శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం : అమ్మ యందలి భక్తితత్పరతతో ఈ కార్యక్రమంలో ప్రసంగించే వక్తలు, శ్రోతలు, కార్యనిర్వాహకులందరికీ స్వాగతం పలికారు. అమ్మ తాను అమ్మగా ప్రకటితమైనది; అమ్మ కళ్యాణంతో అమ్మకి ఆధారం – నాన్నగారు అడుగు పెట్టడంతో అమ్మ, నాన్న, బిడ్డలు కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకున్నది; అమ్మ తన ఇంటిని అందరిల్లుగా తన కుటుంబాన్ని విశ్వకుటుంబంగా విస్తృతం చేసింది – ఇట్టి పరమార్థాన్ని ప్రసారం చేయటమే అమ్మతత్త్వ ప్రచారసమితి లక్ష్యం అనీ వివరించారు.
డాక్టర్ ఎమ్.బి.డి.శ్యామల : ‘యయాశక్త్యా బ్రహ్మా’ శ్లోకాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా ఆలపించారు. అది ఒక సార్వత్రిక ప్రార్థనాశ్లోకం.
శ్రీ డివియన్ కామరాజు: 5-5-2021న మనం అమ్మ 98వ కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అమ్మ మనకు ఎన్నో కళ్యాణ సూక్తులను అనుగ్రహించింది. “ఒక పెన్నిధి అండన చేరడమే పెండ్లి, గృహస్థాశ్రమం కోటలో ఉండి యుద్ధం చేయటం, సన్యాసం కోట విడిచి యుద్ధం చేయటం, ఆధ్యాత్మిక సాధనకి సంసార అవరోధం కాదు మంచి అవకాశం, భర్త అంటే శరీరం కాదు, భావన” వంటి అమ్మ సూక్తులను వివరించారు. రసవత్తరంగా సభను నిర్వ హించారు.
శ్రీ వియస్ఆర్మూర్తి (ప్రఖ్యాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త): ‘ఆద్యంతరహితమైన జగజ్జనని స్త్రీరూపధారిణియై అవనీ సంచారం చేసిన పుణ్యస్థలి జిల్లెళ్ళమూడి. సూతపురాణంలో – ‘బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్థశ్చ భిక్షుకః అతివర్ణాశ్రమీ చేతి క్రమాత్ శ్రేష్టా ‘విచక్షణా’ అని చెప్పబడింది.
అమ్మ అతివర్ణాశ్రమి; అంటే సర్వ వర్ణములు, సర్వ ఆశ్రమాలను దాటినటువంటిది. వాస్తవం ఏమంటే జాతిమత వర్ణ వర్గములను దాటి కులభేదము, మతభేదము, గుణభేదము లేని ఒక విశ్వమానవీయతా భావన అతివర్ణాశ్రమం. దానిని అమ్మ అతి బాల్యంలోనే సాధించింది. జిల్లెళ్ళమూడి ఒక కుగ్రామం, అది అమ్మ పాదస్పర్శ చేత మహాపుణ్యక్షేత్రం అయింది. పార్వతీదేవి, రాజరాజేశ్వరీదేవి జిల్లెళ్ళమూడి అమ్మగా వచ్చి అతివర్ణాశ్రమిగా సంచారం చేసిన పుణ్యభూమి జిల్లెళ్ళమూడి.
అమ్మ గృహస్థాశ్రమాన్ని ఎందుకు ఎన్నుకున్నది? అంటే – అమ్మకు ఆలంబన అవసరము లేదు. ఆధారం అవసరం లేని అమ్మకు ప్రాపంచికంగా ఆధారంగా కనిపించే వస్తువు ఒకటి కావాలి. నాన్నగారు అంటే అమ్మలో ఉన్న కుండలినీ శక్తిరూపు దిద్దుకుని అమ్మతో జీవించింది. నాగము అంటే – ప్రాణము, చైతన్యము, వెన్నుబాము, షట్చక్రాలను దాటి చంద్రకళ, సహస్రారము దాటి ఉండే కుండలిని. దానిని తనకు ఆధారంగా ఉండాలి అనుకున్నది అమ్మ. కుండలిని అంటే నడిచేది, నడిపించేది. అని అర్థం. అలా వారు అమ్మ జీవిత భాగస్వామి కాగలిగారు. చంద్రుడు – వెన్నెల, వాక్కు అర్థము ఎట్లా రెండూ వేరుకావో ఇక్కడ అమ్మ నాన్నగారలు భార్య భర్త అనే రెండు పాత్రలు ఈ ప్రపంచానికి ఆధారములు, ఆధేయములు – ఇది నా అధ్యయనం, నా దర్శనం.
“మీరంతా నా బిడ్డలు” అన్నది అమ్మ; అంతే కాదు. “నా అవయవాలు” అన్నది. అదే విరాణ్మూర్తి. అమ్మ స్వరూపం. అమ్మ నడయాడిన ప్రతి అణువు కైలాసమే, వైకుంఠమే. అమ్మ మాటల వెనుక దాగి యున్న తాత్త్విక భావనని అర్థం చేసుకోవాలంటే ఒక జీవిత కాలం చాలదు. మనం లలితాదేవిని రాజరాజేశ్వరీదేవిని చూడలేదు, తెలియదు. కానీ తెలిసిన అమ్మను ‘అమ్మ’గా చూడలేము.
రెండేళ్ళల్లో అమ్మ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నాం. మనందరం సంఘటితమై ప్రణాళికాబద్ధంగా వాటిని జగజ్జేగీయమానంగా నిర్వహించకునేందుకు అమ్మ స్వరూపంగా వున్న శ్రీ విశ్వజననీ పరిషత్ సంస్థకి తోడుగా నిలవాలి” అంటూ ఎన్నో నిగూఢ తత్వాల్ని, లోతైన సత్యాలను, సరళ సుందరంగా స్వకీయ వాగ్జరీ వేగ వైభవంతో ప్రసంగించారు.
డాక్టర్ ఎమ్.బి.డి.శ్యామల : ‘హాయిహాయిగా తీయ తీయగా ఆలపింతు నీ నామం, అమ్మా! వలదు నాకిక విరామం’; ‘నేను నేనైన నేను’ అన్నీ తానైన తల్లిని ఏ రీతి నర్చింతునో… అమ్మను ఏకరణి భజియింతునో’ అనే గీతద్వయాన్ని హాయిగా, ఆహ్లాదకరంగా గానం చేశారు.
శ్రీ శ్రీకాంత్ : అమ్మ నాన్నగారల విశేష అద్భుత సుందర అపురూప వర్ణచిత్రాలను సందర్భోచితంగా ఎడనెడా ప్రదర్శించి సభను మరింత స్ఫూర్తిదాయకంగా అర్థవంతంగా తీర్చిదిద్దారు.
శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం: ‘విశ్వకళ్యాణ ప్రదాయిని’ శీర్షికన గంభీరంగా ప్రసంగించి అనేక నిగూఢ తత్త్వరూప అనర్ఘ్య రత్నాలను ఆదరంగా పంచిన శ్రీ వియస్ఆర్ మూర్తిగార్కి, రసరమ్యంగా సభా నిర్వహణ కావించిన శ్రీ డివియన్ కామరాజుగార్కి, సుమధుర గీతగానం చేసి అలరించిన డాక్టర్ ఎమ్.బి.డి. శ్యామల గార్కి కృతజ్ఞతాభివందనములు సమర్పించారు. తదుపరి Zoom Meeting 6-6-2021 న నిర్వహించు కుంటున్నామని తమ మలి పలుకుల్లో వినిపించారు. శాంతిమంత్రంతో సభ ముగిసింది.