అమ్మ యొక్క అసాధారణ శక్తి
అమ్మ ధ్యానంలో కూర్చున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు ఆమెను గమనిస్తే అమ్మా లేక గుళ్ళోని కదలని విగ్రహమా అన్నట్లు ఆశ్చర్యం కలిగేది! అంతటి నిశ్చలత! ఒక వేలు కదలటం గాని ఒక కదలిక గాని మనకి కనిపించదు. అక్కడ ఉన్న వందల వేల మంది ఈ విషయాన్ని గమనిస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు. అమ్మ ధ్యాన మగ్నతకు ఇది నిదర్శనం.
శేషయ్య గారు జిల్లెళ్ళమూడిలో వంటలు చేసేవారు. అమ్మ ఒకనాడు అక్కడ గుమిగూడిన భక్తులతో మాట్లాడుతూ, ఉన్నట్టుండి పొయ్యిమీద తెర్లుతున్న పులుసులో చెయ్యి పెట్టి కొంచెం పదార్థం తీసి రుచి చూసి “నాన్నా! నీ వంట చాలా బాగా ఉందిరా!” అని ప్రశంసించారు. అక్కడ చూస్తూ ఉన్న జనం ఈ సన్నివేశం చూసి దిగ్భ్రాంతి చెందారు. అంతటి వేడి అమ్మ అమృత హస్తాన్ని బాధించలేదు!
అప్పటికీ ఇప్పటికీ అమ్మ తనకు తానే సాటి. “జయ మాతా! శ్రీ అనసూయా! రాజ రాజేశ్వరి! శ్రీ పరాత్పరి!!” అనే అమ్మ నామసంకీర్తన విజయ ఘోష భక్త సముద్రాన్ని తరింప చేస్తూనే ఉన్నది.