అమ్మను గురించి మాట్లాడటం, వ్రాయటం దుస్సాహసం. ఆ ప్రక్రియ ఏనుగు – నలుగురు అంధులు కథే నిస్సందేహంగా.
అమ్మను అంచనావేయడం ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించటం వంటిది. కాగా ‘మాతృశ్రీ’, ‘విశ్వజనని’, ‘Mother of Alll పత్రికల్లో వ్యాసాల ద్వారా, స్వీయగ్రంథాల ద్వారా, సదస్సుల్లో ప్రసంగాల ద్వారా ఎందరో శాయశక్తులా త్రికరణ శుద్ధిగా అమ్మ తత్వాన్ని వ్యక్తీకరించటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నమంతా అమ్మ తత్వాన్ని పలుచన చేయడం, దుర్నిరీక్ష్యమైన అమ్మని తగ్గించి చూపడం’ – అని అంటారు సో॥ చి॥ రాచర్ల బంగారు బాబు.
ఇదే అంశాన్ని వివరిస్తూ మాన్య సో॥ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్, “నిగమ నిగమాంత వర్ణిత సత్యాల్ని అలతి అలతి పదాలతో అనుభవ పూర్వకంగా అమ్మ సూత్రీకరించింది. Complicated సంగతుల్ని Simple చేసి చెప్పింది. వాటికి వ్యాఖ్యానాన్ని అందించబోయి Simple గా ఉన్న సంగతుల్ని తిరిగి Complicate చేస్తున్నాం” అన్నారు. ఈ మాటలన్నీ అక్షరాలా నిజం. సోదాహరణగా వివరిస్తాను. కామినీకాంచనము (కోరికలు) లను విడిచిపెట్టమని శ్రీరామకృష్ణ పరమహంస బోధించారు. శంకరాచార్యులు :
‘వేదోనిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠియతామ్
తేనేశస్యవిధీయతామపచితి: కామ్యేమతిస్యజ్యతామ్
పాపౌఘ: పరిధూయతాం భవసుఖేదోషోల ను సంధీయతామ్
ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహత్తూర్ణం వినిర్గమ్యతామ్ ॥
నిత్యం వేదాధ్యయనం చేయండి, వేద విహిత కర్మల నాచరించండి; వేదప్రోక్త విధంగా పరమేశ్వరుని పూజించండి; కామ్యకర్మాను రక్తిని విసర్జించండి; పాపాల్నుంచి విముక్తులుకండి; ఇహలోక సౌఖ్యాలు బంధహేతువులని స్మరించండి: ఆత్మజ్ఞాన ప్రాప్తియందు అనురక్తులు కండి, స్వగృహము (జననమరణ కారక బంధనముల) నుండి శీఘ్రముగా బయటకు రండి’ – అని బోధించారు.
“సాధ్యమైనదే సాధన” అంటూ సార్వత్రిక సార్వకాలీన ప్రబోధం చేసింది. అమ్మ. అంటే అమ్మ సాధన లేదన్నదని కాని, సాధన చేయవద్దన్నదని కాని అర్థం కాదు.
అమ్మ శాస్త్రాన్ని గౌరవిస్తుంది; కారణం శాస్త్రాలన్నీ అనుభవసారాలు. ఎవరి అనుభవం వారికి సత్యం. ఎవరికి అందినంత వరకు వారు ప్రవచించారు. కనుకనే అమ్మ ఏమతాన్ని ఎవరి అభిమతాన్ని నిరసించదు, ఖండించదు. అమ్మకు లోకమే పాఠశాల, జీవితమే పెద్ద పుస్తకం, ప్రతి అనుభవం ఒక పాఠమే. అమ్మ నడయాడిన పధంలో ఎన్నో సాధనలూ, సందేశాలూ, సమాధానాలూ ఉన్నాయి. అందులో ఏ ఒక్కదానినైనా ఆచరణలో పెట్టుకోగలిగితే ధన్యులమే, భాగ్యవంతులమే. కానీ అమ్మ మాటల్ని అర్థం చేసికోవటానికి ఒక జీవితకాలం, ఆచరణలో పెట్టడానికి వంద జీవితకాలాలు సరిపోవు. కావున “సాధ్యమైనదే సాధన” అనే అమ్మ వాక్యం సర్వదా శిరోధార్యం. ఎవరికి ఏది ఆచరణ సాధ్యమో అది వారికి సాధన. కొందరికి వేదవిహిత కర్మానుష్ఠానం; కొందరికి పంచాయతనం శ్రీచక్రార్చన; ‘అందరికీ స్వధర్మాచరణే అనుసరణీయం’ అని అమ్మ వివరించింది.
అమ్మతత్వాన్ని వేరొకరి సిద్ధాంతం – ఆచరణతో పోల్చటం అభిలషణీయం కాదు. డా॥ శ్రీపాద గోపాల కృష్ణమూర్తిగారు (ఆధ్యాత్మిక గగనతలంలో) ఎక్కడైనా చంద్రవంకలే (Crescent Moon) కనిపిస్తాయి. జిల్లెళ్ళమూడిలో మాత్రమే పూర్ణచంద్రుడు దర్శనం ఇస్తాడు” అన్నారు. అలా మనకి తెలియకుండా వేరొకరిని తక్కువ చేయడం అవుతుంది. అందుకు అమ్మ సహించదు. నదులన్నీ సాగర గర్భంలో కలిసినట్లుగా అన్ని మార్గాలూ అమ్మలో లీనమౌతాయి. ప్రళయ జాజ్వల్య జ్వాలా కెదురీదిన అమ్మ పవిత్ర చరిత్రని ఈ సందర్భంగా కొంత వరకు మననం చేసుకుందాం.
అమ్మ జడచైతన్య భేదరహితంగా ప్రాణాధికంగా అందరినీ అన్నిటినీ ప్రేమించింది. ఆర్తులకు అన్నం, గుడ్డలు, సొమ్ము అయాచితంగా ఇచ్చి ఆదుకుంది. తెరచాప, చుక్కాని లేని జీవితాల్లో జీవనధారనీ వర్షించి వృద్ధిలోకి తెచ్చింది. పాతివ్రత్య మార్గంలో పయనించి ఆదర్శంగా నిలిచింది; ఆధ్యాత్మిక మహోన్నత శిఖరాలనధిష్ఠించింది.
పరస్పర విరుద్ధములైన మార్గాలను ఆదరించి సమన్వయం చేసింది: అంధవిశ్వాసాల్ని మూఢనమ్మకాల్ని ఖండించింది. “ఇది ఏమిటి? అసలు ఇది ఏమిటి?” అని ప్రశ్నించుకుంటూ “ఇదంతా నేనే” అని స్వస్వరూపానుసంధానం చేసిన నిజమైన తత్త్వవేత్త, శాస్త్రవేత్త (Philosopher, Scientist) గా నిల్చింది.
తన భర్తే తనకు దైవం; తన బిడ్డలూ తనకు ఆరాధ్యమూర్తులేనంటూ మూర్తీభవించిన సేవా భావంగా అందరికీ తన సేవలనందించింది.
నమ్మిన వారికీ, నమ్మని వారికీ; తన వద్దకు వచ్చిన వారికీ రానివారికీ… అందరికీ సుగతేనని ఒక పరమసత్యాన్ని విస్పష్టంగా ఆవిష్కరించింది.
సర్వం భగవత్స్వరూపమే; “సృష్టేదైవం” అని సంపూర్ణత్వాన్ని దర్శింప చేసింది. కనిపించేదంతా నిజస్వరూపమే, సృష్టికి నాశనం లేదు – పరిణామశీలం కలది; “కనిపించేదంతా అదే (దైవం) అయినప్పుడు కన్నులు మూసుకోవడం ఎందుకు?’ అని నిలదీసింది.
యావత్ప్రపంచానికి ఒక ఆదర్శ సమాజనమూనా (a model society)గా అపూర్వమైన రీతిలో జిల్లెళ్ళమూడిని తీర్చి దిద్దింది. విశ్వమానవ సౌభ్రాతృత్వ భావన, ఏకోదర రక్త సంబంధ బాంధవ్య మధురిమ, దివ్యమాతృ వాత్సల్యవైభవాల్ని అనన్యసామాన్యంగా నెలకొల్పింది; ప్రతిష్ఠించింది. అందరికీ స్వతంత్రమైన ఇల్లు (అందరిల్లు), భోజనశాల (అన్నపూర్ణాలయం); దేవాలయం (శ్రీఅనసూయేశ్వరాలయం, శ్రీహైమాలయం) లను అశేష సంతానానికి అంకితం చేసింది.
వేదమాతగా, రాజరాజేశ్వరిగా, ఛిన్నమస్తకగా, ఆపదుద్ధారిణిగా, సనాతన ధర్మ స్వరూపిణిగా, నాస్తికురాలుగా, మహాప్రవక్తగా, యదార్థవాదిగా, సంఘసంస్కర్తగా, విప్లవాత్మక ప్రవచన కర్తిగా, స్త్రీ జన పక్షపాతిగా, శాస్త్రవేత్తగా, సహనదేవతగా, సత్యాన్వేషిణిగా, సర్వమంగళగా, యోగీశ్వరేశ్వరిగా, సంకల్పసిద్ధగా, త్యాగమూర్తిగా… ఎందరికో ఎన్నోరీతుల అర్ధం అవుతున్న మన అమ్మ ఎవరు? ఏమిటి అమ్మతత్త్వం? దివ్యమాతృప్రేమ ఆప్తవాక్య స్వరూపం; తరింపచేసే తల్లి. ఇంకా… ఏమో!!