సర్వదినాలు పర్వదినాలే నన్న అమ్మ మాటలతో 21 అమ్మకు అక్షరార్చన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ డా. బి ఎల్ సుగుణ గారు ఈ మాసంలో కళాశాలలో నిర్వహించిన గణపతి త్రిరాత్ర ఉత్సవాలను పురస్కరించుకొని గణపతి తత్వాన్ని, అమ్మ మాటల్ని సమన్వయించి చెప్పి అనంతరం సభా నిర్వహణకై పూర్వ విద్యార్థి అప్పారెడ్డిని ఆహ్వానించారు.
సోదరుడు అప్పారెడ్డి నిర్వహణలో కళాశాల అధ్యాపకురాలు కుమారి మనీషా ప్రార్థనతో ప్రారంభమైన సదస్సులో ప్రథమ వక్తగా అమెరికాలో ప్రముఖ వైద్యులు డా. చెన్నాప్రగడ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వైద్యశాస్త్ర అంచనాలకు మించి అమ్మ తనపై ప్రసరింపజేసిన అనుగ్రహాన్ని వివరించే అనేక ఘటనల్ని, ఆ ఘటనల ద్వారా వ్యక్తమైన అమ్మ మాహాత్మ్యాన్ని శ్రోతలతో పంచుకున్నారు.
కార్యక్రమంలో ద్వితీయ వక్తగా వచ్చిన అద్వితీయ ప్రవచనకర్తలు మధురభారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు దేవకార్య సముద్యత అయిన అమ్మ తత్వాన్ని సోదాహరణంగా, విపులంగా, మనోహరంగా ప్రవచించారు.
అనంతరం కళాశాల పూర్వ విద్యార్థి సోదరుడు అడవినాయుడు మాట్లాడుతూ జిల్లెళ్ళమూడి అమ్మ సన్నిధికి చేరడానికి ముందు ఆ తరువాత తన జీవితంలో వచ్చిన మార్పు, జిల్లెళ్ళమూడిలో విద్యాభ్యాసం తన జీవితాన్ని దిద్దితీర్చిన విధానాన్ని పంచుకున్నారు. కార్యక్రమానికి పరిమళాల్ని అద్దుతూ ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ పోపూరి గౌరీనాథ్ గారు, చిరంజీవి వై. శ్రావణి అమ్మ పాటలతో సభను అలరించారు.
కార్యక్రమాన్ని ఆద్యంతం చక్కని విశ్లేషణతో, మధ్య మధ్యలో అమ్మ పాటల్ని అలపిస్తూ రమణీయంగా నిర్వహించారు సోదరుడు అప్పారెడ్డి. శాంతిమంత్రంతో సభ విజయవంతమైంది.