“అన్నపూర్ణ, విశాలాక్షి యనెడి పేర్ల
కాశికామధ్య శృంగాటకముల యందు
విశ్వపతి దేవి మధ్యాహ్నవేళ పెట్టు
అమృతప్రాయ దివ్యాన్న మనుదినంబు”
ఇది కాశీక్షేత్రంలో నిత్యం జరిగే అన్న క్రతువు! అనుభవించగలిగిన వాడికి. కాశీ, జిల్లెళ్ళమూడి భిన్నంగా గోచరించవు. పైగా ఈ సంప్రదాయం అనూచానమన్న ఆనందం కలుగుతుంది.
జీవరాశి సమస్తం అన్నం నుండే వుడుతున్నది. అన్నం వలనే అది జీవిస్తున్నది. అన్నం పరబ్రహ్మమే! వైశ్వానరాగ్నికి అన్నం హవిస్సు! దేహం నిత్యాగ్ని గుండం! పూర్ణాహుతి వరకూ అగ్ని జ్వలించవలసిందే!
కలియుగం అన్నగతం. కలియుగంలో నాగరికతా ప్రభావంతో జీవుడు అన్నగతుడైపోయాడు. అందుకే, (జిల్లెళ్ళమూడి అమ్మ నోటి నుంచి ఎప్పుడూ వెలువడే మొదటి మాట…. “భోజనం చేసి రా!” అని.
మోక్షగామియైన సాదకుడు ముందుగా అన్నమయ కోశాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అందువల్లనే అమ్మ ముందుగా అన్నం పెట్టి, ప్రాణం నిలబెట్టి మనసును అరికట్టే ప్రయత్నం చేసింది. పైకి ఎంతో తేలికగా కనిపిస్తున్నా, ఆ వాత్సల్యం వెనుక ఒక గంభీరమైన ఆధ్యాత్మ బోధ ఉంది. కలిగిన వారంతా నలిగిన వారిని ఆదుకోవాలి. ఆకలిగొన్న మానవుడూ అన్నం దొరకక మరణించే జీవులు ఉంటే అది నాగరిక సమాజం కాదు. సంస్కారానికి నోచుకోని జాతి ఎక్కువ కాలం మనలేదు.
ఆహారం మనిషికి ప్రాణశక్తి ద్వారా పంపిణీ అవుతుంది. ప్రాణశక్తే సర్వశక్తుల నిలయం. ఏ శక్తినీ దుర్వినియోగం చేయరాదు. అంటే మనిషి తన శరీరాన్ని శక్తి క్షేత్రంగానే అనుభవించాలి. దేహం, ప్రాణం, మనసు ఒక అద్భుతమైన త్రిపుటి. మాధవ సమానుడైన మానవుడు నిరంతరం అప్రమత్తమై ఉండవలసిన స్థితులు. ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తులకూ మూలం ఇవే. సర్వజన శ్రేయస్సు శుభేచ్ఛగా, సమాజహితమైన నిష్కామకర్మలన్నీ క్రియాశక్తిగా, వివేకము – విచక్షణ జ్ఞానశక్తిగా అనుభవంలోకి రావాలంటే ‘అన్నం’ మూలం. దేహమున్న, ప్రాణమున్న ప్రతి జీవీ, అన్నగతమే. అందుకే అమ్మ మాట్లాడినా, సూచించినా ముందు చెప్పేది అన్నం తినమనే!
అమ్మ అందరికీ సహపంక్తిని సిద్ధం చేసింది. ఆకలికి కులం, మతం భేదం లేవు. అరమరికలు లేని బంధనాలు లేని వివక్షలేని వాత్సల్యాలయం ఒక అపురూప విజ్ఞానమయ కోశంగా మారడానికి వెనుక కారణమిదే. శాస్త్రాల మీద అధికారం, విషయాల మీద పట్టు, విశ్లేషణల మీద పూర్ణావగాహన, అనుష్ఠాన వేదాంతం విజ్ఞానమయ కోశంలో ఇమిడిన బలాలు. ఆ కారణంగానే విజ్ఞానవేత్తలు, మహాకవులు, పండితులు, పావన ముక్తజీవులు, వేదాంత తత్త్వబోధకులు, సంకీర్తనాచార్యులు… ఒకరేమిటి పాశ్చాత్యులతో సహా జిల్లెళ్లమూడికి ఆనాడే చేరారు. విజ్ఞానమయ భూమికగా మారారు! ఇన్ని కలిగిన తర్వాత ఉన్నదంతా ఆనందమయమే. పంచకోశ స్థితులను ఉపనిషత్తులు వీక్షిస్తే, వర్ణ, వర్గం భేదం లేకుండా అమ్మ వాటిని అతి సులువుగా ఆవిష్కరించింది. “అమ్మా! నీ 50వ పుట్టిరోజు, ఏం చెయ్యమంటావ్?” అని అడిగినప్పుడు, “చేయడానికి ఏముంటుంది? ఒక లక్ష మంది కలిసి భోజనం చేయడం చూడాలని ఉంది!” అన్నది. పట్టుమని పది ఇళ్లు లేని జిల్లెళ్ళమూడిలో, పందిరిళ్లలో అంతమంది భోజనం చేయడం మహిమా? అనుగ్రహమా? అమ్మ ప్రేమా?
“నేను పెట్టేదేముంది? ఎవరన్నం వాళ్లు తిన్నారు” అనే అమ్మది అకర్తృత్వ స్థితి. బువ్వ పెట్టిన అవ్వలందరూ అమ్మలు కారు. ఆ పెట్టడం ఒక సహజ మాతృలక్షణం కావాలి. ఈ పవిత్రమైన కారణ నేపథ్యంలో 1958 ఆగష్టు 15న అమ్మ ప్రారంభించిన ‘అన్నపూర్ణాలయం’ నూత్నరూపాన్ని సంతరించుకొని, ఆధునికమై, సాధక పీఠమై, సర్వజనులకు తృప్తినీ, ఆనందాన్నీ, పారమార్ధికతనూ, వితరణ చేస్తోంది. అమ్మ నామమూ, అమ్మచేతి ‘సాదము’, అమ్మ అనుగ్రహించే ‘జ్ఞానప్రసాదము’ అమృతానుభవమై నిలుస్తోంది. ‘అన్నపూర్ణాలయం’ అన్నాలయంగా అమ్మహృదయ స్పందనకు లయాత్మకమైన ఆదరగీతంగా పల్లవిస్తూనే ఉంటోంది 60 వసంతాలుగా!
(జిల్లెళ్ళమూడిలో ‘అన్నపూర్ణాలయం’ ప్రారంభమై 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా