అమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా, ప్రత్యేకించి ఈనెల అమ్మ కళ్యాణోత్సవ శుభ సందర్భంగా జరుగుతున్న అమ్మకు అక్షరార్చన 17వ కార్యక్రమం డా. ఉప్పల వరలక్ష్మిగారి ఆధ్వర్యవంలో కుమారి మనీషా ప్రార్థనతో ప్రారంభమైంది.
ప్రారంభ వక్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు అమ్మ కళ్యాణ సందేశాన్ని వివ రించారు. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని గర్భీకరించుకున్న అమ్మ మాటల్లోని విలక్షణతను, విశిష్టతను చెప్తూ- కళ్యాణం, వివాహం, పెళ్లి, వరుడు, వధువు, తలంబ్రాలు, మంగళసూత్రం, భార్య, భర్త, పాతివ్రత్యం మొదలైన పదాల్లోని అంతరార్థాన్ని అమ్మ కళ్యాణ సందేశంగా వివరించారు.
మాతృశ్రీ ప్రాచ్య కళాశాల పూర్వ విద్యార్థి కాసులనాటి శేషాద్రి తను జిల్లెళ్ళమూడి రావడానికి వెనుక ఉన్న నేపథ్యంతో తన ప్రసంగాన్ని ప్రారంభించి అమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా అమ్మ దండు కదలాల్సిన అవసరాన్ని, అందులో పూర్వ విద్యార్థుల పాత్రను, బాధ్యతను గుర్తుచేస్తూ అనేక ఆచరణాత్మక, విలువైన సూచనలు అందించారు.
కార్యక్రమంలో చివరి వక్తగా అమ్మ అక్షరార్చన కార్యక్రమ రథ సారథులు డా. బి.ఎల్. సుగుణ గారు ఆదర్శ మహిళగా అమ్మ లోకానికి చూపిన మార్గాన్ని అమ్మ జీవితంలోని వివిధ సంఘటనలు ఆధారంగా చక్కగా వివరించారు.
పాయసంలో జీడిపప్పు పలుకుల్లా కార్యక్రమంలో మధ్యమధ్యలో చిరంజీవులు దివ్య అనసూయ, మేఘనలు తమ గాన మాధుర్యంతో కార్యక్రమానికి పరిమళాన్ని అద్దారు.
కార్యక్రమంలో సందర్భానుసారంగా సముచిత విశ్లేషణ చేస్తూ ఆద్యంతం అత్యంత రమణీయంగా సభా సంచాలన చేశారు డా. ఉప్పల వరలక్ష్మి గారు. శాంతిమంత్రంతో అమ్మకు అక్షరార్చన 17వ కార్యక్రమం సంపన్న మైంది.