- ఆ మహిమోజ్జ్వలంబులగు నానన సుందర దీప్తు లెల్లెడన్
కామిత దాయకంబులయి కన్నుల ముందట వెల్గుచుండగా
ఆమెకు సాటి ఈ ధరణి యందున గానగ రాదు చూడగా
ఏమియు చెప్ప జాలమిక యెల్లలు లేనిది అమ్మ ప్రేమయే.
- అన్నము విద్యయు న్నొసగి ఆర్తిని బాపుచు నాదరించగా
ఎన్నగరాని మోదముననెల్ల జనావళి మేలు పొందగా
కన్నుల కాంతిరేఖలను గాంచుచు సంతసమొందుచుండి తా
“కన్నది నేనె” యంచనెడి కామితదాయిని అమ్మ మ్రొక్కెదన్.
- అమ్మే మమ్ముల నెంతయో తనదు దివ్యంబైన రూపంబుతో
సమ్మోహంబును కల్గజేసి మదిలో సంవాసమున్ చేయగా
సుమ్మా! యెంతటి పుణ్యమో ధరణికిన్ శోభస్కరంబై చనున్
రమ్మంచున్ ప్రియమార పిల్చి బ్రతుకున్ రాణింపగా జేయదే?
- చూచినతోడ కాంతులవి చూపులు నిండవె అమ్మ సన్నిధిన్
తోచును క్రొత్తలోకమది; దూరము నయ్యెడు భీతి యంతలో
సూచితమౌనుగా మదికి సుందర భావ ప్రపంచ మేదియో
వీచెడు మందమారుతము విశ్వ విపంచిగ మారిపోవగా.
- ఉన్నత భావవైభవము నుజ్జ్వల రూపము భాషణంబులున్,
సన్నుత రీతిగా నిలుచు సద్గుణ పుంజము సామరస్యమున్
కన్నను విన్ననున్ మదికి కల్గునుగా మన ‘అమ్మ’ సన్నిధిన్
ఎన్నగరాని శాంతి, మరి యెందును గల్గునె యట్టి తృప్తియున్ ?
- తప్పులనెంచుట న్నదియు తల్లికి ధర్మము కాదటంచు తా
నెప్పుడు బిడ్డలన్ గనిన నేరము లెంచక ప్రేమతో కడున్
మెప్పుగ పల్కరించుచును మిక్కిలిగా తగు నాదరంబుతో
ఒప్పులు నేర్పి జీవితము నుత్సవ మౌనటు తీర్చు అమ్మయే.
(సశేషం)