డా॥ బి.యల్.సుగుణ; ‘ఈ అంతర్జాలం వేదికగా ఏ నుంచి సోదరీసోదరులు అమ్మ తమకు ప్రసాదించిన అనుభవాల్ని అమ్మ ఆచరణాత్మక ప్రబోధాన్ని విపులీకరిస్తున్నారు. సర్వోత్తమ, సర్వతో ముఖి అయిన అమ్మ మహత్తత్త్వాన్ని సహస్రకోణాల అధ్యయనం చేయడానికి ఈ వేదిక ఎంతో దోహదం చేస్తుంది’ అంటూ అందరికీ స్వాగత సుమాంజలి సమర్పించారు.
కుమారి ఎ.మనీషా: ‘యయాశక్త్యా బ్రహ్మా’ అనే సార్వత్రిక ప్రార్థనా శ్లోకాన్ని శ్రావ్యంగా గానం చేశారు.
శ్రీ డి.వి.యస్. కామరాజు: అమ్మ శతజయంతి ఉత్సవ సందర్భంగా S.V.J.P. సంకల్పించిన కొన్ని కార్యక్రమాలను విశదపరిచారు.
శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం: ‘అమ్మ దర్శన స్పర్శన సంభాషణాదులచే పునీతులైన సోదరీసోదరులు సభక్తికంగా తమ అనుభావాల్ని పంచుకుంటున్నారు. మాన్య సో॥ శ్రీ యల్.వి.సుబ్రహ్మణ్యం ఐ.ఎ.యస్, శ్రీ కె.నరసింహమూర్తి, శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్, శ్రీ మధు అన్నయ్య వంటి వ్యక్తుల జీవితాల్లో అమ్మ స్వయంగా మార్గదర్శనం చేసింది. ప్రత్యక్షంగా పరోక్షంగా అందరినీ ఆదుకుంటున్నది. సో॥ శ్రీ మాకాని చంద్రమోహన్, సోదరి మొసలికంటి ఉష వంటివారలకు స్వయంగా కొన్ని విధులను నిర్దేశించింది’ అంటూ చక్కగా సభా నిర్వహణచేశారు.
శ్రీశ్రీ పొత్తూరి ప్రేమగోపాల్: అమ్మ తనకు వ్యక్తిగతంగా ప్రసాదించిన అనిర్వచనీయ అద్భుత అనుభవాలను, అమ్మవాక్యాల నిగూఢ పరమార్థాన్ని, అమ్మ అకారణ కారుణ్యాన్ని, అమ్మ ప్రసాద మహిమనీ వివరిస్తూ సుదీర్ఘంగా రసరమ్యంగా ప్రసంగించారు. వారి ప్రసంగ పూర్తి పాఠాన్ని ఒక వ్యాసంగా వచ్చే సంచికలో అందజేయాలని ఆకాంక్ష.
శ్రీ మాకాని చంద్రమోహన్ : ‘అమ్మ అనుష్టాన వేదాంతి, జ్ఞానస్వరూపిణి, మూర్తీభవించిన మాతృతత్త్వం. అంతటా ఉన్న అమ్మను తెలియచేయటానికే మన అమ్మ: రాక. అమ్మ దర్శనం, నిదర్శనం, నిజదర్శనం అనే మూడు అంశాలపై ప్రసంగిస్తాను. 1974 లో నెల్లూరులో శ్రీ యస్.వి.సుబ్బారావు గారింట్లో అమ్మను తొలిసారి దర్శించుకున్నాను. 1975 నుండి 1985 వరకు అమ్మ సన్నిధిలో ఉండి సేవాకార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం కలిగింది.
“మహత్తత్త్వానికి మహత్యాలతో పనిలేదు”వంటి అమ్మ మహితోక్తులు మన జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఒక అద్భుత సంఘటన వివరిస్తాను. అమ్మ శరీరత్యాగం చేయటానికి 2, 3 రోజులముందు జిల్లెళ్ళమూడి వెళ్ళాను. అమ్మ తీవ్ర అనారోగ్యంతో ఉన్నది. రెండురోజులు సెలవు మాత్రమే దొరికింది. అది కాస్తా అయిపోయింది. నెల్లూరు వెళ్ళాల్సివచ్చింది. అమ్మ దగ్గరికి వెళ్ళి “అమ్మా! సెలవు అయిపోయింది. నేను వెళ్ళాలి అన్నాను దక్షిణదిశగా చూపిస్తూ.
వెంటనే అమ్మ “నాన్నా! సరే. నువ్వు అటు వెళ్ళరా. నేను ఇటు దేవాలయం ఉన్న ఉత్తరదిశ) వైపు వెళతాను”అన్నది. పరిస్థితి నాకు అర్థమైంది. ఎంతో బాధకలిగింది. ‘అమ్మా! నువ్వు అట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు ఉండాలి అన్నాను. “కాదులేరా, నేను వచ్చిన పని అయిపోయింది. వెళ్ళాలని నిర్ణయించు కున్నాను” అంటూ మరొకమాట చెప్పింది. “నాన్నా! నాన్నగారిని ఆలయప్రవేశం చేయించినపుడు అక్కడ చేయాల్సిన కార్యక్రమం నువ్వు చేశావు. గుర్తుందా?” అని అడిగింది. “అమ్మా! గుర్తు ఉంది” అన్నాను. “రేపు నువ్వే నాకు కూడా అట్లా చెయ్యాలిరా” అని అన్నది.
తర్వాత అమ్మ శరీరత్యాగ వార్త రేడియోలో విని హడావిడిగా జిల్లెళ్ళమూడి పరుగెత్తాను. ఆ కార్యక్రమం కూడా అమ్మ చెప్పినట్లుగానే జరిగింది. ఈ మాధ్యమం ద్వారా కొన్ని సంగతులు చెప్పజాలను.” అంటూ వారి అద్భుత అనుభవాల్ని అమ్మ లోకోత్తర తత్త్వాన్ని సంక్షిప్త రంగా వివరించారు.
శ్రీమతి పి.శైలజ: ‘అమ్మల మరపించు అవని అమ్మవైన అమ్మా!’ అనే రాజుబావ పాటను శ్రావ్యంగా గానంచేశారు.
శ్రీమతి మునిపల్లె వీణ: తక్కిన వేల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు అనే నదీరా గీతాన్ని ఆర్తితో మధురంగా గానంచేశారు.
శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం: కార్యక్రమంలో పాల్గొన్న వక్తలకు, శ్రోతలకు, గాయనీ మణులకు అందరికీ వందన సమర్పణచేశారు, శాంతి మంత్ర పఠనంతో సభ ముగించారు.