డా. బి.ఎల్.సుగుణ : – ‘అమ్మకు’, అమ్మకై ఏర్పాటైన సంస్థకు అత్యంత సన్నిహితులు, అమ్మ అనుంగు బిడ్డ, అమ్మ పట్ల అచంచల విశ్వాసంతో అమ్మ విధానాల పట్ల సదవగాహనతో ఆసక్తితో అందరింటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న సౌజన్యమూర్తి శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం గారు. ప్రవచనమే అర్చనగా అమ్మ సమక్షంలోనూ ఆ తర్వాత అమ్మ బిడ్డలను తమ ప్రవచన పరంపరలతో మైమరపింపచేస్తున్న అమ్మ తత్త్వ ప్రచార రధసారధి మధురభారతి ఆచార్య మల్లాప్రగడ. చిరకాలంగా అమ్మ తత్వామృత ఫలాల్ని పలువురకు పంచుతున్న విదుషీమణి డా.యు. వరలక్ష్మి – అంటూ వక్తలకు, సభా సంచాలకులకు, కార్యక్రమంలో ఆసక్తితో పాల్గొంటున్న సోదరీ సోదరులందరికీ స్వాగత సుమాంజలి సమర్పించారు.
శ్రీమతి పి. శైలజ :- ‘నీ కొరకై నేనున్నా, లేరమ్మా భువి నీకన్నా’అనే ప్రార్థనా గీతాన్ని ఆలపించి, భాగవత తత్వాన్ని మనోజ్ఞంగా ఆవిష్కరించారు.
డా. యు. వరలక్ష్మి :- తండ్రి శ్రీ ఎల్.ఎస్.ఆర్. కృష్ణశాస్త్రి గారి నుండి వారసత్వ సంపదగా ఆస్తిక్య భావం, అంకిత భావం, సామాజిక సేవ, స్వధర్మాచరణలో రాజీపడని వ్యక్తిత్వాన్ని, అమ్మ యందు నిర్మల భక్తి తత్పరతలను పొందారు శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యంగారు. వారి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఒక రూపకంలా సాగి జీవితకాలపు అనుభవాన్ని చక్కగా క్రోడీకరించి, ఆయా అంశాన్ని అమ్మ ప్రబోధాలతో సమన్వయం చేసిన తీరు కళ్ళకు కట్టినట్లుగా హృద్యంగా ఉన్నది. ఆర్ష విద్యాసాగరులైన శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు గారి సకల విధాల వారసులు అయిన శ్రీమన్నారాయణమూర్తి గారు ‘ఆత్మావై పుత్రనామాసి’ అన్నట్లు వారి ప్రవచన దీక్షకి కొనసాగింపుగా కాలానుగుణమైనటువంటి మెరుగులు దిద్ది తండ్రికి తగ్గ తనయునిగా తల ఎత్తి చూడదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మన ఆలోచనాలోచనాల్ని తెరిపించి, ఆధ్యాత్మికతకు అసలైన అర్థం చెప్పి, అన్ని వర్గాల వారిని మెప్పించి మైమరపిస్తాయి వారి ప్రవచనాలు. అమ్మ ప్రసాదం, అమ్మ సందేశం అంటే ఏమిటి? అమ్మ మనకి నేర్పినది ఏమిటి? అంశాలను విపులీకరిస్తూ అమ్మ సంపూర్ణ తత్త్వ దర్శనం చేయించారు.’ అంటూ ఆద్యంతము సమర్థవంతంగా సభానిర్వహణ చేశారు.
శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం ఐ.ఎ.ఎస్. :- అమ్మ దివ్యసన్నిధికి వెళ్ళే సువర్ణావకాశాన్ని మా తండ్రిగారు నాకు కలిగించారు. ముఖ్యంగా రెండు అంశాల్ని గురించి మాట్లాడతాను.
- “అడిగిన వారికి అడిగినదే ఇస్తాను, అడగని వారికి అవసరమైనది ఇస్తాను”. అనే అమ్మ వాక్యం నాకు చక్కగా వర్తిస్తుంది. అమ్మ కరుణ వల్లనే నేను వికాసం పొందాను. అమ్మని ఏమి కోరాలో తెలియని వయస్సది. ఎం.ఎ. ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత పొందాను. కానీ తరువాత ఏం చేయాలో స్పష్టత లేదు. యు.పి.యస్.సి. అడ్వర్టైజ్మెంట్ పడింది. మా నాన్నగారి ప్రోత్సాహంతో సివిల్స్ పరీక్షకు హాజరు కావాలనుకున్నాను. ఆ పరుగుపందెంలో ఒక అద్భుతమైన దైవానుగ్రహం లభిస్తుందని నేను ఊహించలేదు.
మా నాన్నగారిని అమ్మ పిలిచేది. వెళ్ళిన ప్రతీసారీ అమ్మ అడిగేది – ‘వీడు ఏం చేస్తున్నాడు?” అని. ‘అమ్మా! వీడు యు.పి.యస్.సి. పరీక్షకు వెడుతున్నాడు’ అంటే, ‘అలాగా. పరీక్ష తర్వాత ఏం చేస్తాడు?’ అన్నది. (నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? – అని) ‘ప్రిలిమ్స్’ముందు వీడు పాస్ అవ్వాలి. ప్రిలిమినరీ పాస్ అయిన తరువాతే నమ్మా – అన్నారు. ఆయన. అమ్మ ప్రిలిమినరీ గురించి అసలు మాట్లాడేది. కాదు. మెయిన్ పరీక్ష గురించి మాట్లాడేది. అంటే – నీ పిల్లవాడు అప్పుడే మెయిన్ లోకి వచ్చాడురా – అని చెస్తోంది. అన్నమాట. ఆ విధంగా నేను మెయిన్ లోకి వచ్చాను. మరలా రెండు నెలల తరువాత వెడితే “అబ్బాయి ఏం చేస్తున్నాడు రా?” అని అడిగింది. ‘అమ్మా! వాడు మెయిన్ పరీక్షకి తయారవుతున్నాడమ్మా’ – అన్నారు.
“దీని తర్వాత ఏమిటిరా?” అని అడిగింది. ‘లేదమ్మా, ముందు మెయిన్ పరీక్ష పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందమ్మా’ – అన్నారు. ఇంటర్వ్యూ అంటే ఏం చేస్తారు రా? ఎలా అడుగుతారు ప్రశ్నలు? ఏ భాషలో అడుగుతారు?” – ఇలా ఏదో మాట్లాడేది. నాన్నగారు. చాలా ప్రయత్నం చేసేవారు – “అమ్మా! మెయిన్ పరీక్ష అంటే అందులో 6 సబ్జెక్టులు ఉంటాయి” – అని చెప్పటానికి ప్రయత్నించేవారు. అమ్మ అదేమీ వినిపించుకునేది కాదు. ఎంతసేపూ ఇంటర్వ్యూ గురించి మాట్లాడేది. అంటే వాడు మెయిన్ అయి ఇంటర్వ్యూ దాకా వచ్చాడు రా – అని చెప్పటం. అలా అమ్మ నా రెండు చెవులూ పట్టుకుని పైకి లాగుతోందన్నమాట. “వీడు సమాజానికి కొంత సేవ చేస్తాడు” – అని సివిల్ సర్వీసెస్లో లో నా మొదటి ప్రయత్నంలోనే అమ్మ నన్ను లాగేసి బయటపడేసింది. –
తర్వాత నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను. ఆశీః- పూర్వకంగా దోసిళ్ళతో నా తలమీద మల్లెపూలు పోసి, నా నోట్లో పెరుగు అన్నం ముద్ద పెట్టి “ఏరా, నాన్నా! నువ్వు గుంటూరు కలెక్టర్ గా ఎప్పుడొస్తావు? అని అడిగింది. ప్రభుత్వం కూడా అమ్మ చెప్పినట్లుగానే నడవాలి. 1990 సంవత్సరము ఫిబ్రవరిలో గుంటూరు జాయింట్ కలెక్టర్ గా చేరాను. 80 రోజులు పనిచేశాను. అందులో 20 రోజులు డిస్ట్రిక్ట్ ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నాను.
(2) “బాధ అంటే చైతన్యం. బాధ లేని బ్రతుకు కంటే చావు నయం” అంటుంది అమ్మ. వ్యక్తి స్థాయిలో బాధ నిరంతరం చైతన్యాన్ని అభివృద్ధి చేస్తుంది. కానీ అమ్మ తత్త్వం ఏమంటే – ప్రకృతి వైపరీత్యాలు కాని, ప్రమాదాలు కాని…. సామూహిక బాధ పరంగా అమ్మ అడ్డుపడుతుంది.
నేను ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా పనిచేస్తున్న కాలంలో శివరాత్రి వచ్చింది. నరసరావుపేట వద్ద కోటప్పకొండ ఉత్సవాల్లో పెద్దపెట్టున ఊరేగింపులు, గ్రామాల మధ్య పోటీలు – ఆ ముసుగులో రాజకీయమైన పోటీలు కూడా కనిపిస్తాయి – అలా అని నాకు తర్వాత తెలిసింది. నేనూ, ఎస్.పి. గారూ కోటప్పకొండ ప్రయాణమైనాము. నరసరావుపేట దాటాను; అంతే. కుంభవృష్టి, అక్కడ ఇరుక్కు పోయాను. రెండు మూడు గంటల సేపు మా వాహనాలు కదలలేదు.
ఆ కుంభవృష్టికి ప్రభలు, పందిళ్ళు అన్నీ కూలిపోయాయి. అంతా అస్తవ్యస్తమైంది. భక్తులంతా ఎవరికి వారు చెట్టుకీ పుట్టకీ పారిపోయారు. భారీ వర్షం వలన శివరాత్రి ఉత్సవాలు ఏ ఆర్భాటాలు లేకుండా ముగిశాయి. రెండు మూడు గంటల తర్వాత కారు వెనక్కి తిప్పుకుని గుంటూరు వెళ్ళిపోయాను.
తరువాత అమ్మ చేసిన సామూహిక బాధా నివారణోపాయం నాకు అర్థమైంది. ఆ కుంభవృష్టి వలన ఆ ప్రభలన్నీ ఎలాగైతే దొర్లిపోయాయో, రాజకీయంగా ముట్టడి చేద్దామనుకున్న వారి బాంబులన్నీ తడిసిపోయి పనిచెయ్యకపోవటం వలన ఆ రోజు అక్కడ జరగవలసిన మారణహోమం నుంచి అమ్మ అందరినీ కాపాడింది. అమ్మ కోరిక, ఆజ్ఞవలన నేను కలెక్టర్ గా వచ్చాను – నేను కోరి రాలేదు. కాబట్టి నేను చేసిన ఘనకార్యమేమీ లేదు. ఆనాడు ఆ సమయంలో మారణహోమం జరిగితే తప్పకుండా ఎంక్వైరీ కమీషన్ వేసేవారు. దాని చుట్టూ నేను చేతులు కట్టుకుని తిరుగుతూ ఉండాల్సి వచ్చేది. నానా ఇబ్బందులూ పడవలసి వచ్చేది. ఇది కేవలం అమ్మ లీలయే. అందులో సందేహం లేదు నాకు. అమ్మ మనల్ని నిరంతరం కాపాడుతూనే ఉన్నది. ఆ చల్లని తల్లికి రెండు చేతులూ జోడించి కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను. – అంటూ అమ్మ అనుగ్రహ, ఆపదోద్ధారణ వైభవాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించారు.
చి. కె.వి.ఎన్.సాయిశృతి: ‘అమ్మ అంటే ప్రేమ యేరా, అమ్మ అంటే సహనమేరా’ – అనే గీతాన్ని అవ్యక్త మధురంగా గానం చేశారు.
ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి : “నేను అమ్మను – నీకు, మీకు అందరికీ, పశుపక్ష్యాదులకూ, క్రిమికీటకాదులకూ’ అని ప్రకటించింది ఆ బ్రహ్మకీటజనని అమ్మ. అమ్మ జీవిత చరిత్రలో ఒక్కొక్క అంతరంగాన్ని తట్టిలేపి, మార్గదర్శనం చేస్తుంది.
ఒక అనుభవాన్నిచ్చి ఒక పాఠాన్ని నేర్పుతుంది అమ్మ. అసలు అమ్మ సందేశం, అమ్మ ప్రసాదం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ – శ్రీ ఎం.ఎస్.ఆర్. ఆంజనేయులు గారు తెనాలిలో పెద్ద కార్యక్రమం నిర్వహించారు. సుమారు పదివేల మందికి అమ్మ దర్శనం, అన్నప్రసాదం అందచేశారు. వారు తప్ప అందరూ భోజనాలు చేశారు. వారిని అమ్మ “నాన్నా! భోజనం చేశావా?”అని అడిగింది. ఆయన అమ్మ ముందు చేయి చాచి “లేదమ్మా! నీ చేతి మీదుగా ప్రసాదం తీసుకుందామని వచ్చాను” అన్నారు. వారి చేతిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసికొని అమ్మ నాన్నా! ఇన్ని వేలమందికి ప్రసాదాన్ని పెట్టావు కదా! ఆ అవకాశాన్ని నీకు ఇవ్వటమే ప్రసాదం” – అన్నది.
‘పతిని ఆధారంగా చేసుకుని పంచభూతాలను జయించిన పతివ్రత అమ్మ’ – అని చాటి చెప్పే సందర్భాలు, సంఘటలు కోకొల్లలు.
“భీషాస్మాద్వాతః పవతే, భీషోదేతి సూర్య” – అని ప్రబోధిస్తుంది వేదం. ఆ పరాశక్తి యందలి భయభక్తుల కారణంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు, గాలి వీస్తోంది. అగ్ని ప్రజ్వరిల్లుతోంది. అని. అట్టి కాల స్వరూపిణి అమ్మ. కనుకనే మాఘపౌర్ణమి నాడు సుమారు 500 మందికి మంత్రోపదేశం చేసిన సందర్భంగా కాలాన్ని స్తంభింపచేసింది. సూర్య గమనాన్ని నియంత్రించింది.
అమ్మ విశ్వజనని, అమ్మది విశ్వకుటుంబం. కనుకనే తన ఇంటికి ‘అందరిల్లు’ అని నామకరణం చేసింది. అందరిల్లు అంటే సామూహిక జీవనం – ఎవరికి వారుగా కాక ఒకరికి ఒకరుగా బ్రతకటం. దీనినే బృందావనం. అంటారు. అంటే – బృందంగా భగవంతుని రక్షణ పొందటం,
అమ్మ ఆచరణే శాస్త్రం, సందేశం. అమ్మకు రెండే కార్యక్రమాలు – పనిచేయటం, పంచేయటం (స్వధర్మాచరణ, పరహితార్థ కామన) – కనుకనే ‘నీకున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో’ – అంటే, తినేటప్పుడు తృప్తిగా తినాలి, పెట్టేటప్పుడు ఆదరంగా పెట్టాలి – అనే పరమాద్భుత సందేశాన్నిచ్చింది. సనాతన ధర్మాన్ని ఆధునిక బాణిలో అందించింది.
మూర్తీభవించిన మాతృతత్వమే అమ్మ. అమ్మ అంటే తల్లి తనమే. అమ్మ కోరిక – ప్రేమ తత్వమే ప్రపంచంలోని సకల రుగ్మతలకు పరిష్కారం కావాలి. అని దివ్యత్వం, గురుత్వం రెంటినీ కలబోసుకుని అమ్మ మాతృత్వానికే – మాతృధర్మానికే ప్రాధాన్యత నిచ్చింది.
“తెలియనిది తెలియ చెప్పటానికే నా రాక” అన్నది. అమ్మ. తెలియచెప్పేవాడు గురువు – చక్రుర్మీలితం యేన రీతిగా. ‘మనకు ఏమి తెలియదు?’ (అంటే, అన్నీ తెలుసునన్నట్లు) – అనే ప్రశ్న వేసుకునే ముందు ‘మనకు ఏమి తెలుసు?’ – అని ప్రశ్నించుకోవాలి. ‘మనం ఒక్కొక్క తల్లి బిడ్డలం కాదు, ఒకే తల్లి బిడ్డలం’ – అనే వాస్తవం తెలుసునా? – తెలియదు.
“మీరు నా బిడ్డలే కాదు, నా అవయవాలు” అంటుంది అమ్మ. అంటే – మనం అమ్మ శరీర అవయవాలం అని అహంకార పూరితులము కాకూడదు. దాని అర్థం అమ్మకు అందరూ సమానమే. ఎక్కువ, తక్కువ లేదు. కావున మనలో ఒకరి వల్ల ఒకరికి శారీరకంగా గాని, మానసికంగా గాని కష్టం కలగకుండా సంఘీభావంతో పనిచేస్తే మేలు కలుగుతుందనే సందేశాన్నిచ్చింది.
రాగ, ద్వేష అసూయలను పారద్రోలినపుడే జాతికి అభ్యుదయం కలుగుతుందని మనం ఆలోచన చేసినపుడు ‘నీ గుండెలో నామంతో గుడి కట్టుకో’అనే అమ్మ మాట సుబోధకమవుతుంది – కావున ముందుగా గుండెను ఆ విధంగా తీర్చి దిద్దుకోవాలి – అని.
“మానవుని నడకకి ఆధారం నవగ్రహాలు కాదు, రాగద్వేషాలు” – అన్నది అమ్మ. అంటే అమ్మకి జ్యోతిశ్శాస్త్రం మీద అవగాహన, గౌరవం లేదు – ఇది విప్లవాత్మక భావన అనుకోవటం అమ్మను అపార్థం చేసుకోవటమే. ఒకరిపై ప్రేమ మరొకరిపై ద్వేషంగా పరిణమించ కూడదు. మహాభారతంలో – ధృతరాష్ట్రునికి కౌరవుల పైనున్న రాగం, పాండవులపై ద్వేషంగా మారింది. అది వినాశకర కురుక్షేత్ర సంగ్రామానికి దారి తీసింది.
“పెట్టింది. ముహూర్తం కాదు, జరిగిందే ముహూర్తం” – అన్నది అమ్మ. నిజం. వివాహ సమయంలో, శుభకార్యాచరణలో ‘అయం ముహూర్తః సుముహూర్తఃఅస్తు’ – అనే వేదాశీర్వచన మంత్రంలో అమ్మ వాక్యంలోని సత్యం ప్రస్ఫుటమౌతుంది. లౌకికంగా కనిపించే శాస్త్రం చాటున ఉన్న ఆంతర్యాన్ని గుర్తించి, పరమార్థాన్ని గుర్తించి జీవనయానం సాగించమంటుంది అమ్మ. సంకుచిత భావంతో కాకుండా, విచక్షణాత్మకంగా పరిశీలించాలని పిదప ఆచరించాలని అమ్మ బోధించింది.
మనం మరిచిపోయిన సనాతనధర్మ పరమార్థాన్ని తెలియచెప్పటానికి వచ్చింది అమ్మ. అమ్మ అమ్మే. అమ్మ తల్లియా, గురువా, దైవమా, అవతార మూర్తియా? – అనే మీమాంసను వదలి, అమ్మ పోలికలు తెచ్చుకుని అమ్మవలే ఆచరిస్తూ అమ్మలో లక్షవవంతు అయినా అనుసరిస్తే అమ్మ బిడ్డలుగా మన జీవితాలు సార్థకమౌతాయి’ – అంటూ యథార్థమైన అమ్మ ప్రసాదాన్ని, అమ్మ ప్రబోధాన్ని కలగలిపి రుచిచూపించి అమ్మ తత్త్వానికి, వాస్తవ చిత్రణ చేసిదర్శింపజేశారు.
శ్రీమతి పి. శైలజ : – ‘అమ్మా! అమ్మా! అద్వైత మూర్తీ! హృదయాలు వెలిగించు జ్యోతి! హృదయాల వెలుగొందు జ్యోతి!’ – అనే గీతాన్ని ఆర్తితో గానం చేసినప్పుడు శ్రోతల హృదయాలు భక్తిపారవశ్యంతో పరివశించాయి.
శ్రీ డి.వి.ఎన్. కామరాజు :- “సంపూర్ణ సంతృప్తిని కలిగించిన ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. వక్తలు ఉభయులూ లబ్ధ ప్రతిష్ఠులు, సంస్కార వంతులు. కాగా, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం వారి వ్యక్తిత్వ ఔన్నత్యం. మాన్య సోదరులు శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యంగారు స్వీయ అనుభవ పూర్వకంగాను, ఆచార్య మల్లాప్రగడ సహేతుకంగాను, శాస్త్ర బద్ధంగాను తత్త్వతః అమ్మ అనుగ్రహాన్ని, అమ్మ అనుభవ పూర్వక ప్రబోధాన్నీ విస్పష్టం చేశారు”. అంటూ వక్తలకు, గాయనీమణులకు సభాసంచాలకులకు స్వాగత కుసుమాంజలిని సమర్పించిన వారికి, శ్రోతలకు పేరుపేరున ధన్యవాదాలను సమర్పించారు.
శాంతి మంత్రంతో సభ ముగిసింది.