సర్వతోముఖియైన అమ్మ సన్నిధిలో జలక్షీరాభిషేకాలకు భిన్నంగా జరుగుతున్న విశేష అభిషేకం ధాన్యాభిషేకం. అన్నావతారయైన అమ్మకు జరుగుతున్న ఈ ధాన్యాభిషేక విశిష్టతను పరమార్థాన్ని వివరిస్తూ అమ్మకు అక్షరార్చన 26వ కార్యక్రమాన్ని ప్రారంభించిన అమ్మ తత్త్వచింతన సదస్సు కన్వీనర్ డా. బి. లక్ష్మీ సుగుణ గారు సభా నిర్వహణకై ప్రవచన సుధాకరులైన ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని ఆహ్వానించారు.
కుమారి మనీషా ప్రార్థనానంతరం సభా నిర్వాహకుల ఆహ్వానం మేరకు డా. అనంతలక్ష్మి గారు ప్రసంగించారు. భక్తుల రూపంలోని దైవంలాగా, శిష్యుల రూపంలోని గురువులాగా, బిడ్డల రూపంలో ఉన్న అమ్మ స్వరూపానికి నమస్కరిస్తూ తమ ప్రసంగాన్ని ప్రారంభించిన అనంతలక్ష్మి గారు. అనసూయ నామౌచిత్యాన్ని, శారీరిక బౌద్ధిక ఆధ్యాత్మిక ఆకళ్లను తీర్చిన, తీరుస్తున్న అన్నపూర్ణేశ్వరియైన అమ్మలోని ముద్ద కట్టిన అమ్మతనాన్ని మృదువైన మాటల్లో అందించారు.
అనంతరవక్తగా విచ్చేసిన అచ్చ తెలుగు అవధానులు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. అక్షర రూపిణియైన “అంఆ” నామంలోని అక్షరాలు బీజాక్షరాలు ఎలా అయ్యాయో నిరూపిస్తూ, జటిలమూ, గహనమూ అయిన వేదాంత విషయాలు అమ్మ మాటల్లో పొందిన సారళ్యాన్ని ఆ సరళ వాక్కుల వెనుక దాగిన శాస్త్ర విషయాల్ని వివరించారు.
ఎల్లెడ నెయ్యది పుట్టిన
తల్లి కలదియె యగును కదా తానెవరో
జిల్లెళ్ళమూడి నుండియె
యెల్లరకు చూపి చెప్పె యిదియె అంఆ!
అంటూ అమ్మ అనుగ్రహ వీక్షణంతో “అంఆ” శతకాన్ని రాయసంకల్పించి మచ్చుకు కొన్ని పద్యాలను అందజేశారు.
అనంతరం వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసియైన పెద్ద ముత్తయిదువ, అర్కపురీ హాటక పీఠ శిఖాధిరూఢయైన అమ్మలో అణువణువునా వ్యక్తమవుతున్న అమ్మతత్వాన్ని అమృతత్వాన్ని ఆహ్లాదకర రీతిలో అందించారు అవధాన శేఖరులు తాతా సత్య సందీప శర్మ గారు. సకల ప్రాణుల పట్ల, అప్రాణులైన అక్షరాల పట్ల కూడా అమ్మ కురిపించిన వాత్సల్యామృతాన్ని ఆహ్లాదకరమైన మాటల్లో అందించారు. పద్య సుమంతో అమ్మను అర్చిస్తూ తమ ప్రసంగాన్ని ముగించారు సందీప శర్మ.
ఆలోచనామృతంగా సాగుతున్న ఉపన్యాస పరంపరల మధ్య ఆపాతమధురమైన తమ గానామృతంతో శ్రీమతి శైలజ గారు శ్రీమతి కళ్యాణి గోవర్ధన్ గారు కార్యక్రమానికి సొబగులు అద్దారు. శాంతి మంత్రంతో సభ సమాప్తం అయింది.