అమ్మకు అక్షరార్చన – 15
మార్చి 6వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు జరిగింది. డా. ఎం.బి.డి. శ్యామల గారు ఆలపించిన సుశ్రావ్యమైన ప్రార్థనతో శుభారంభమైన ఈ అంతర్జాల సభను డా.యు. వరలక్ష్మిగారు రస రమ్యంగా నిర్వ హించారు. కార్యక్రమ లక్ష్యాన్ని వివరిస్తూ, అమ్మ తత్త్వప్రచార సమితి కన్వీనర్ డా. బి.ఎల్.సుగుణగారు సముచితంగా స్వాగత వచనాలు అందించారు.
శ్రీ డి.వి.ఎన్. కామరాజుగారు అమ్మ శత జయంతి మహోత్సవ సందర్భంగా మన కర్తవ్యాన్ని వివరించారు.
డా. శ్రిష్టి లక్ష్మీ ప్రసన్నాంజనేయ శర్మగారు లలితాదేవితో అమ్మను సమన్వయిస్తూ “సర్వతోముఖ ప్రజ్ఞానిధి అమ్మ” అనే అంశంపై అద్భుతమైన ప్రసంగం చేశారు.
‘యోగీశ్వరేశ్వరి’ అయిన అమ్మ తనకు ప్రసాదించిన దివ్యానుభవాలను వివరిస్తూ, సుమధుర సంగీతం జోడించి శ్రీమతి ఎం. వీణాధరిగారు చక్కని ప్రసంగం చేశారు.
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ డి. జగదీశ్ గారు అమ్మ అవతార పరమార్థాన్ని భిన్న విభిన్న కోణాల్లో సాధికారికంగా ఆవిష్కరించారు. డా.ఎం.బి.డి.శ్యామల, శ్రీమతి గరుడాద్రి అనసూయ గార్లు ఆలపించిన మధుర గీతాలు సభను అలరించాయి.
సాహితీ సుగంధాలు వెదజల్లే వ్యాఖ్యానంతో డా.యు.వరలక్ష్మిగారు ఈ కార్యక్రమాన్ని అద్యంతమూ రక్తి కట్టించారు.
శాంతి మంత్రంతో సభ ముగిసింది.
అమ్మకు అక్షరార్చన – 16
ఏప్రిల్ 3 వ తేదీ ఆదివారం సాయంత్రం గం. 5 లకు అంతర్జాల వేదికపై జరిగింది. అమ్మ ఆస్థాన గాయకులు శ్రీ రావూరి ప్రసాద్ గారు స్వర మాధుర్యం మేళవించి ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు. డా బి.యల్. సుగుణ గారు అమ్మ అవతార పరమార్థాన్ని వివరిస్తూ, సభకు స్వాగతం పలికారు.
అమ్మ శతజయంతి సంవత్సర శుభారంభ సూచకంగా వాడవాడలా జరుగుతున్న ఎన్నెన్నో కార్యక్రమాల విశేషాలను శ్రీ డి.వి.యన్. కామరాజు గారు వివరించారు.
మాన్య సోదరులు శ్రీ టి. టి. అప్పారావు గారు అమ్మలోని సమదర్శన స్థితిని వర్ణిస్తూ ప్రసంగించారు. అమ్మలోనే రాముణ్ణి దర్శించిన తమ అనుభవాన్ని వెల్లడించారు. పరిమితులులేని అమ్మ తత్త్వాన్ని ప్రస్తుతించారు.
ప్రముఖ సాహితీవేత్త శ్రీ కామఋషి ప్రసాదవర్మగారు ” అమ్మ అవతరణ- ఆచరణ” అనే అంశంపై ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. లాలనా, పాలనా, పోషణా, రక్షణా కలగలిసిన మాతృధర్మమే అమ్మ తత్త్వమనీ, అమ్మ ఆలయ ప్రవేశం ఫుల్ స్టాప్ కాదని, ‘కామా’ మాత్రమే అనీ సప్రమాణంగా నిరూపించారు.
మాతృశ్రీ కళాశాల పూర్వ విద్యార్థిని డా. వై. నాగేంద్రమ్మ గారు ” అమ్మ మాటల్లో గీతాసారం” అనే అంశంపై మాటాడారు. మహాత్ముల మాటలు లోతుగా పరిశీలిస్తే మంత్రాలు అవుతాయని, అవి సత్య సందర్శనం కలిగిస్తాయని సోదాహరణంగా ఉటంకించారు.
డా. యమ్. బి.డి. శ్యామలగారు, శ్రీమతి పి. శైలజ, కుమారి మనీషా గార్లు అమ్మ భక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించి సభను అలరించారు.
శ్రీ రావూరి ప్రసాద్ గారు సమయోచిత వ్యాఖ్యానంతో ప్రసన్న గంభీర గానంతో సభను నిర్వహించి అందరికీ ఆనందం కలిగించారు.
శాంతి మంత్రంతో ఈ కార్యక్రమం సమాప్తమయింది.