అందరమ్మకు జరుగుతున్న అక్షరార్చనలో తాము కూడా ఒక అనుభవ పుష్పాన్ని సమర్పించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న అనుంగు సోదరులకు ఆహ్వానం పలుకుతూ అమ్మ తత్వచింతన సదస్సు కన్వీనర్ డాక్టర్ లక్ష్మీ సుగుణ గారు 23వ అమ్మకు అక్షరార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిష్ట్లా ప్రభాకర్ అన్నయ్య గారి శ్రావ్యమైన ప్రార్థనతో ప్రారంభమైన సదస్సులో ఆత్మీయ సోదరులు శ్రీ కామరాజు అన్నయ్య గారు తమ తొలిపలుకుల్లో అపరిచిత వ్యక్తుల్ని కూడా ఆప్యాయంగా అన్నయ్య అక్కయ్య అని పిలిచే అపూర్వ, అపురూప సంస్కారాన్ని నిలిపిన అర్కపురి ఔన్నత్యాన్ని, ఈ నెలలో జరగబోతున్న హైమక్కయ్య జన్మదిన వేడుకల్ని, కోటినామార్చన విశేషాల్ని వివరించారు.
అనంతర వక్తగా వచ్చిన డా. ఇందిరా ప్రియదర్శిని అక్కయ్య గారు మాట్లాడుతూ తాము 1981 నుండి జిల్లెళ్ళమూడి వస్తున్నప్పటికీ అమ్మకు సంబంధించిన లోతైన అవగాహన లేకుండానే గడిచిపోయిందనీ, ఇక్కడి ఆప్యాయత, స్వచ్ఛత, సాత్విక వాతావరణం తనను ఆకట్టుకుందనీ, ఈ ఉపన్యాసానికి ఒప్పుకున్న తర్వాత అమ్మకు సంబంధించిన కొన్ని రచనలను చదవడం, వర్ధని అక్కయ్య గారి లాంటి అమ్మ అనుంగు బిడ్డలతో మాట్లాడిన తర్వాత మరింతగా తనకు తెలియని అమ్మ తత్వాన్ని తాను తెలుసుకున్నానని చెప్పారు.
అనంతరం శ్రీ రాణి గోపాలకృష్ణ అన్నయ్య గారు “ఆధ్యాత్మిక గగనతలంలో ఎక్కడైనా నెలవంకలనే చూడగలం కానీ జిల్లెళ్ళమూడిలో పూర్ణచంద్రుడిని చూడగలం” అన్న శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారి మాటలకు ప్రతిరూపంగా సాగిన వారి ప్రసంగంలో కంచి పరమాచార్యుల వారు, షిరిడి సాయిబాబా, హిమాలయ సద్గురువులు మరెందరో స్వామీజీల అవధూతల అనుగ్రహం, మార్గదర్శనంతో అమ్మ ఒడికి చేరిన వారి అనుభవాల్ని అత్యంత ఆత్మీయతతో వివరించారు.
కార్యక్రమానికి వన్నె చేకూరుస్తూ శ్రీమతి దావులూరి కనకదుర్గ గారు, శ్రీమతి లక్కరాజు విజయ గారు తమ సుస్వరమైన గాన పుష్పాల్ని అమ్మకు నివేదించి కార్యక్రమాన్ని పరిమళభరితం చేశారు. కార్యక్రమానికి వందన సమర్పణ చేస్తూ డా. లక్ష్మీ సుగుణ గారు శతజయంతి ఉత్సవ సందర్భంగా కొన్ని బాధ్యతల్ని గుర్తు చేశారు. శాంతి మంత్ర పఠనంతో సభ సంపన్నమైంది.