డా||బి.ఎల్.సుగుణ: ‘అమ్మ మహనీయ తత్త్వాన్నీ అవతారపరమ ప్రయోజనాన్నీ వివరించటమే ఈ వేదిక లక్ష్యం. “తెలియనిది తెలియజేయటానికే నా రాక”అంటూ ఎన్నో శాశ్వత సత్యాలను అమ్మ అలవోకగా సరళసుందరంగా అందించింది. లౌకిక ధర్మాలను మొదలుకొని అద్వైత తత్త్వం వరకు అమ్మ వివరించని అంశమే లేదు. నిత్యజీవితంలో కర్తవ్యం కంటే ఆధ్యాత్మిక సాధన భిన్నంగా ఉందనుకునే వారికి “కర్తవ్యమే దైవం”అని ప్రబోధించింది” అంటూ వక్తలకు, శ్రోతలకు, సభాపతికి సాదర స్వాగతాంజలి సమర్పించారు.
శ్రీరావూరి ప్రసాద్: “ఊరూర మనసార నోరార పలుకుచున్నారు ఎల్లవారును నీ నామమాల.”…. అనే గీతాన్ని అవ్యక్తమధురంగా గానం చేశారు.
శ్రీ ఎల్.సత్యనారాయణ (లాలన్నయ్య): అమ్మ ఎందరో అనాథలను బాధితులను ఆదుకున్నది. ఆధారంలేని ఆడపిల్లలను చేరదీసి స్వయంగా వారి వివాహాలు చేసింది. దివిసీమలో ఉప్పెన వచ్చినపుడు దీనులను పీడితులను అక్కున చేర్చుకుని వారి కన్నీటిని స్వయంగా తుడిచి ఆదరించింది. “మీకు ఇక సంస్థే తల్లి. మీరు సంస్థను చూస్తే నేను మిమ్మల్ని చూస్తాను” అని హామీనిచ్చింది, కర్తవ్యాన్ని నిర్దేశించింది. “శాస్త్రం అనుభవాన్నివ్వదు, అనుభవం శాస్త్రాన్నిస్తుంది.” “పరిమితమైన మమకారం మానవత్వం, సర్వత్రా మమకారం, మాధవత్వం” ‘జయప్రదం, శుభప్రదం జగజ్జనని దర్శనం’ అంటూ అమ్మ సూక్తులనూ అమ్మ దర్శన ఫలాన్ని వినిపిస్తూ వక్తలకు గాయనీమణులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘పదవీ విరమణ శరీరానికి గాని మనస్సుకు కాదు, మనందరం శేషజీవితాన్ని అమ్మ సేవకి అంకితం చేసుకుందాం, అమ్మ శత జయంతి ఉత్సవాల్ని ఉత్సాహంగా అందరి సహాయ సహకారాలతో జయప్రదంగా నిర్వహించుకుందాం’ అంటూ ఐకమత్య బలాన్ని చాటిచెపుతూ సార్ధక వచనాలతో సమర్ధవంతంగా సభా నిర్వహణ చేశారు.
శ్రీ డి.వి.ఎన్. కామరాజు: ‘జిల్లెళ్ళమూడిలో అనుదినం నిత్యకళ్యాణం పచ్చతోరణమే. కాగా శరన్నవరాత్రులకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజుల్లో ఆలయంలో ఉన్నది విగ్రహం కాదు, సజీవమూర్తి దివ్య అఖండ చైతన్య దీప్తి అనే దివ్యదర్శన భాగ్యం కలుగుతుంది’ అంటూ త్రిశక్తిరూపిణిగా అమ్మను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అర్చించుకుని తరిద్దాం’ అనే స్వాగత వచనాల్ని సాదరంగా పలికారు.
శ్రీ ఎమ్. బాలాజీ: ‘అమ్మను గురించి మాట్లాడుకోవడం, తలపోయటం అత్యద్భుతం. అమ్మ నాకు బ్రహ్మోపదేశం చేసింది. అమ్మ వాక్యాలన్నీ మహోపదేశాలే. “అంతా అదే (శక్తి/దైవం) చేయిస్తున్నదనుకో, నాన్నా!” అనే దాన్ని వినటానికి చిన్నగా ఉన్నా, లోతుగా ఆలోచిస్తే మన ఫిలాసఫీ మొత్తం అంతా దానిలోనే ఉంది. “నీవు నా చేతిలో కేవలం ఒక ఉపకరణం, నీకు ప్రేరణ ఇచ్చిందీ, నీ చేత చేయిస్తున్నదీ, చేస్తున్నట్లు అనుభూతి నిస్తున్నది, చేసిన దానికి ఫలితాన్ని ఇస్తున్నదీ నేనే” అని అమ్మ చెప్పింది. ఈ తత్త్వం ఒకనాడు నాకు అనుభవంలోకి వచ్చింది. ఒక వేదికపై నేను ప్రసంగించవలసినపుడు ఏం మాట్లాడాలా అని నేను తర్జనభర్జన పడుతున్నపుడు నాకు తెలియకుండానే అప్రయత్నంగా నా నోట ఏవో పలుకులు వచ్చాయి. వాటిని ఎందరో మెచ్చుకున్నారు, ఆ మాటలు వారి జీవితంలో పరిణామం తెచ్చాయి.
“శ్వాసమీద ధ్యాస నిల్పు” అనే అమ్మ మాట అభ్యాసంతో నాకు విచిత్రమైన హాయినిస్తోంది. నా వరకు అది జీవనయానాన్ని మళ్ళించి జీవితగమ్యాన్ని చేర్చేటంత గొప్ప అనుభవం. ‘కష్ట సుఖాలు’ అనేవి జంటలు, అవిభాజ్యం. ఒకదానిని కోరుకుంటే దానివెంటే రెండవదికూడా వస్తుంది ఒక పేకేజి లా. అమ్మ పలుకు నాకు స్వాంతన కలిగించింది, వేదనాభారం తగ్గి సమతుల్యం ప్రాప్తించింది. మనకి ఎప్పుడు ఏది అవసరమో దానిని అమ్మ ఉచితంగా సముచితంగా ఇస్తుంది’ అంటూ – స్వీయ అనుభవపూర్వకంగా అమ్మ మహత్తత్త్వాన్ని ఆవిష్కరించారు.
శ్రీమతి వై.నాగేంద్రమ్మ: ‘అమ్మా అని ఒకసారి అనినంతనె చాలును రా!’ గీతాన్ని ఆర్తితో మధురంగా గానం చేశారు.
శ్రీ బి. సారంగపాణి: ‘అమ్మ తన ఇంటిని ‘అందరిల్లు” అన్నది. ఈ పదం మనకి ఎక్కడా కనిపించదు. అంతరాలు, అగాధాలు, తారతమ్యాలు లేని విధంగా జిల్లెళ్ళమూడిలో తన సూక్తులకు రూపకల్పన చేసి ఆచరణాత్మకంగా ప్రబోధించింది అమ్మ. ఆంగ్లేయులు కులగణన చేశారు. అమ్మ సహపంక్తి భోజనం ఏర్పాటు చేసింది. అందరినీ తన బిడ్డలుగా ప్రేమించి అందరినీ ఏకోదర బాంధవ్యంతో సహజీవనం చెయ్యమన్నది. ఇది ఆశ్రమం కాదు, ఆశ్రయం’ అంటూ బాధితుల్ని ఆదరించింది అంటూ, అమ్మను ఒక పరిపూర్ణ మానవతావాదిగా ఆవిష్కరించారు.
శ్రీమతి పి.శైలజ: ‘అనుభవసారము నీవమ్మా!’ అనే రాజుబావ పాటను రసరమ్యంగా భావయుక్తంగా గానం చేశారు.
శ్రీ జి.చిన్నమనాయుడు: ‘అసలు విషయం చెప్పమ్మా!’ అనెడి స్వీయ కవితను వినిపించారు. ‘అమ్మ అంటే ఎవరు?’ వంటి అనేక వ్యాసాల్ని రచించారు. అమ్మ చేత ముద్దుగా ‘చిన్న’ అని పిలిపించుకున్న అదృష్టవంతులు. అమ్మ, నాన్న గార్ల ఇరువురి ప్రేమను పుష్కలంగా పొందారు. “అమ్మప్రేమ అనంతం. అమ్మప్రేమను వివరించాలనే ప్రయత్నం ఆకాశంలో నక్షత్రాల్ని లెక్కించటం, సముద్రాన్ని ఈదటం వంటిది. ఒకనాడు నేను సొమ్మసిల్లి పడిపోయాను. అమ్మ నాకు దర్శనం ఇచ్చి వెన్నుదట్టి నిలబెట్టింది. ‘తృప్తే ముక్తి’, ‘జీవితం సమస్యలతో రణం’ అంటూ అమ్మ వేదాంత సారాన్ని అలతి అలతి పదాలతో బోధించింది’- అంటూ హృద్యంగా ప్రసంగించారు. అమ్మ చూపిన వెలుగుబాటలో రాచబాటలో సేవామార్గంలో పయనిస్తున్నారు.
డా॥ బి.ఎల్.సుగుణ: సభను సర్వసమర్ధంగా నిర్వహించిన శ్రీలాలన్నయ్యకు, వక్తలకు, గాయనీమణులకు, శ్రీకామరాజు అన్నయ్యగారికి పేరుపేరున ధన్యవాదాలను సమర్పించి శాంతి మంత్రంతో సభ ముగించారు.