అమ్మఅడుగుల జాడల ననుసరించి
అమ్మసూక్తులు దీక్షతో ఆచరించి
అమ్మప్రేమకు వారసులైన వారె
ధన్యతములంచు మనసార తలచుచుందు.
తెలియవలసినట్టి దివ్య సందేశమ్ము
అమ్మజీవితమ్మె యగును కాదె!
ఆ చరణయుగమ్ము నరసేయుట కంటె
ఆచరణకై మురియ అమ్మ, నిజము.
విగ్రహమ్మునుండి వీక్షించు సర్వమ్ము
బొమ్మ కానెకాదు, అమ్మ బ్రహ్మ.
పరులబాగు కొఱకు బ్రతుకుట తెలియుటే
విశ్వజనని మెచ్చు విరుల సరులు.
రాతిబొమ్మను పూజించు ప్రీతికంటె
సాటి ప్రాణుల సేవింప సార్థకమ్ము
ఆర్తినొందిన వారిని ఆదుకొనుటె
అసలు సిసలైన అర్చన అమ్మ కెపుడు.
హృదిని ప్రేమ గలిగి ఎదుటివారికి సేవ
అమ్మబ(ఒ)డిని నేర్చు అసలు చదువు.
ఆలయమున సేయు అర్చన లన్నియు
శిక్షణములు మనకు సేవకొఱకు.
– వ్యక్తిపూజనుండి వ్యక్తిత్వ పూజకు
మార్పు చెంద వలయు మనము నిజము
ప్రేమ సేవ శాంతి ప్రేరణ కావలె
అసలు సిసలు పూజ అమ్మ కదియె.