“దేహెూ దేవాలయః ప్రోక్తః జీవో దేవః సనాతనః”!
(దేహమే దేవాలయము, జీవుడే పరదైవమూ)
“బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః”
(ఆత్మ శాశ్వతము – జగత్తు మారేది. జీవుడు బ్రహ్మమే)
“ఆత్మ సంస్థం శివం త్యక్త్యా బహిస్థం యః సమర్చతే |
కరస్థం పిండముత్సృజ్య భ్రమతే జీవితాశయా ||”
(తనలోని శివుని విడచి బాహ్యమైన శివరూపాన్ని పూజించే వాడు – చేతిలోని అన్నాన్ని పారవేసి ఆహారం కోసం ఇల్లిల్లూ తిరిగే మూర్ఖుడు.)
జగద్భయంకరమయిన హాలాహలాన్ని అల్ల నేరేడు పండులా అవలీలగా మింగి లోకకల్యాణాన్ని చేసిన మహాశక్తియే పరమేశ్వరుడు. ఆయన అర్ధనారీశ్వరుడు. అనగా శక్తియుక్తుడు. శంకర భగవత్పాదులు ‘సౌందర్యలహరి’లో “శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం, న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి” అని ఆదిశక్తి ప్రభావాన్ని బహుధా ప్రస్తుతించాడు. శివశక్తులకు అభేదాన్ని దర్శించటమే జీవితపరమార్థం. అదే మోక్షం. శక్తి నానావిధాలుగా ఉంటుంది. నామరూపాత్మకమైన దృశ్యమాన ప్రపంచానికి, సత్యము, శివము, సుందరము అయిన ఆ ఏకత్వానికి యధార్థానికి భేదం లేదు.. “జగత్తూ – జగదీశ్వరుడూ వేరు కాదు” అంటుంది అమ్మ. అనృత జడ దుఃఖాత్మకము జగత్తు సచ్చిదానంద ఘనము శివుడు. అనేక విధాలయిన ఆభరణాలలో బంగారాన్ని గుర్తించినట్లుగా; కెరటాలు, నురుగు, బుడగల్లో నీటిని చూస్తోన్నట్లు, విశ్వమంతటను విశ్వేశ్వరుణ్ణి దర్శించటమే నిజమైన శివరాత్రి. ఆ స్థితి మనకు ఇంకా లభించక పోయినా సామాన్యులకు మహాభయంకరాలయిన వ్యాధుల రూపంలో, ఆకలి రూపంలో, కామక్రోధ రూపంలో ఉన్న హాలాహలాన్ని భక్షిస్తూ వాత్సల్యామృతాన్ని మనందరకూ పంచిపెట్టడం ద్వారా లోక కల్యాణాన్ని చేస్తున్న శివంకరి ‘అమ్మ’ దర్శనం ఈ నాడు చేయగలగడం మన అదృష్టం.
రాగద్వేషాలే నిజానికి హాలాహలం. నిర్భయంగా వాటిని భక్షించడమే అనగా అవి లేకుండా ఉండటమే శివతత్త్వము. అమ్మకు దేనిమీదా ప్రత్యేకించి మక్కువ, దేనిమీదా ద్వేషమూ ఉండవు. నక్సలైట్లు వచ్చి నానా బీభత్సం చేస్తే, దొంగలు ఇంట్లో సామానులు ఎత్తుకుపోతే, పలుగాకులు తన మీద నీలాపనిందలు వేస్తే భయంకరమైన వ్యాధులు తన శరీరాన్ని ఆక్రమిస్తే ఆమెకు ద్వేషం కలగలేదు. పై పెచ్చు నక్సలైట్లను అల్లరి పిల్లలనీ, దొంగలను వాళ్ళ అవసరం ఎట్లాంటిదో అనీ, నిందించడం కూడా ప్రచారం చేయడం, ఆరాధించడం అనీ, రోగాల్ని బిడ్డలనీ మమత కురిపిస్తుంది. ‘ఇవేవీ వద్దనిపించడం లేదు నాన్నా’ అని అమాయకంగా మాట్లాడే అమ్మ పోలీసు తనమెడలో నగను దొంగి లిస్తుంటే… “ఉండు నాన్నా! నీ చెయ్యి నొప్పిపుడుతుంది, నేను తీసి ఇస్తా”ననే అమ్మ, స్వర్ణోత్సవానికి నీకేంకావాలి అమ్మా!- అన్న సోదరులతో ‘లక్షమంది ఒక్క పంక్తిలో భోజనం చేస్తుంటే చూడాలని ఉంది’ అన్న ప్రేమవాహిని. జిల్లెళ్ళమూడి వచ్చిన వాళ్ళందరినీ ‘భోజనం చేసి వెళ్ళండి, నాన్నా” అనే అనురాగమయి, ‘తృప్తే ముక్తి’ ‘అందరికీ సుగతే’ అని అభయమిచ్చే కరుణాతరంగిణి ”మహాశివుడే’ అనిపిస్తుంది.
‘గరళకూట వినీలకంఠాయ శంభవే
మదనాంతకా యోం నమశ్శివాయ’,
శివుడు అభయస్వరూపుడు. ఆయన నివాసం శ్మశానం. పులితోలు, ఏనుగుతోలు వస్త్రాలు. కాలసర్పాలు ఆభరణాలు. భిక్షాటనం వృత్తి. పుణె కంచం. మామూలువాళ్ళకు భయాన్నీ, అసహ్యాన్నీ కల్గించే వస్తువులపై ఆయనకు ద్వేషం లేదు, దేనిమీదా రాగం లేదు. అందుకే ఆయన పరమేశ్వరుడు. ఆయనకు కాలకూట విషం నేరేడుపండు అయింది. కోరికకు ప్రతీక అయిన మన్మథుడు ఆయనముందు నామ రూపాలు లేకుండాపోయాడు.
దేవదానవుల యుద్ధం ఎప్పుడూ ఉండేదే. అంటే రాగద్వేషాల సంఘర్షణ, ఇద్దరికీ అమృతం కావాలి. హాలహలం వద్దు. శివునికి అటు అమృతం మీద అనురాగం, హాలాహలం మీద ద్వేషం రెండూ లేవు. ఆయనకు అంతా అమృతమే. సుఖదుఃఖాలూ, మానావమానాలూ, హెచ్చు తగ్గులూ, మంచి చెడ్డలూ ఇలా ద్వంద్వ భావాలలో ఒక దానిపై రాగం, మరొక దానిపై ద్వేషం సామాన్యులకుంటాయి. అమ్మది శివస్థితి. అదే ద్వంద్వాతీతస్థితి. ‘అనుభవించే దంతా సుఖమే’ అంటుంది అమ్మ. “అందరూ నిన్ను ప్రేమించేటట్లు ఆశీర్వదించనా అమ్మా” అన్న వాసుదాసుగారితో, ‘అందరూ నన్ను ప్రేమించినా, ద్వేషించినా నేను అందరినీ ప్రేమించేటట్లు ఆశీర్వదించమన్నది చిన్న వయసులోనే. ‘బాధల్లేకుండా ఉన్న బ్రతుకు వ్యర్థమనీ ‘సహన’మనే దేవత నారాధించా లంటే బాధలనే పూజా ద్రవ్యాలు కావాలనీ, శిల్పాని కందం రావాలంటే ఉలిదెబ్బ అవసరమని అనే అమ్మకు బాధలపై ద్వేషం, సుఖాలపై రాగం లేవు కదా! నవ్వుతూ అనుభవించే వాడిదగ్గరకు ఏడుస్తూ అనుభవించేవాడు సలహాకు వస్తాడని చెపుతూ బ్రతుకులో అతి సామాన్యునికి, అవ తారపురుషునికి కూడా బాధలు తప్పవనీ, కాని సామాన్యుడు ఏడుస్తాడు, మాన్యుడు ధైర్యంతో అనుభవిస్తాడు అని “దుఃఖేష్వనుద్విగ్న మనాః సుభేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ తస్యప్రజ్ఞా ప్రతిష్ఠితః” (సుఖాలకు దుఃఖాలకు అతీతంగా, రాగద్వేషాలూ భయమూ లేనివాడు స్థితప్రజ్ఞుడు) అనే గీతోపదేశాన్ని తేటగా, సూటిగా అనుభవంతో బోధిస్తున్నది అమ్మ. అందువలన ‘జగన్మాత’ అనీ సదాశివుడే అనీ ఆమెను కీర్తించడం అతిశయోక్తి కాదనిపిస్తుంది.
(1981, మే ‘మాతృశ్రీ’ సంచిక నుండి గ్రహింపబడినది.)
(18-2-23 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వ్యాసం సమర్పిస్తున్నాం సంపాదకమండలి)