1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మకు అత్యంత ప్రీతికరమైన వారు

అమ్మకు అత్యంత ప్రీతికరమైన వారు

Vaddadhi Satyanarayana Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : August
Issue Number : 1
Year : 2013

అనసూయేశ్వరాలయంలో ప్రతిరోజూ “జయహో మాతా శ్రీ అనసూయా ! రాజరాజేశ్వరి ! శ్రీ పరాత్పరి!” అని పైకే అమ్మ నామం చెబుతూ అంతరాలయం చుట్టూ ప్రదక్షిణ చేయటం నాకు అలవాటు.

ఒక రోజు అలా ప్రదక్షిణ చేసే ముందు గర్భగుడిలో అమ్మ ప్రక్కనే ఉన్న నాన్నగారిని చూచి అమ్మతో బాటు నాన్నగారిని కూడా కలిపి నామం చెబితే బాగుండు ననిపించి, రోజూ నేను పూరింటి ముందు కూచుని తోటి సోదరీసోదరులతో కలిసి చేసే అమ్మ నామసంకీర్తనలతో నాకు అత్యంత ప్రీతికరమైన రాగంలో చెప్పే అమ్మ నామాన్ని కొంచెం మార్చి, అంటే సగం అమ్మనామం, సగం నాన్నగారి నామం కలిసి వచ్చే విధంగా – 

“జయహోమాతా ! శ్రీ అనసూయా ! అనసూ యేశ్వర! శ్రీ నాగేశ్వర !” అని తన్మయత్వంతో గానం చేస్తూ ప్రదక్షిణ చెయ్యటం మొదలు పెట్టగానే విచిత్రంగా నా వెనుక అదే వరుసలో ఒక స్త్రీ గొంతు కూడా వినబడింది.

నేను ఠక్కున నామం ఆపి వెనుదిరిగి చూచాను. నా వెనుక ఎవరూ లేరు.

ఉదయం విశ్రాంతి సమయంమవటం వలన అక్కడ అర్చకస్వాములు కూడా లేరు.

ప్రదక్షిణ ఆపి వెనుకకు వచ్చి, అనసూయాలయం లోనూ దాని ప్రక్కల నున్న వరండాలోనూ, చివరకు హైమాలయం కూడా చూసాను. ఎవరూ కనబడలేదు.

సరే అని మళ్ళా వెనక్కు వచ్చి అదే నామాన్ని అదే రాగంలో చెబుతూ మళ్ళీ ప్రదక్షిణ మొదలుపెట్టాను.

అంతే… మళ్ళీ అదే స్త్రీ గొంతు నా గొంతుతో జత కలిపింది! మధ్యలో ఒకసారి మగగొంతు కూడా వినబడినట్లు గుర్తు

. అప్పుడనిపించింది. ఒకవేళ ఆ గొంతు అమ్మదే అయి వుంటుందని. కారణం – నాన్నగారంటే అమ్మకు అత్యంత అనురాగం ! భక్తి, శ్రద్ధలు.

అందుకే నేను చెప్పే నామంలో తన నామంతో బాటుగా నాన్నగారి నామం కూడా వినబడటంతో అమ్మ సంతోషించి, తన్మయమై నాతోబాటు గొంతు కలిపి ఉంటుంది.

అంతే… ఆ భావం స్ఫురించగానే ఒక్కసారిగా నా శరీరం జలదరించింది!

అమ్మ నా వెంట ఉండి నాతో బాటుగా నామం చెప్పిందా?! అనుకుంటూ మరింత భక్తిపారవశ్యాలతో, అదే స్త్రీ గొంతు నా వెనుక వినబడగా- 

“జయహోమాతా ! శ్రీ అనసూయా ! అనసూయేశ్వర! శ్రీ నాగేశ్వర!” అంటూ ప్రదక్షిణలు ముగించాను.

పైన నేను పేర్కొన్న విషయం అక్షర సత్యం ! ఇందులో అతిశయోక్తి గాని, కల్పితం గాని లేదు.

మరొకవిషయం ! ఆనాటి నుంచి ఈనాటి వరకూ నేను ప్రతిదినం అలా అమ్మ నాన్నగార్ల నామం కలిపి చెబుతూ ప్రదక్షిణలు చేస్తున్నా మళ్ళా ఆ స్త్రీ గొంతు నా వెనుక వినబడలేదు.

ఇదీ సత్యమే !

అందుకే నాన్నగారి ఈ శతజయంతి సంవత్సరం నుండయినా అనసూయేశ్వరాలయంలో ప్రదక్షిణలు చేసే భక్త సోదర సోదరీమణులు కనీసం మనసులో నయినా పై విధంగా అమ్మ, నాన్నగార్ల నామాలు కలిపి ఉచ్చరిస్తూ ప్రదక్షిణ చేస్తే బాగుంటుందని ఇందుమూలంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!