సర్వతోముఖమైన అమ్మ అవతార శతవసంతాల వేడుకల్ని పురస్కరించుకుని మాతృ తత్వాన్ని ముచ్చటించుకోవడానికి ముచ్చటయిన వేదికగా నిలిచిన అమ్మకు అక్షరార్చన 19వ సదస్సును ప్రారంభిస్తూ డా. బి ఎల్ సుగుణ గారు కుల మత వర్ణ వర్గ విచక్షణా రహితమైన అమ్మ ఆలోచనను, చేసేదంతా భగవత్సేవే అన్న అమ్మ ఆచరణను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరాన్ని, తత్సాధన కోసం వ్యష్టిగా, సమష్టిగా చేయాల్సిన కార్యక్రమాల్ని వివరించి సోదరి నాగేంద్రమ్మను సభా సంచాలన కొరకై ఆహ్వానించారు.
సోదరి నాగేంద్రమ్మ నిర్వహణలో డా. శ్యామల గారి ప్రార్థనతో ప్రారంభమైన సదస్సులో ప్రథమ వక్తగా పూర్వ విద్యార్థి డా. సుహాసిని గారు మాట్లాడుతూ అమ్మలోని విచక్షణ లేని వీక్షణను, శిక్షణ రూపంలో అమ్మ ఇచ్చే రక్షణను, అమ్మ మనోవాక్కాయకర్మల్లో ఉండే ఏకరూపతను, బాల్యం నుండి అమ్మ సన్నిధిలో తను నేర్చిన, అమ్మ తనకు నేర్పించిన అనేక అనుభవాల్ని పంచుకున్నారు.
అనంతరం కళాశాల పూర్వ విద్యార్థి సోదరుడు గంటేడ సోమేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ తనను తీర్చిదిద్దిన విధానాన్ని, ఆ ప్రభావంతో తను తన విద్యార్థులపై ప్రసరించిన వెలుగును, అమ్మ సన్నిధిలో జరిగిన విభిన్న ఘటనల్లో తన ప్రత్యక్ష అనుభవాన్ని, పార్వతీపురంలో జరుగుతున్న అన్న వితరణ కార్యక్రమం నేపథ్యాన్ని వివరించారు.
అనంతరం సోదరి మహాలక్ష్మి అమ్మ విశ్వవ్యాపకత్వాన్ని తెలియచేసే “నేను నేనైన నేను” అన్న పాటను శ్రావ్యంగా ఆలపించారు.
కార్యక్రమంలో తర్వాత ఉత్తమ గురువుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రశంసలు అందుకున్న డా. ఉప్పల వరలక్ష్మి గారు విశ్వ గురువుగా అమ్మ ఔన్నత్యాన్ని ఆవిష్కరించారు.
సంధ్యా సమయాల్లో తెల్లని చీర కట్టుకొని వాత్సల్యాలయం ఆరుబయట కూర్చొని “మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం” అన్నట్లుగా సందేహాల్ని పటాపంచలు చేసే అమ్మ జ్ఞాన స్వరూపాన్ని కళ్ళ ముందుంచారు. సర్వ హృదయాంతర్వర్తి, వస్తు దేశ కాలాతీతమైన అమ్మ విశ్వ వ్యాపకత్వాన్ని, సమదర్శిత్వాన్ని, పశుత్వం నుండి ఋషిత్వం వైపు అమ్మ చూపిన మార్గాన్ని, సమాధానాన్ని ప్రశ్నగా సంధించే అమ్మ తత్వాన్ని చక్కనైన ఉదాహరణలతో వివరించారు డాక్టర్ వరలక్ష్మి గారు.
అనంతరం దినకర్ అన్నయ్య గారు మాట్లాడుతూ ‘తన జీవితమే తన సందేశం’ అన్న అమ్మ మాటల్ని ఆదర్శంగా తీసుకొని శత జయంతి ఉత్సవాల సందర్భంగా అన్నదాన, విద్యా వైద్య సేవలతో పాటు, అమ్మ చరిత్ర పారాయణ, అమ్మ నామ సంకీర్తనల్ని సమాజంలోకి తీసుకువెళ్లాలని, దానికి తగిన వనరుల్ని సమకూర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం స్థితప్రజ్ఞతతో, విపులమైన విశ్లేషణతో నిర్వహించారు నాగేంద్రమ్మ. శాంతి మంత్రంతో సదస్సు సుసంపన్నమైనది.