్ళందరికీ చక్కెర కేళీ వళ్ళు ఇచ్చి, తినమని చెప్పేది. అయినా అమ్మకు తృప్తి కలిగేది కాదు. వారు నున్నవువని చేసినందువల్ల వారి చేతులు పుళ్ళు వడి, అన్నం కలుపుకోలేక పోయేవారు. అమ్మ తన నీరసాన్ని ప్రక్కకు పెట్టి, వాళ్ళకు స్వయంగా అన్నం కలిపి ముద్దలు నోట్లో పెట్టి, వాళ్ళ ఆకలి తీర్చేది.
“పనులు చేసే పిల్లలకు వకోడీలు చేసి పెడుతున్నారుట. రేవు ఇడ్లీ చేసి పెట్టండి. జబ్బు చేయదు. తోడు పెట్టిన తియ్యటి పెరుగు వెయ్యండి” అని ఆ పిల్లలకు ఏది పెట్టాలో నిర్దేశించిన ఆ తల్లి వాత్సల్యానికి అవదు లేవి?
“కాస్త చల్లార్చి పెట్టమ్మా! ఆ పసికాయలకు. పెద్దవాళ్ళే ఆ వేడిని చల్లార్చుకుని తింటున్నారు. పసిబిడ్డలు కదూ! వాళ్ళ బాధ మన కేమి తెలుస్తుంది? అది తినాలన్న ఆపేక్షతో నాలుక కాలుతున్నా సహిస్తున్నారు. లేత చేతులు ఆ వేడిని భరించలేవు. చల్లార్చి పెట్టండి.” అని పెట్టే పదార్థాన్ని ఎలా పెట్టాలో కూడా విడమరచి చెప్పిన వాత్సల్యాంబుధి అమ్మ.
ఇలా ఒక్క మానవుల విషయంలోనే కాదు. సర్వ జీవుల పట్ల ఇదే వాత్సల్యాన్ని చూపించిన అమ్మ వాత్సల్యానికి అవధి ఏది ? కుక్క పిల్లను కూడా ఇంత వాత్సల్యంతో చేరదీసి, పెంచి, పెద్ద చేసిన తల్లి. కాకులకు నేతి గారెల ముక్కలు వేస్తూ, అవి ముక్కులతో ఆ ముక్కలను అందుకుని తింటుంటే ఆనందించిన తల్లి.
“ఒక దోమ వచ్చి ముద్దు పెట్టుకు న్నట్లిక్కడ పట్టుకుంది” అని దద్దు రెక్కిన తన బుగ్గను చూపించి, ఆ దోమపై కూడా తన వాత్సల్యాన్నే ప్రకటించింది అమ్మ.
జిల్లెళ్ళమూడి గ్రామాన్ని ముంచెత్తి వేసిన వరద ప్రవాహానికి హారతి నిచ్చి, ఇంటికి వచ్చిన ఆడబడుచుగా గౌరవించి, సాగనంపినట్లు చీర సారెలతో పనుపు కుంకుమలతో ఆదరించిన ఆ తల్లి వాత్సల్యం అద్వితీయం, అత్యద్భుతం, అపూర్వం. ఇలా అమ్మ వాత్సల్య వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే..