సందర్భం: 15-8-2021 అన్నపూర్ణాలయ వార్షికోత్సవం
డా|| బి.ఎల్.సుగుణ : ‘15-8-1958 న అమ్మ అన్నపూర్ణాలయాన్ని స్థాపించి ‘నేడు ప్రపంచానికే స్వాతంత్య్రం వచ్చిన రోజు’ అని ప్రకటించింది. తన అనురాగాన్ని అనుగ్రహాన్ని ప్రసారం చేయటానికి అన్నపూర్ణాలయాన్ని ఒక మాధ్యమంగా చేసుకున్నది. అన్నపూర్ణాలయం బోధనాలయం, వైద్యాలయం, ఆనంద నిలయం, మహిమాలయం’ అంటూ సభలో ఆసక్తితో పాల్గొంటున్న సోదరీసోదరులకు, గాయనీ మణికి, వక్తలకు సభానిర్వాహకులకూ స్వాగత సుమాంజలి సమర్పించారు.
ఆచార్య ద్వారం విజయలక్ష్మి ‘యయా శక్త్యాబ్రహ్మా’ అనే శ్లోకాన్ని రసార్ద్రంగా నిండు మనస్సుతో భావయుక్తంగా ఆలపించారు, అమ్మకు స్వరాంజలిని సమర్పించారు.
ఆచార్య మల్లాప్రగడ: ‘జయహోమాత యటంచు పల్కుటొకటే సార్ధక్య మీ జన్మకున్. అమ్మ అన్నపూర్ణాలయాన్ని ప్రారంభించి – ‘ఇది జగన్నాధ రథం కదిలితే ఆగదు. ఎవరైనా జిల్లెళ్ళమూడి రావచ్చు, కాని ఆకలితో వెళ్ళకూడదు’ అన్నది. అన్నపూర్ణాలయంలో అన్నం పెట్టటం ఒక అర్చన. అమ్మ చరణాలను ఆశ్రయించిన మనం అమ్మ ఆచరణను కూడా ఆశ్రయిస్తే అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతాం.
అమ్మ తన బిడ్డలకి రకరకాల అనుభవాలను ప్రసాదించింది.ఆయా అనుభూతుల్లో అమ్మ సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం సుబోధకం అవుతాయి. ఆ అనుభవాలు ప్రతి ఒక్కరికీ వర్తించేవే. వక్తలు అమ్మ అన్నం పెట్టటంలోని ఆంతర్యాన్ని, సర్వేసర్వత్రా ప్రకాశించే అమ్మ అనుగ్రహవృష్టిని, అమ్మ వాక్యాల్లోని నిగూఢ మహనీయతత్త్వాన్ని చక్కగా ఆవిష్కరించారు. అమ్మ ఇచ్చిన అనుభవాలను ఆకళింపుచేసుకుంటే మన జీవనయానాన్ని సక్రమంగా మలచుకోవచ్చు, మన అంతరంగాన్ని పూజాపుష్పంగా అమ్మకి సమర్పించవచ్చు. “గుండెగుడిలోన ప్రేమతో కొలువుదీరి జగతినెల్లను నడిపించు సర్వశక్తి అర్కపురిలోన అమ్మయై అవతరించె. అమ్మ చరణారవిందములు ఆశ్రయింతు” అంటూ సభను సర్వాంగీణంగా సకల హృదయ రంజకంగా నిర్వహించారు.
శ్రీ ఎమ్.దినకర్: ‘అన్నం బహుకుర్వీత’ ఆహారనిల్వలు బాగా పెంచాలని మహర్షులు ఉద్బోధించారు. అన్నపూర్ణాలయంలో అన్నం తినటానికి ‘ఆకలే అర్హత’ అన్నది అమ్మ. అది ప్రపంచవ్యాప్తంగా బలీయమైన ప్రేరణశక్తి అయింది. అమ్మ జిల్ళెళ్ళమూడి కాపురానికి వచ్చి గ్రామస్తుల ఆకలిబాధను గమనించి – ఇంటింటా పిడికెడు బియ్యం పథకం ద్వారా Food Bank ను ఏర్పాటు చేసింది.
‘ఇది అన్నదానం కాదు, ఎవరి అన్నం వారు తింటున్నారు’ అంది అమ్మ. దీనినే ప్రపంచం Right to Food అని తీర్మానించింది. 1966 లో హరిత విప్లవం (Green Revolution) వచ్చింది. శ్రీ లాల్బహదూర్ శాస్త్రి నాయకత్వంలో ఏర్పాటైన కమిటీ చర్యలతో ఆహారకొరత పోయింది. విశ్వవిఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త అమర్త్యసేన్ విప్లవాత్మకంగా Entitlement and Empowerment to Food అన్నాడు. అమ్మ అన్నది “దేశంలో ఇప్పుడు ఆకలి చావులు అంతగా లేవు” అని. అంటే – జిల్లెళ్ళమూడి లోని అమ్మ అమోఘ సంకల్పం, చర్య ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనించాయి, తక్షణం స్పందించారు. ఎన్నో దేవాలయాలు, Non – Government Organizations క్షుద్బాధనివారణకి పెద్దపీట వేశాయి. ప్రేమమూర్తి అమ్మ మాత్రమే తన కడుపునింపుకోకుండా అనుక్షణం తన బిడ్డల కడుపు నింపటానికి తహతహ లాడింది’ అని సాధికారికంగా సార్ధంగా అమ్మ ఆంతర్యానికి దర్పణం పట్టారు.
ఆచార్య ద్వారం విజయలక్ష్మి సాకార సంగీతలక్ష్మిగా: ‘జిల్లెళ్ళమూడిలో స్త్రీ రూపధారిణియై దిగివచ్చి నిల్చినది దివ్యమాతృప్రేమ’ గీతాన్ని కర్ణపేయంగా సాహిత్యవైభవం మన హృదయాలకు హత్తుకునేటట్లు గానం చేశారు.
శ్రీ B.G.K.శాస్త్రి: 1962 లో తొలిసారి అమ్మను లలితాంబక్కయ్య గారింట్లో దర్శించుకున్నాను. కృపతో అమ్మే స్వయంగా నా వద్దకువచ్చి వాత్సల్యంగా తట్టింది. ఒకసారి అమ్మ దర్శనార్థం వెళుతూ బత్తాయి పళ్ళు తీసుకెళ్ళాను. ఆ సమయంలో అమ్మ ‘బత్తాయి రసం త్రాగాలని ఉంది’అన్నది, నా నివేదనను ప్రేమతో స్వీకరిం చింది. మరొకసారి గంధం, పన్నీరు సుగంధ … ద్రవ్యాలను తీసుకువెళ్ళాను. స్నానానికి వెళ్ళకుండా అమ్మ ‘వాళ్ళు తెస్తున్నారంటూ’ నిరీక్షించి నా పూజాద్రవ్యాల్ని నిండు హృదయంతో స్వీకరించింది. అంటే అమ్మేవచ్చి నా గుండెల్లో నా మనోమందిరంలో సుప్రతిష్ఠిత అయింది. నాకు ఉద్యోగరీత్యా సిక్కిం బదిలీ అయింది. ప్రేమమూర్తి అమ్మను విడిచి అంతదూరం పోవటం ఇష్టం లేక Resign చేశాను. కానీ అమ్మ ఊరుకోలేదు; మూడు ఉద్యోగాలు వచ్చాయి – Bank of Baroda లో Officer గా చేరాను. ఒకసారి అమ్మను “Self Realisation ఎట్లా వస్తుంది?”అని అడిగితే, “నీకుందిగా, నాన్నా!”అన్నది. ఆ స్థాయికి నన్ను ఉద్ధరించాలని అమ్మ దయ నాపై. 1985 లో అమ్మ భౌతికంగా కనుమరుగైన తర్వాత నా కంటివెలుగు పోయినట్లు విలపించాను. అమ్మనాకు స్వప్నదర్శనాలను అనుగ్రహించింది; నన్ను ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంది’ అంటూ అమ్మ భగవత్తత్త్వాన్ని స్వీయ భాగవత చరిత్ర వివరణ ద్వారా సరళసుందరంగా అభివర్ణించారు.
శ్రీమతి వల్లూరి హైమ: అభిషేకం, అర్చనలూ, ఉపచారాలూ పూర్తి అయిన తర్వాత ఎట్టి పరిస్థితిలోను అమ్మగుడి తలుపులు తెరువరాదు. కానీ, తన బిడ్డల ఆర్తిని గమనించి పునః ప్రవేశం, పునర్దర్శనాలకి అమ్మే సంకల్పించి ఆదేశిస్తే – ఆ ప్రేరణ మనగుండెల్లోంచి పెల్లుబికి కూర్చోనివ్వదు, నిలువనివ్వదు. ఎక్కడో తిరుపతినుంచి, వైజాగ్నుంచి అమ్మను తమ గుండెల్లో నింపుకుని తన దర్శనం కోసం అభ్యర్ధిస్తూ పరుగుపరుగున వచ్చిన వారికి అది కాలాతీతం అయినా అమ్మ దర్శన స్పర్శన భాగ్యాలను కలిగించాను. అలా చేసింది ఈ ‘నేను’ హైమ కాదు. నా వ్యక్తిత్వం, నా నిర్ణయం, నా విధినిషేధాలు … ప్రక్కన పెట్టాల్సిందే. మనందరం అమ్మ చేతిలో ఉపకరణాలం. ఒక Screwdriver తనంతట ఏం చేయగలదు? చేయిస్తే చేస్తుంది. మనమూ అంతే. బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుకున్న ఒక అమ్మాయి షిర్డిసాయి భక్తురాలు. నిరంతరం తనకు బాబా స్మరణ, ఉపాసన. అంతేకాదు; సంభాషిస్తారట. ‘ఫలానాచోట హైమాలయం ఉంది, అది నిజమైన ప్రేమాలయం. పోయి దర్శించు’ అని చెప్పారట బాబా. ఆ అమ్మాయి వచ్చి హైమమ్మను ఆనందబాష్పాలతో అభిషేకించి, పరవశించి, “నేను ఇక్కడనే ఉంటాను; ఎక్కడికీ పోను” అన్నది. అమ్మలేనిచోటులేదు, కాని ఆర్తి ఉన్నచోట అమ్మ ఉన్నదని మనం గుర్తిస్తాం’ – అంటూ గంగాప్రవాహంలా అమ్మ అనుగ్రహతీరుని, ఆర్తత్రాణపరాయణతని వివరించారు.
ఆచార్య ద్వారం విజయలక్ష్మి ‘అన్నదాతా సుఖీభవ! అనసూయ మాతా సుఖీభవ! జన్మదాతా జయీభవ! విజ్ఞాన ప్రదాతా విజయీ భవ!!’ అనే సందర్భోచిత గీతాన్ని మధురమధురంగా గానం చేసి సామగానప్రియ అమ్మకు స్వరార్చన చేశారు.
డా|| యస్.యల్.వి. ఉమామహేశ్వరరావు: ఉపనిషద్వాక్యాలకు అమ్మ వాక్యాలకూ భేదం లేదు. “తప్పని తెలిసి తప్పించుకోలేక చేసేది తప్పు’ అన్నది అమ్మ. అమ్మ మాటలు సులభంగా ఉండి, ఇంతేనా అనిపిస్తుంది. కానీ జ్ఞానసింధువు అమ్మ మాటలు శబ్దం మోయలేని అర్థాన్ని కలిగి ఉంటాయి. ‘నేను నేనైన నేను’ అనేది ‘అహం బ్రహ్మాస్మి’ అనే మహావాక్యం; అట్లే “అంతా అదే”అనేది ‘అయమాత్మా బ్రహ్మా’ అనే మహావాక్యం. ‘అన్నం బ్రహ్మ అయితే అశుద్ధమూ బ్రహ్మే’అన్న అమ్మవాక్యం మనకి కొరుకుడు పడదు. అమ్మ ‘ఆవుపేడతో సందెగొబ్బెమ్మను చేసి మంగళగౌరిగా ఆరాధిస్తున్నాం కదా! అన్నపుడు ఇదే విజ్ఞానం, ప్రజ్ఞానం అని మనకి బోధ పడుతుంది’అంటూ రామకృష్ణ అన్నయ్య గ్రంథం శ్రీచరణ వైభవంలోని గొప్పతనాన్ని అమ్మ వాక్యాల్లో దీపించే మహోన్నత వాస్తవికతను రసరమ్యంగా ఆవిష్కరించారు.
ఆచార్య మల్లాప్రగడ: కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేసిన వారందరికీ పేరుపేరున ధన్యవాదాల్ని సమర్పించారు. ‘అమ్మను నమ్ముకున్న అభయమ్ము జయమ్మును నిశ్చయంబగున్’ అంటూ సభక్తికంగా అమ్మ శ్రీచరణాలకు అంజలిఘటిస్తూ స్వస్తి వచనాలతో సభ ముగించారు.