1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మకు నూరేళ్లు

అమ్మకు నూరేళ్లు

Potturi Vijayalakshmi
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 22
Month : April
Issue Number : 2
Year : 2023

ఒక అవతారమూర్తికి, ఒక చల్లని తల్లికి నూరేళ్ల పుట్టినరోజు పండుగ. ఆ పరమాత్ముడు మానవ ప్రపంచంలో ఒక కొడుకు, ఒక భర్త, ఒక అన్న, ఒక మహారాజు ఏ విధంగా ఉండాలో తెలియజేయడానికి మర్యాద పురుషోత్త ముడుగా, శ్రీరామచంద్రుడుగా అవతారం ఎత్తి ఒక వ్యక్తిగా భూమి మీదకు వచ్చాడు.

అదే పరమాత్ముడు అందరినీ అలరించడానికి తన భక్తులతో సన్నిహితంగా మెలగటానికి శ్రీకృష్ణుడై భూమి మీద అవతారం ఎత్తాడు. పుట్టిన మూడవ నాటి నుంచి దుష్ట సంహారం చేశాడు. గోపికలతో రాసలీలలు ఆడాడు. అందరూ కృష్ణ పరమాత్మ మావాడు, స్వామికి నేనంటే చాలా దయ, ప్రేమ అని అందరూ మైమరిచిపోయేలా మత్తు జల్లాడు.

ఈ కలియుగంలో జగన్మాత అతి సాధారణమైన యువతిగా సామాన్య కుటుంబంలో జన్మించి ఇల్లాలిగా భర్తకు సేవ చేస్తూ, బిడ్డలను కనిపెంచుతూ, అతిథులను అభ్యాగతులను ఆదరిస్తూ, అతి సామాన్యంగా కొంత కాలం గడిపి అటు పిమ్మట తన ప్రేమామృత ధారలతో విశ్వ కుటుంబాన్ని స్థాపించి విశ్వజననిగా అందరినీ అక్కున చేర్చుకున్న ఆ తల్లికి వంద ఏళ్లు.

మీరందరూ నా బిడ్డలే. నేనే కాని మీ తల్లులకు పెంపకానికి ఇచ్చాను. అని ఘంటాపథంగా చెప్పిన ఆ తల్లికి వంద ఏళ్ళు. మాట వరసకు చెప్పి ఊరుకోవటం కాదు. కోట్లాదిమందిని (వయోభేదం లేకుండా పసిబిడ్డ నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు) ఒడిలో చేర్చుకుని లాలించిన ఆ చల్లని తల్లి, “మిమ్మల్ని కళ్ళారా చూసుకోవటమే నాకు తృప్తి. మీరు కడుపారా భోజనం చేస్తే నాకు పరమానందం” అని బిడ్డల ఆనందంలోనే తన ఆనందాన్ని వెతుక్కున్న శ్రీమాతకు వంద ఏళ్లు. “తృప్తే ముక్తి”, “నీకున్నది తృప్తిగా తిని ఇరులకు ఆదరంగా పెట్టుకో”, “సర్వదినాలు పర్వదినాలు”, “తిథులు విధులను మార్చలేవు”, “అనుకున్నది జరగదు తనకున్నది తప్పదు”, “కష్టాలు వస్తూ చెప్పి రావు, పోతూ చెప్పి పోవు, వస్తాయి పోతాయి”- అంటూ జీవిత సార్థకతకు సరళమైన మార్గాన్ని సూచించిన ఆ దయామూర్తికి, “వైకల్యం లేనిది కైవల్యం”, “సాధ్యమయిందే సాధన”, “ధ్యాసే ధ్యానం”, “ముందు నువ్వు మంత్రాన్ని పట్టుకుంటే తర్వాత మంత్రమే నిన్ను పట్టుకుంటుంది” అని చెప్పిన తల్లికి వంద ఏళ్లు.

అందరికీ సుగతే”.. అంటూ అందరికీ అర్థమయ్యే అలతి అలతి పదాలతో ముక్తి మార్గాన్ని బోధించిన ఆ మహా గురువుకు వంద ఏళ్లు. ప్రకృతి ప్రకోపించి నప్పుడు గోవర్ధన పర్వతాన్ని కొనగోటి మీద నిలబెట్టి అందరూ నా రక్షణకు రండి అనే బాధ్యత మొత్తం తన మీద వేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. తల్లికి తప్పు కనిపించదు, మీకు తప్పినా నాకు తప్పదు, బిడ్డ బురద పూసుకున్నా, ఏం పూసుకున్నా శుభ్రపరచ వలసిన బాధ్యత తల్లిదే, అడిగితే అడిగింది ఇస్తాను, అడగకపోతే ఏం కావాలో కనిపెట్టి ఇస్తాను. నడకరాని బిడ్డను వంగి ఎత్తుకో వలసిన బాధ్యత తల్లిది. అమ్మ వద్ద శిక్షణ తప్ప, శిక్ష ఉండదు అంటూ ఒకరు ఇద్దరు కాదు కోట్లాదిమంది బిడ్డల బాధ్యత తల్లిగా నాది అని తలకెత్తుకున్న ఆ జగన్మాతకు వంద ఏళ్లు.

తన బిడ్డలకు చిన్న వయసులో ప్రమాదకరమైన వ్యాధి వచ్చింది అని వైద్యులు నిర్ధారించిన తరువాత అదేమీ లేదు నేను చెప్తున్నానుగా అని చక్రం అడ్డువేసి వారిని కాపాడిన ఆ సర్వ వ్యాధి ప్రశమని, సర్వ మృత్యునివారిణికి వంద ఏళ్లు.

అందరికీ ఆకలి బాధను తీర్చే ప్రయత్నం అప్పుడు ఎప్పుడూ ఇంకెవరికీ ఆ ఆలోచన కూడా రాని సమయంలోనే స్థాపించి అన్నదాన సత్రం అని పేరు పెట్టకుండా బిడ్డ తల్లికి పెట్టడం దానం ఎందుకు అవుతుంది? అని అన్నపూర్ణాలయం అని పేరు పెట్టిన ఆ అన్నపూర్ణకు, సర్వ మానవ సౌభ్రాతృత్వం, వసుధైక కుటుంబం అనే సూత్రాన్ని మాటలకే పరిమితం చేయకుండా చేతలలో చూపిస్తూ అందరిల్లు అని ఆశ్రమానికి పేరు పెట్టిన ఆదర్శమూర్తికి వంద ఏళ్ళు.

నేను అవతారమూర్తిని అంటూ ఆసనం అలంకరించి ప్రవచనాలు బోధలు వంటి వాటికి ప్రాముఖ్యం ఇవ్వకుండా నడిచి వచ్చి అందరిలో కలిసిపోయి తన బిడ్డలకు అన్నప్రాశనలు, అక్షరాభ్యాసాలు, ఉపనయనాలు, వివాహాలు తన చేతులతో చేసుకుని మురిసిపోయిన చల్లని తల్లి.

లక్షమంది ఒకే బంతిన భోజనం చేస్తుండగా చూడాలి అని కోరి తనే చక్రం తిప్పి అసాధ్యమైన కోరికను సుసాధ్యం చేసుకున్న లీలా నాటక సూత్రధారి. తన వద్దకు రాలేని అసంఖ్యాకమైన భక్తుల కోసం తానే నడిచి వెళ్లి అందరిని అక్కున చేర్చుకున్న సర్వాంతర్యామి. ఆ తల్లికి వంద ఏళ్లు.

పరమాత్ముని అవతారాల గురించి చదువుకుని పరవశించిపోయిన మన వేల వేల వేల జన్మల పుణ్యఫలంవల్ల ఆ అవతారమూర్తిని కనులారా దర్శించుకోగలిగాము. మనసారా సేవించుకో గలిగాం. ఆ అనురాగామృత వర్షంలో తడిసి ముద్ద అయ్యే భాగ్యాన్ని పొందగలిగాం. అమ్మకు ఆది, అంతం లేవు. గణనకు అందకుండా విశ్వమంతా వ్యాపించి ఉన్న అమ్మకు శతజయంతి చేసుకోవడం మన ఆనందం కోసం. నేను ఏ పని చేసినా అది మీకోసమే అని చెప్పింది కదా అమ్మ. ఇదీ మన కోసమే !

ఆ తల్లి సేవలో తరిస్తూ, అమ్మ సన్నిధిలో ఉంటూ, అమ్మను సేవించు కుంటూ ఎన్నో ఎన్నో అనుభవాలను స్వంతం చేసుకున్న అప్పటి బిడ్డలు చాలామంది అమ్మలో ఐక్యం అయిపోయారు. అదృష్టవశాత్తు చాలామంది అనుభవాలకు అక్షర రూపం ఇస్తూ భావితరాల వారికి అవన్నీ తెలిసే విధంగా పుస్తక రూపంలో తీసుకువచ్చారు. కానీ ఇంకా చాలా మిగిలిపోయే ఉన్నాయి. అవన్నీ కూడా వెలుగులోకి రావాలి. భావితరాలకు అమ్మ ప్రేమతత్వం తెలియాలి అమ్మ సూచించిన మానవ సేవలోని మాధుర్యం, అందరూ కలిసిమెలిసి ఉండటంలోని ఆనందం అందరికీ ఆదర్శం కావాలి.

ఒక దీపం 100 దీపాలను వెలిగించినట్లు జిల్లెళ్ళమూడి అమ్మ భక్తులు అందరూ మరో వంద మందికి అమ్మను గురించి తెలియజేస్తే అమ్మ కోరుకున్న విశ్వకుటుంబం ఏర్పడుతుంది. అమ్మ శతజయంతి ఉత్సవాన్ని జరుపుకునే భాగ్యం మనకు కలిగింది. ఈ పర్వదినాన్ని ఒక మైలురాయిగా భావించి నూతన అధ్యాయానికి తెర తీయాలి. అమ్మ నూట పదహారవ జయంతి జరుపుకునే సమయానికి కులమత వివక్షణ పగ, ద్వేషం, హింస అన్నీ తొలగిపోయి విశ్వమంతా అమ్మ ప్రేమ తత్వాన్ని ఆధారం చేసుకుని ఈ భువి స్వర్గంగా మారాలి. మనం కోరుకుంటే అమ్మ ఎప్పుడూ మన వెంటే ఉండి నడిపిస్తుంది. ఆ దిశలో మనల్ని నడిపించమని అమ్మ చరణాల మీద తలవాల్చి ప్రార్ధిస్తూ శతజయంతి ఉత్సవాలను జరుపుకుని 101వ సంవత్సరం వైపు అడుగులు వేద్దాం.

జయహోమాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!