సర్వజన హితమే నా మతం అని ప్రవచించిన అమ్మలోని విచక్షణ లేని వీక్షణానికి అద్దం పడుతూ ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్ని నిర్వహించుకుని, రాబోయే సంక్రాంతి వేడుకలకు ఉవ్విళ్ళూరుతున్న జిల్లెళ్ళమూడి ఉత్సవ వాతావరణాన్ని పరిచయం చేస్తూ 25వ అమ్మకు అక్షరార్చన కార్యక్రమాన్ని ప్రారంభించిన అమ్మ తత్త్వచింతన సదస్సు కన్వీనర్ డా. లక్ష్మీ సుగుణ గారు సభను నిర్వహించవలసిందిగా డా. ఉప్పల వరలక్ష్మి గారిని వేదికపైకి ఆహ్వానించారు.
కుమారి మనీషా ప్రార్థనానంతరం డా. వరలక్ష్మి గారి అభ్యర్థన మేరకు దేశిరాజు కామరాజు అన్నయ్యగారు మార్చి 28 నుండి ఏప్రిల్ ఒకటి వరకు జరగనున్న అమ్మ శతజయంతి వేడుక విశేషాలు, దానికి ముందు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ మొదలైన ప్రాంతాల్లో జరుగనున్న అమ్మ కార్యక్రమాల వివరాలు అందించారు.
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, ఆధ్యాత్మిక వేత్త శ్రీ పాలకుర్తి రామ్మూర్తి గారు మాట్లాడుతూ అమ్మ ఎక్కడెక్కడ కొలువై ఉంటుందన్న విచికిత్సతో ప్రారంభించి ఆద్యమై అనంతమై అఖండమై సర్వత్రా వ్యాపించిన అమ్మ అస్తిత్వాన్ని తమ ప్రసంగంలో శ్రోతలకు దర్శింపజేశారు.
అనంతర వక్తయిన శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు మానవత్వంలోని ప్రేమ, కరుణ, జాలి, అహింసాది లక్షణాలను వివరిస్తూ మానవులకే పరిమితం కాకుండా సర్వజీవకోటిపై ప్రసరించిన అమ్మ మానవతా వెలుగుల్ని తమ ప్రసంగంలో శ్రోతలపై ప్రసరింప చేశారు.
తదుపరి వక్తగా వచ్చిన మాన్య సోదరులు శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు అమ్మ నామంతో ప్రారంభించి తను అమ్మ సన్నిధికి చేరిన విధానం, తన జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలు, వాటి వెనుక అమ్మ అదృశ్య హస్తం, తన అనుభవాలు, అనుభూతుల్ని పంచుకున్నారు.
అమ్మ ఆధ్యాత్మికత, అమ్మ – మానవత, అమ్మ – నా భావన అంటూ అమ్మ పట్ల తమ భక్తిశ్రద్ధల్ని ప్రకటించిన వక్తల ప్రసంగ ఫలాల ఆంతర్యాన్ని సారభూతంగా అందించారు సభా నిర్వాహకులు డా. ఉప్పల వరలక్ష్మి గారు.
కార్యక్రమంలో భాగంగా శ్రీ లక్కరాజు పార్థసారధి గారు, కుమారి మనీషాలు కార్యక్రమానికి స్వర సౌరభాన్ని అద్దారు. శాంతి మంత్రంతో సభ సన్నమైంది.