డాక్టర్ బి.యల్.సుగుణ : విశిష్ట విలక్షణ అమ్మ తత్త్వ సౌరభం జగద్వ్యాప్తం కావాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం అంటూ స్వాగత వచనాలు పలికారు.
డాక్టర్ ఎమ్.బి.డి.శ్యామల: ‘యయాశక్త్యా బ్రహ్మా’ అనే ప్రార్థనా శ్లోకాన్ని గానం చేసి త్రిశక్తిరూపిణిగా అమ్మను దర్శింపచేశారు.
శ్రీ డి.వి.యన్.కామరాజు : దుష్టశిక్షణ – శిష్టరక్షణ అనే భేదాన్ని పాటించని, గుణభేదమే లేని, ఆది అనాది సర్వంతానైన తల్లి అమ్మ. చరిత్రకు అందని అద్వితీయ మహనీయమూర్తి అసదృశశక్తి అమ్మ; అంటూ విజ్ఞతతో దక్షతతో సకల ప్రసంగాల సమగ్ర సమీక్షతో అక్షరరూపిణి అమ్మకు అక్షరార్చన చేస్తూ ఆద్యంతమూ సభను ఆ పాత మధురంగా నిర్వహించారు.
శ్రీ కొండముది హనుమంతరావు: అమ్మ వాక్యాలు, ఆప్తవాక్యాలు, ఆణి ముత్యాలు, నిత్య సత్యాలు, రత్న దీపాలు, తత్త్వదర్శనాలు, దేవలోకంలో విరిసిన పారిజాతాలు – అర్కపురిలో వికసించిన అరవిందాలు – అని ప్రస్తుతించారు. శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, గాంధీజీల అవతార నిజజీవిత సందర్భాలను ఉటంకించి, ‘నిర్ణయానికి నిర్ణయించిన వాడూ బద్ధుడే “అనుకున్నది జరగదు తనకున్నది తప్పదు” అన్న అమ్మ సూత్రాలను వివరిస్తూ అవి సార్వకాలికము సార్వజనీనము అని నిరూపణ చేశారు. అమ్మ శతజయంతి ఉత్సవ సందర్భంగా మనందరం అమ్మను కోరుకోవాల్సిన మూడు వరాలు ‘అమ్మ నామస్మరణ’, ‘అమ్మ తత్త్వచింతన’, ‘అమ్మరూప సందర్శనం’ అంటూ జన్మసావల్య హేతుభూతమైన పసిడి పలుకుల్ని వినిపించారు.
డా॥గాదిరాజు పద్మజ: తన తండ్రి డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు రచించిన ‘అంతా ఆమె దయే’ అనే గ్రంథాన్ని సమీక్షించారు. ‘ఉదారచరితానాంతు వసుధైక కుటుంబకమ్’ ఇత్యాది అధ్యాయాల్లో అమ్మ చేసిన ప్రశాంత విప్లవ మహోద్యమాన్ని విశ్లేషించారు. భారతదేశ రాజ్యాంగంలో పేర్కొన్న Socialism, Secularism, Equality మున్నగు లక్ష్యాలని అమ్మ ఏనాడో సహజంగా అ లవోకగా సాధించింది – అన్నారు. హేతువాద ప్రవృత్తి నశాస్త్రీయ ఆలోచనారీతిగల శ్రీ పొత్తూరి వారు హేతువాద స్థితి నుండి విశ్వాసస్థితికి ఎదిగి – అంతా ఆమెదయే – అనే నిశ్చయాత్మక వైఖరిని చాటారని; అమ్మ అందరినీ తన వాత్సల్యామృత మహోదధిలో ముంచెత్త టం సాధారణంగా కనిపించే అసాధారణమైన విషయం అని హృద్యంగా సంక్షిప్త సుందరంగా పలికారు.
శ్రీమతి ఎమ్. చారుమతీ పల్లవి: ‘విశ్వంలో ఎన్ని పాటలు ఉన్నా అమ్మ పాటను మించినది ఏదీ లేదు’ అనే విశ్వాసంతో ‘అన్నదాతా సుఖీభవ’ అనే గీతాన్ని ఎంపిక చేసుకుని అవ్యక్తమధురంగా గానం చేశారు; అమ్మ శ్రీ చరణాలకు స్వరాభిషేకం చేశారు; తెరవెనుక గానం చేసిన గాయనీ గాయకుల్ని తెరముందు నిల్పి ఆ అమరగానాన్ని వినిపించారు.
శ్రీ ఎమ్.వి.ఆర్. సాయిబాబు: ఇమామ్ (శ్యాం) అనే ముస్లిం సోదరుడు అమ్మ పావన నామాన్ని దర్శించి తన్మయత్వంతో గానం చేశారని, ఈ సందర్భంలో అమ్మ సశరీరంగా ప్రత్యక్షమై ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. అమ్మ శతజయంతి సందర్భంగా 108 కోట్ల అమ్మ నామజపం చేయటం మన లక్ష్యం అనీ, పలుగ్రామాల్లో అమ్మ సత్సంగాల్ని నిర్వహిస్తూ నామ జపం ప్రోత్సహిస్తున్నామనీ నామమునకు నామికి భేదం లేదు కనుక మనం త్రికరణశద్ధిగా నామజపం చేస్తున్న సమయంలో వాస్తవంగా అమ్మ ప్రత్యక్ష సన్నిధిలో ఉంటామని చాటిచెప్పారు.
శ్రీమతి గరుడాద్రి వనజ: అవతారమూర్తి అమ్మ ఎంచుకున్న పూజాపుష్పాన్ని కావటం నా అదృష్టం అనీ; అమ్మను నేను కోరుకున్నది ‘శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చితించెదన్’ – మోక్ష సామ్రాజ్యపదప్రాప్తిని – అనీ రనరమ్యంగా వివరించారు. అమ్మ నర్వజ్ఞత్వ సర్వవ్యాపకత్వ సర్వశక్తిమత్వ దైవీలక్షణాన్ని రెండు కళ్ళతో దర్శించిన అదృష్టవంతురాలను అనీ; తమ ఇలవేలపు ‘రాజరాజేశ్వరి’యే అమ్మ అనీ సందర్భపూర్వకంగా ప్రసంగించారు.
డాక్టర్ ఎమ్.బి.డి.శ్యామల: అమ్మను కీర్తిస్తూ తను రచించిన గజల్ పాడి వినిపించారు. ‘అమ్మపాదము సిరులు కురిసే పద్మమే కాదా?’, (పద్మం అంటే – సహస్రార కమలం) ‘అమ్మ ప్రేమను కొసరి పెడితేమధురమే కాదా?’ అంటూ Rhetorical Questions ను మేళవించి అందే అర్థాన్ని సుబోధకం చేశారు. ఆ క్రమంలో ‘అమ్మపాటను పాడు ధన్యను ‘శ్యామ’ నే కాదా?’ అన్నపుడు అమ్మ ఎడల భక్తి శ్రద్ధలు శరణాగతి భావనలతో ప్రేక్షకులు సజల నేత్రులైనారు; ముకుళిత హస్తులైనారు.
శ్రీ బి.యల్.సుగుణ: (కన్వీనరు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన వారికి, వీక్షించి ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతాభివందనములు తెలియ చేశారు. తదుపరి Zoom Meeting 4-4-2021 అని ముందుగా తెలియజేస్తూ Zoom link ను మన హితులు, సన్నిహితు లకు తెలిపి తద్వారా అధికులు లబ్ధిపొందేటట్లు సహకరించ విజ్ఞప్తి చేశారు.