జీవితమే నా సందేశం :
అమ్మకు అక్షరార్చన 22వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అమ్మ తత్వచింతన సదస్సు కన్వీనర్ డా. లక్ష్మీ సుగుణ గారు అమ్మ ఆచరణాత్మకమైన పై ప్రబోధం నేటి సమాజానికి ఎలా ఆదర్శప్రాయమో వివరించి సభా నిర్వహణకు సోదరులు ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానించారు.
ఏవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ప్రార్థనతో తమ సభా నిర్వహణను ప్రారంభించి సోదరులు ఎమ్ వి ఆర్ సాయిబాబా గారిని అంతర్జాల వేదిక పైకి ఆహ్వానించారు. సోదరులు సాయిబాబా గారు ప్రసంగిస్తూ అమ్మ శతజయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అమ్మ తత్త్వచింతన సదస్సుల్ని, యజ్ఞ యాగాది కార్యక్రమాల్ని, అన్నవితరణను వివరిస్తూ ఈ సందర్భంగా జిల్లెళ్ళమూడిలో సంస్థాగతంగా (సంస్థపరంగా) చేపట్టబోతున్న అనేక కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించి ఆ కార్యక్రమాల నిర్వహణలో అమ్మ బిడ్డలుగా మన బాధ్యతను గుర్తు చేశారు.
అనంతర వక్తగా కొండముది సుబ్బారావు అన్నయ్యగారు మాట్లాడుతూ అమ్మ భక్త పరాధీనతను, తన బిడ్డల పట్ల తన అనవరత రక్షణ కార్యక్రమాన్ని అమ్మ ఎలా నిర్వర్తిస్తుందో, తన జీవితంలో, తన సన్నిహితుల జీవితంలో జరిగిన అనేక విషయాల ద్వారా అత్యంత విపులంగా సరళంగా వివరించారు.
తమ బాల్యం నుంచి అమ్మ శ్రీ చరణ సన్నిధిలో జీవితాన్ని కొనసాగించిన శిష్ట్లా ప్రభాకర్ గారు మాట్లాడుతూ తన జీవితంలో తను అమ్మను దర్శించిన విధానాన్ని, అమ్మ తత్వం మనకు ఎలా మార్గదర్శకమవుతుందనే విషయాన్ని చక్కగా వివరించారు.
కార్యక్రమంలో తదుపరి వక్తగా కళాశాల పూర్వ ప్రాచార్యులు డా. ఆశావాది సుధామ వంశీ గారు అమ్మ సాహిత్యంలో కనిపించే సామాజిక చైతన్యాన్ని గురించి వివరించారు. అమ్మ మాటల్లోని అన్నదానం అన్న వితరణ మధ్య భేదాన్ని, అమ్మ సాహిత్యాన్ని సంగీత పరంగా సాహిత్య పరంగా విభజిస్తూ సాహిత్యంలో మరలా వచన సాహిత్యం, పద్య సాహిత్యం, గేయ సాహిత్యం అందులో కృషి చేసిన మహామహుల గురించి వివరించారు.
కార్యక్రమాన్ని మధ్య మధ్యలో శ్రీమతి కాళీపట్నం ఉమా గారు కుమారి హన్సిక తమ గాన మాధుర్యంతో అలరించారు. సోదరులు ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు కార్యక్రమాన్ని ఆద్యంతం తమ విపులమైన విశ్లేషణతో రమణీయంగా నిర్వహించారు. శాంతిమంత్రంతో సభ సంపన్నమైంది.