డా॥బి.యల్.సుగుణ : అమ్మను వాత్సల్యామృతవర్షిణిగా, మానవతావాదిగా, పతివ్రతగా, అద్వైతతత్త్వ రసామృతమూర్తిగా, అ లౌకికశక్తి సంపన్నగా…. అనేకులు అనేక కోణాలు అసంఖ్యాక దర్శనాలు చేశారు. అట్టి అమ్మతత్త్వమధుర ఫలాల్ని పదిమందికి పంచటం ఈ వేదిక ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.
శ్రీమతి ఎమ్.బి.డి. శ్యామల : ‘సాగిరావమ్మా! స్వాగతం!’ అనే గీతాన్ని శ్రావ్యంగా గానం చేసి ‘అమ్మ అవతరణ’ మహనీయ ఘట్టాన్ని తలపింప చేశారు.
శ్రీ విఠాల రామచంద్రమూర్తి: ‘Amma is perfect and practical” అని చాటుతూ అమ్మ మాతృయాగం పేరిట తరతమ భేదం లేకుండా అన్నం పెట్టింది, చదువు చెప్పించింది, వైద్యం చేయించింది, ఆలయాలు కట్టించింది అని వివరించారు.
శ్రీ వై.వి. శ్రీరామమూర్తి : అమ్మ నామ జపం చేసుకుంటూ నిత్యం అమ్మ స్మరణ, స్ఫురణలతో ఉండటం, అమ్మ మాటల్ని ఆచరణలో పెట్టడం మన కర్తవ్యం అన్నారు. అమ్మ అనేక సత్యాల్ని ఆవిష్కరించింది; కాగా ఎవరి పాత్రత బట్టి వారు గ్రహించారు అనీ, స్వీయ అనుభవపూర్వకంగా అమ్మ మధుర మమతాప్రపూర్ణ మాతృమూర్తి అనీ వివరించారు.
శ్రీ వి. ధర్మసూరి : తన తపఃఫలంగానే అమ్మ పవిత్రసన్నిధికి చేరానని, లలితాదేవి వేరు దుర్గాదేవి వేరు. కాదు ఒకటే, ఆ శక్తే అమ్మ – అని వారి దర్శనాన్ని వివరించారు. అమ్మను దర్శించుకోవడం, అమ్మ సేవ చేసుకోవటం నిజమైన సాధన, సాధనం అని తమ అనుభవ పూర్వకంగా వివరించారు.
కుమారి ఎ.మనీషా : ‘తక్కిన వేల్పుల తీరు వేరు మా తల్లి వేరు తీరు వేరు’ – అనే గీతాన్ని హృద్యంగా
గానం చేశారు; అమ్మలోని వైశిష్ట్యం, వైలక్షణ్యాలకు దర్పణం పట్టారు.
శ్రీ కొండముది సుబ్బారావు : అమ్మ సన్నిధిలో భయం లేదు, భరోసా తప్ప; దండన లేదు, లాలన తప్ప అనీ; మనిషి కర్తృత్వాన్ని అంగీకరించని మహోదార మాతృత్వదీప్తి అమ్మ అనీ, కనుకనే ‘అందరికీ సుగతే’ అనే అపూర్వ వరాన్ని హామీని ప్రసాదించినది అని వివరించారు.
శ్రీ వి.యస్.ఆర్. ప్రసాదరావు : సోదరీ సోదరుల దివ్యానుభవాలకు స్వీయ అనుభవాన్ని జతచేసి అమ్మ జగదాధారమైన శక్తి, అతిలోక మహామహిమోపేత అని వివరించారు. ఆచరణాత్మకంగా అమ్మ ప్రబోధించిన బాటలోనే మనమూ పయనిస్తూ అనాథలు, పీడితులు, బాధితులకు కూడు గుడ్డ వంటి మౌలిక అవసరాల్ని తీర్చటమే అమ్మ సేవ అని స్పష్టం చేశారు.
శ్రీ వెల్లంకి భానుమూర్తి : అమ్మ ఒడిలోనే కాదు, అమ్మ బడిలో విద్యనభ్యసించే అదృష్టం తనకు కలిగిందని, విద్యతో పాటు సంస్కారాన్ని నేర్చుకున్నామని సవినయంగా తెల్పారు. “నీకున్నది తృప్తిగా తిని, నలుగురికి ఆదరంగా పెట్టుకో” వంటి అమ్మ వాక్యాలు ఉపనిషత్సారభూతములు అని వివరించారు.
శ్రీ ఎమ్. జగన్నాధం : జిల్లెళ్ళమూడిలో అందరిల్లు అంటే వర్గంలేని స్వర్గం, వసుధైక కుటుంబకం, సనాతన ధర్మప్రబోధసారం అన్నారు. ‘అందరూ ఒకే తల్లి పిల్లలం అనే భావంతో ఆపదలో ఉన్న సాటివారిని ఆదుకోండి’ అని ప్రేమమార్గంలో అమ్మ మనల్ని నడిపిస్తోందనీ; అమ్మ వేరు ప్రేమ వేరు కాదు; ఒకటే. అది మన అనసూయమ్మే అని ప్రసంగించారు.
ఈ కార్యక్రమాలలో సోదరీసోదరులు మరింత విశేష సంఖ్యలో పాల్గొని అమ్మతత్త్వ వివరణను తెలుసుకోవాలనీ పదిమందికి తెలియచెప్పాలనీ ఈ కార్యకర్తల లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు మనం పునరంకితం కావాలని శ్రీ విశ్వజననీపరిషత్, అమ్మ తత్త్వప్రచార సమితి ఆకాంక్షిస్తోంది.F