తల్లిగా లాలించి, దైవంగా పాలించి, గురువుగా ఉపదేశించి, సర్వసృష్టిని తనలో దర్శింపచేసిన అమ్మ సర్వసృష్టిలో తనను దర్శించే సామర్థ్యాన్ని తన బిడ్డలకు కలిగించి శరీరాన్ని త్యజించిన ఈ మాసంలోని అమ్మకు అక్షరార్చన 18వ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ డా. బి ఎల్ సుగుణ గారు ఈ సమావేశాన్ని నిర్వహించ వలసిందిగా డి వి ఎన్ కామరాజు అన్నయ్య గారిని ఆహ్వానించారు.
కామరాజు అన్నయ్యగారు ప్రార్థనతో తన సభా నిర్వహణను ప్రారంభించి ప్రారంభోపన్యాసం | చేయవలసిందిగా గిరిధర్ కుమార్ గారిని ఆహ్వానించారు. గిరిధర్ కుమార్ గారు అమ్మ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన వివిధ కార్యక్రమాల గురించి, కళాశాల, వేద పాఠశాలలు ప్రణాళికల గురించి, ఈ సంవత్సరంలో ప్రారంభించ బోతున్న బాలికల నూతన వసతిగృహం, ప్రత్యేక అతిథి గృహాల గురించి వివరించారు.
అనంతర వక్త గంటి రేవతి గారు మాట్లాడుతూ జీవితంలో తట్టుకోలేని సంఘటనలు ఎదురైనప్పుడు అమ్మ ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో తనకు ప్రసాదించిన మనో ధైర్యాన్ని, దాన్ని ఆధారంగా చేసుకొని తాను రూపొందించిన రచనలు, ఆడియోల ద్వారా ప్రభావితు లైన ఇతర భక్తుల అనుభవాల గురించి పంచుకున్నారు.
‘ఎక్కడా చెల్లని నాణెం ఇక్కడ చెల్లుతుంది, ఇక్కడ చెల్లిన నాణెం ఎక్కడైనా చెల్లుతుంది’ అన్న అమ్మ మాటకు ప్రత్యక్ష నిదర్శనంగా రూపుదిద్దుకున్న తన జీవితాన్ని, అమ్మతో తన ప్రత్యక్ష అనుభవాల్ని, అమ్మ భౌతికంగా కనుమరుగైనప్పుడు తాను పొందిన మానసిక సంకర్షణ, అమ్మ ప్రేరణతో పార్వతీపురంలో కొనసాగిస్తున్న కార్యక్రమాల్ని గురించి విపులంగా పంచుకున్నారు కళాశాల పూర్వ విద్యార్థి తిరుపతి నాయుడు.
కార్యక్రమంలో చివరగా ఏ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ అవతార మూర్తుల పుట్టుక ఆవిర్భావం అవతరణ మధ్య ఉన్న ఆంతర్యాన్ని వివరిస్తూ మనకు కనిపించే అమ్మకు మనం దర్శించాల్సిన అమ్మకు మధ్యనున్న తాత్త్విక భూమికను విశ్లేషించారు.
గులాబీల మధ్యన మల్లెపువ్వుల్లాగా ఉపన్యాసాల మధ్యలో అమ్మ పాటల్ని ఆలపిస్తూ తమ గాన మాధుర్యంతో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ పోపూరి గౌరీనాథ్ గారు, చిరంజీవి హన్సికలు అలరించారు.
ఆద్యంతం తమ చక్కనైన చిక్కనైన సమీక్షతో వక్తల అభిప్రాయాన్ని సారభూతంగా అందిస్తూ కామరాజు అన్నయ్యగారు ఆహ్లాదంగా అమ్మకు అక్షరార్చన 18వ సమావేశాన్ని సుసంపన్నం చేశారు.