‘సహన’ మంటే మనం సర్వసాధారణంగా చెప్పుకునే అర్థం ఓర్పు అని. ఓర్పు అంటే శరీరానికి వచ్చిన ఎంతటి బాధనైనా, మనసులో కలిగే ఎలాంటి వ్యధనైనా ఓర్చుకునే శక్తి. ఇది కొందరిలో సహజంగానే ఉంటుంది. మరికొందరు ప్రయత్నపూర్వకంగా అలవరచుకుంటారు.
అలాంటి సహనం అమ్మకు జన్మతః వచ్చిందే కాని, నేర్చుకున్నది కాదు. పసితనంలోనే కన్నతల్లిని కోల్పోయిన అమ్మను చిన్నపిల్ల అని కూడా ఆలోచించకుండా మాటలతో, చేతలతో కొందరు బాధించినా చిరునవ్వుతో వాటిని అనుభవించిన సహన దేవత అమ్మ. ఎవరు తనను ప్రేమించినా, ప్రేమించక పోయినా తాను అందరినీ ప్రేమించాలని కోరుకున్న మహోన్నత మానవతామూర్తి మన అమ్మ..
“సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజాద్రవ్యాలు కావాలి” అని చెప్పిన అమ్మ తన ప్రవర్తనలో మానవాళికి ఆదర్శంగా నిలిచింది. అమ్మ అంటే సహనానికి మరో రూపం కాదు.. రూపు దాల్చిన సహనమే.
చిన్నతనంలోనే తన తాతగారు చిదంబరరావుగారికి వివిధ రూపాలలో దర్శన మిచ్చి, చివరగా, ఒక ఇంట్లో సేవకురాలిగా కూడా కనిపించింది. ఆ స్త్రీమూర్తి పడుతున్న బాధలు తెర మీది బొమ్మల లాగా కనిపించాయి. అవి చూసి తట్టుకోలేక చిదంబరరావు తాతగారు ‘సహన మనే దేవతను ఆరాధిస్తున్న తల్లీ!’ అని పెద్దపెద్ద కేకలు పెట్టి పడిపోయారు. మూసుకున్న ఆయన కన్నులకు “సహజ సహనం” అనే పెద్ద అక్షరాలు బంగారు రంగులో కనిపించాయి. అంతేకాదు. ఆ అక్షరాల క్రింద అమ్మపోలికతో ఒక బాలిక కనిపించింది. అంటే ఏమిటి? సహజ సహనం గల తల్లి మన అమ్మ. అందుకే “నాకు నేర్పు గల ఓర్పు అక్కర్లా. సహజమైన ఓర్పు కావాలి” అంటుంది అమ్మ.
చిన్నపిల్లగా ఉన్న అమ్మను భోజనాల బంతిలో తమ దగ్గర కూర్చోమని చిదంబరరావుగారూ, సీతాపతిగారు అడుగుతూ ఉన్నా భారతి అత్తయ్య (చిదంబరరావు గారి అమ్మాయి) కను సైగతో… వారికి దూరంగా కూర్చున్నది అమ్మ. ఆ సమయంలో అమ్మ మాటాడిన మాటలను… ఏమిటా పిచ్చి మాటలు… అని మందలించడంతో ఊరుకోక అమ్మజడ పట్టుకు లాగింది భారతి అత్తయ్య.
చిదంబరరావు తాతగారు గమనించి అదేమిటని ఆరాగా అమ్మను అడిగినా, తన వాక్చాతుర్యంతో తప్పించేసిందే తప్ప, విషయం చెప్పలేదు. అంతటి కష్ట సహిష్ణుత చిన్నతనంలోనే తన సొంతం చేసుకున్న తల్లి.. సహనానికి మారో పేరు.
“సహించడంలోనే సాధన ఉంది” అని చెప్పిన అమ్మ సహన మంటే ఏమిటో కూడా చెప్పింది. “బాధ తానై అనుభవిస్తూ, తన కేది వచ్చినా తొణకని స్థితి సహనం” అని వివరించింది.
చిన్నపిల్లగా ఉన్న అమ్మ ఒకసారి గుంటూరులో ఒక స్వామివారి వద్దకు వెళ్ళింది. అక్కడ ఒకరు అమ్మను పో పో అని కసురుకోవటంతో ఆగక, అమ్మ చెంపమీద చెళ్ళున కొట్టారు. ఈ గొడవ విని స్వామివారు అమ్మను లోపలికి పంపించమన్నారు. తన వద్దకు వచ్చిన అమ్మతో స్వామివారు.. ‘ఏమిటమ్మా మోత మ్రోగింది?’ అని అడిగారు. “రెండు కలిసిన శబ్దం” అని చెప్పి తన చేతితో తన చెంప మీద కొట్టుకుని చూపించింది. అది కొట్టుకున్నదా? కొట్టినదా? అని ప్రశ్నించిన స్వామివారితో… “మీరు చూడక విన్నది ఎవరో కొట్టింది. చూస్తూ విన్నది కొట్టుకున్నది” అని చెప్పి, ఇంకా వివరాలడుగుతున్న స్వామివారితో మనిషిని చూడలేదు” అని దాటేసింది. ఈ సన్నివేశం… సహనమనే పువ్వు అమ్మ పుట్టినప్పటి నుండే పరిమళించింది అని తెలియచేస్తోంది.
అలాంటి తల్లి కనుకనే…. గయ్యాళి భార్యతో పడలేని ఒక భర్త తన ఓర్పు నశించింది… అని అమ్మ దగ్గర తన గోడును వెళ్ళబోసుకుని వాపోతే “ఆ మాటలను ఓర్చుకోవటం కూడా సాధనే” అని సహనంలోనే సాధన మార్గాన్ని సూచించింది.
చెప్పడం వేరు.. ఆచరించి చూపడం వేరు. అమ్మ ఏది చెప్పినా తన అనుభవంలో నుంచే చెపుతుంది. అనుభవించి చెప్పే ఏ విషయానికైనా ఎంతో శక్తి ఉంటుంది.
అమ్మ గర్భిణిగా ఉన్నప్పుడు… డాక్టర్ గారు ‘ ఏమ్మా నీకు (పురిటి) నొప్పు ల్లేవా?’ అని అడిగితే “ఎందుకు లేవండీ ఉన్నాయ్” అన్నది అమ్మ. ‘ ఉంటే ఏ మాత్రమూ ఉన్నట్లు కనిపించవేమిటి? లేవేమో అని ఇంజెక్షన్ కూడా ఇచ్చారు’ అని ఆయన ఆశ్చర్య పోతే, సహజ సహనం గల ఆ తల్లి మౌనంగానే సమాధానం ఇచ్చింది.
సహన మంటే ఏమిటో అందరికీ తెలిసినా సహించటం మాత్రం ఆ తల్లికే సాధ్య మైంది. కడుపులోనే బిడ్డ చనిపోతే, ఆ బాధ పైకి ఏమాత్రం తెలియకుండా తన దైనందిన కార్యక్రమాలకు ఏ ఇబ్బందీ లేకుండా, అంత బాధనూ అనుభవించిన ఆ తల్లి సహనానికి మాటలు లేవు. ఎంతెంత దూరాలనుంచో వచ్చే బిడ్డలకు తన దర్శన భాగ్యాన్ని కలిగించడానికి తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, ఒక్క స్నానంతో తన బాధను పక్కన పెట్టి, ఆ వచ్చిన వారికి ఆనందాన్ని కలిగించిన ఆ తల్లి ఓర్పు నేర్చుకుంటే వచ్చేది కాదు. అది సహజ సహనం.
ఇసుక దారిలో చెప్పులు లేకుండా, కాళ్ళు బొబ్బలెక్కినా లెక్క చేయకుండా నడిచింది ఆ తల్లి. తన శరీరంపై వచ్చిన గడ్డకు ఎలాంటి మత్తూ ఇవ్వకుండా శస్త్ర చికిత్స చేసినా కిమ్మనకుండా చేయించుకున్న తల్లి. పొగాకు బేరన్ లో ఉండిపోయి, మాడి పోయినా… ఆ తల్లి ఓర్పులో ఏమాత్రమూ మార్పు లేదు. ఇవన్నీ అమ్మ శరీరంతో అనుభవించిన బాధలు. మానసికమైన వ్యధలనుకూడా ఎన్నింటినో ఓర్చుకున్న తల్లి.
అన్నిటికంటే…. తన కన్నకూతురు హైమ… కను మరుగైనపుడూ, కట్టుకున్న భర్త ‘నాన్నగారు’ ఆలయ ప్రవేశం చేసినపుడూ… తన మనస్సులోని వ్యధను ఏమాత్రం ప్రకటించకుండా, చేయవలసిన కార్యక్రమాన్ని చకచకా జరిపించి, శోకసంతప్తులైన తన బిడ్డలను తానే ఓదార్చిన తీరు… అమ్మ సహనానికి పరాకాష్ఠ.
అలాంటి సహన దేవతకు సాగిల పడి మ్రొక్కుతూ….