అమ్మ శతజయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని అమ్మ ప్రేరణతో దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించుకున్న అమ్మకు అక్షరార్చన 27వ (చివరి) సదస్సును ప్రారంభిస్తూ, అమ్మ తత్త్వచింతన సదస్సు కన్వీనర్ డా.బి.ఎల్. సుగుణ గారు ఈ కార్యక్రమ నేపథ్యం, ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం సభాసంచాలన చేయవలసిందిగా ఆత్మీయ సోదరులు డా. కామరాజు అన్నయ్య గారిని అంతర్జాల వేదికపైకి ఆహ్వానించారు. కామరాజు అన్నయ్య గారి నేతృత్వంలో కుమారి మనీషా ప్రార్థనతో ప్రారంభమైన కార్యక్రమంలో ప్రథమవర్తగా కళాశాల పూర్వ విద్యార్థి ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థాన వేద పాఠశాల అధ్యాపకులు శ్రీమాన్ కాండూరి వేంకట సంతాన వేణుగోపాల శేషాచార్యుల వారు మాట్లాడుతూ, సర్వోపనిషత్ సారం అలతి అలతి మాటల్లో అమ్మ వ్యక్తపరిచిన తీరును, అమ్మ భావనా జగత్తులో తాను తేలియాడుతూ ఆ అనుభూతిని శ్రోతల చేత అనుభవింప చేస్తూ ఆహ్లాదభరితంగా అమ్మ వాగ్వైభవాన్ని అభివ్యక్తీకరించారు.
అమ్మ ఒడిలో నడయాడి అనేక దివ్యానుభవాల్ని సొంతం చేసుకున్న అనుంగు సోదర, సోదరీమణుల అనుభవాలను అక్షరబద్ధం చేస్తూ శాశ్వతత్వానికి బాట వేసిన శ్రీ రావూరి ప్రసాద్ అన్నయ్య గారు తదుపరి వక్తగా మాట్లాడుతూ దశాబ్దాల పాటుగా అమ్మ సన్నిధిలో ఉంటూ, జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ, కర్త, కారయిత, కార్యం అన్నీ అమ్మేనన్న పరిపూర్ణ విశ్వాసాన్ని అస్థిగతం చేసుకొని, సాధన ద్వారా తనలోని అహంకార బలికి అధోలోక పథాన్ని నిర్దేశించుకున్న వైనాన్ని, దానికి అనుకూలించిన పరిస్థితుల్ని, సన్నివేశాల్ని సోదాహరణంగా పంచుకున్నారు.
ప్రముఖ సహస్రావధాని, విద్వన్మూర్తులు శ్రీ కోట వేంకట లక్ష్మీ నరసింహం గారు మాట్లాడుతూ, అమ్మ మనసులో, మాటలో, ఆచరణలో కనిపిస్తున్న త్రికరణ శుద్ధిత్వాన్ని, అమ్మ మాటల్లోని ఔన్నత్యాన్ని వివరించారు. ‘యశ్చ రామం న పశ్యేత్ యం చ రామో నా పశ్యతి’ అన్న వాల్మీకి మహర్షి మాట అమ్మ విషయంలో కూడా సత్యమనీ, కానీ అమ్మను మనం చూడకపోయినా అమ్మ మనల్ని చూస్తూ ఉంటుందనీ, ద్వాపరంలో గోప బాలకులు, గోపికలు పొందిన అదృష్టాన్ని జిల్లెళ్ళమూడి ఆవరణలో అమ్మ సన్నిధిన మెలిగిన అనుంగు సోదరులు పొందారని చెప్పారు.
అనంతర వక్త శ్రీ కప్పగంతు రామకృష్ణ గారు మాట్లాడుతూ ఆచార్య మల్లాప్రగడ వారి సాహచర్యంతో, మాతృశ్రీ పాఠశాల కళాశాల పూర్వ విద్యార్థుల స్నేహంతో అమ్మ గురించి తాను తెలుసుకున్నాననీ, ఆ ప్రేరణతో తరువాత కొంత స్వీయ అధ్యయనం చేశాననీ, అమ్మ ఆవరణలో ఉన్న వేద పాఠశాల, గోశాల, ఆదరణాలయం, అన్నపూర్ణాలయం తనలో ఎంతో స్ఫూర్తిని కలిగించాయని చెప్పారు.
కార్యక్రమానికి స్వరపరిమళాల్ని అద్దుతూ శ్రీమతి కాళీపట్నం ఉమా గారు, పోపూరి గాయత్రీ గౌరీనాథ్ గారు రస రమ్యం కావించారు. కార్యక్రమం అద్యంతాన్ని చిక్కనైన సమీక్షతో ఒడిదుడుకులు లేని మందాకినీ ప్రవాహంలా కొనసాగించారు కామరాజు అన్నయ్యగారు. డా. బి.ఎల్.సుగుణ గారు వందన సమర్పణ చేశారు. శాంతి మంత్రంతో సభసంపన్నమైంది.