అమ్మా! నీకొక గుడి కావలెనా?
చాలున అమ్మా! ఒక గుడి నీకు ?
రాతిబండలతో కట్టబడినది
మూతబండలతో కప్పబడినది
రాతిసేవకులు తలుపుల దగ్గర
కన్నులు మూసుకు కావలియుండునది ॥అమ్మా నీకొక
చీకటి మయమై, వెలుగేలేక
ప్రమిదల వెలుగును ఆశ్రయించునది
పదపద పదమని అర్చక స్వాములు
నీతనయుల నెడలించునది
తీర్థముకొరకై ఉవ్విళ్ళూరగ
అదలింపులనే పంచునది
మాటాడవ నా కన్నతల్లియని
రోదన చేసెడు నీ శిశువులను
సమయము కాదని – నీ అర్చకులే
విగ్రహమిది పలుకున ?
పొమ్మని – తరుమునది – ఈ గుడి కావలెనా
మల్లెపూల వలె – సంపెంగలవలె
మెండగుభక్తిని – పరిమళించునని
గులాబి రేకులవలే – నవనీతమువలె
నీదురాకకై – వేచియుండునని
మృదువుగ – కోమలముగ నుండునని
వచ్చెదవను ఆశల – బ్రతుకు చుండునని
రమ్మని రావేలని – రాలేదేయని – రావేమోనని
తత్తరపడు గుండెల గుడులు
ఎన్నియున్నవో – తెలిసిననీకు
రాతి గుడులు కావలెనా అమ్మా
చాలున అమ్మా – ఒక గుడి నీకు ?
నీతనయుల మృదు హృదయ వేదికల
రత్నపీఠమున – సుఖముగ కొలువై
పాటలు పాడుచు – నాట్యము సేయుచు
నిను సేవించెడి బిడ్డల చూచుచు
కరుణాన్వితమౌ చల్లని చూపుల
పాలపాపలను ఆదరింపుమన
కదలని మెదలని పలుకని బొమ్మై
ఉండుటయే – నా కిష్టమ్మనుచు
రాతిగుడిని కోరెదవా అమ్మా
ఏలనె అమ్మా – ఆ బండల చెర
తనయులతో ఉండుట కష్టమ్మా??
పోట్లాడముగా – మేమేమీ
కొట్టిన తిట్టిన ఓర్చుకోగలము
పలుకకుండుటను సైపగజాలము
నీకేలనె మా అమ్మా ఆ గుడి
పిలుపులు వినబడని బండల బందీ
(1958-59 ప్రాంతాల జిల్లెళ్ళమూడిలో గుడి లేదు – పునాదులున్నాయి ఒక రాత్రి కల ఈ పాట) కొత్త ప్రచురణలు