బాపట్ల మా పుట్టిల్లు. జిల్లెళ్ళమూడి వెళ్ళాలంటే ఏడొవ మైలు రాయి దగ్గిర దిగి, పొలాల్లోనుంచి నడిచి ఆశ్రమానికి చేరేవాళ్ళం. అమ్మ ప్రాభవం పెరిగిన తర్వాత నేరుగా జిల్లెళ్ళమూడికి బాపట్ల నుంచి బస్సులు వేశారు. బాపట్లలో శ్రీ పులిపాక సీతారామశర్మ గారు నాకు పెద్ద అన్నయ్య. “అమ్మ” అంటే మా అన్నయ్యకి అమితమైన భక్తి, విశ్వాసాలు. ఆయన వృత్తి రీత్యా న్యాయవాది అవ్వటం వలన, అమ్మ చాలా సార్లు “శర్మ! నువ్వు రావాలి” అని పిలిపించి ఆశ్రమ నిర్వహణకు సంబంధించిన సలహాల కోసం సంప్రదించేవారు. నేను కూడా ఆయనతో అప్పుడప్పుడు తరచూ జిల్లెళ్ళమూడి వెళుతూ వస్తూ ఉండేదాన్ని.
నాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయికి ఎనిమిదవ నెలలో బాపట్ల మా అమ్మగారింటికి వచ్చినప్పుడు అక్కడ మా అన్నయ్య గారి పిల్లలకు, నాకు కూడా అమ్మవారు (ఆటలమ్మ) పోసింది. అప్పుడు ఒకరోజు నాకు బాగా అస్వస్థత చేయటంవలన ఇంట్లో అందరూ కంగారు పడ్డారు.
అవి పాత రోజులు – 1971 ఫిబ్రవరిలో మాట. వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉన్న రోజులవి. పనివాళ్ళు, మా అన్నయ్యగారికోసం వృత్తి పనుల రీత్యా వచ్చిన వారు, గుమాస్తాలు, మా ఇంటి చాకలి, ఇంకా ఎందరో విషయం తెలిసి వెంటనే వచ్చారు. అందరూ పసుపునీళ్ళు చల్లమనీ, ఏవో తోచిన చిట్కాలు చెయ్యమనీ తమకు తోచిన సలహాలు ఇచ్చారు. మా పెద్దన్నయ్య కోర్టు పనిమీద పొన్నూరు వెళ్లడం వలన, మా వదినగారు అగమేఘాలమీద ఇంటి డాక్టరు శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారి వద్దకు పరుగుల మీద వెళ్ళి ఆమెను ఇంటికి తీసుకు వచ్చింది. ఆరోజుల్లో దీనికి వైద్యం లేదని ఆ డాక్టరుగారు చెప్పినా సరే బ్రతిమాలి ఆమెను మా వదినగారు మాఇంటికి తీసుకువచ్చింది.
ఆ డాక్టరుగారు మా బాపట్లలోని ఇంటి సింహద్వారం లోపలికి అడుగు వేస్తుంటే – పక్క మీద పడుకుని ఉన్న నాకు ఆమె డాక్టరుగా కాక శంఖం చక్రం చేత్తో పట్టుకుని కిరీటధారిణిగా జిల్లెళ్ళమూడి అమ్మగా మా ఇంట్లోకి వస్తున్నట్లుగా ఒక్క క్షణం సేపు – అమ్మ ఇంట్లోకి అడుగుపెడుతున్న అనుభూతి కలిగింది. ఆమె నా పక్క దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ డాక్టరుగానే కనిపించింది. ఆమె పర్యవేక్షించి వేరు వైద్యమేమీ లేదని, గ్లూకోజ్ నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కొంతసేపటి తర్వాత వెళ్ళిపోయింది. కాళ్ళు చేతులు కూడా కదపలేని స్థితిలో ఉ న్నాను. గొంతు కూడా మింగడానికి శ్రమ అనిపించేది. అమ్మ రాకతో, అమ్మ దయతో క్రమేపీ ఆరోగ్యం కుదుటపడింది. ఆయుష్షు పెరిగింది. ఇలా చెప్తూ ఉంటే అమ్మ అపురూప శక్తులు మనకు ఎన్నో స్ఫురిస్తూనే ఉంటాయి.
రెండవ అనుభవం
అమ్మను చూద్దామని 1975 లో మరోసారి వెళ్ళినప్పుడు మా అబ్బాయికి అయిదు ఏళ్ళు. మా అన్నయ్యగారి అమ్మాయికి తొమ్మిది ఏళ్ళ వయసు. వాళ్ళని తీసుకుని జిల్లెళ్ళమూడి వెళ్ళాను. అప్పట్లో బాపట్ల నుండి జిల్లెళ్ళమూడికి జీపులు ఒకటి రెండు తిరుగుతూ భక్తులను ఆశ్రమానికి చేరవేస్తూ ఉండేవి. అలా మేము జిల్లెళ్ళమూడి జీపులో చేరాము. అమ్మ దర్శనం అవ్వగానే సాయంత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం గురించి అమ్మకు చెప్పాను. “ఈ రోజు కృష్ణాష్టమి. కార్యక్రమాలు ఉంటాయి కదా, చూసి వెళ్లురుగాని!” అన్నది అమ్మ. “కాదు. చీకటి పడేలోగా ఇంటికి చేరాలి. పిల్లలు కూడా ఉన్నారు కదా” అని బయలుదేరాను. ఇంతలో జీపు చెడిపోయింది అని సమాచారం. చాలామంది నడిచి ఏడవ మైలు వద్దకు బస్సు కోసం వెళ్ళారు. నేను కూడా నడిచి చేరాను. కానీ బాపట్ల బస్సు ఒక్కటి కూడా రాలేదు. పొద్దుపోయింది. ప్రక్కనే ఒక వైపు పెద్ద పంట కాలువ. కరెంటు లేదు. అంతా చీకటిమయం. నాకు చాలా భయం వేసింది. ఇంతలో ఒక రైతు, వరి పైరు ఎత్తుకొన్న ఇంకో మనిషి అటుగా నడిచి వెళుతూ కనిపించారు. నేను వారిని ఆశ్రమం దగ్గిరకు వెనక్కి చేర్చమని అడిగాను. మొదట కుదరదు అని, మళ్ళీ ఎందుకో ఆ రైతు తనతో ఉన్న మనిషిని చూసి “పిల్లలు, ఆడమనిషి కదా! తీసుకొని వెళ్ళి ఆశ్రమంలో దించి వెనక్కు రమ్మ”ని చెప్పి – ఆ రైతు వెళ్లిపోయాడు. అతను అలాగే చేశాడు. ఆ నడకలో చీకటిలో నా కాలికి గాయం అయ్యింది. ఎలాగో ఆశ్రమానికి చేరాము.
అమ్మ దగ్గిరకి మేము చేరేటప్పటికి, అమ్మ చేతిలో వేణువుతో, కిరీటంతో, పట్టుబట్టలతో శ్రీకృష్ణావతారంలో ఉయ్యాల ఊగుతూ దర్శనమిచ్చింది. కార్యక్రమం ముగిసేటప్పటికి ఆ రాత్రి 11:30 అయ్యింది. ఇంతలోకి అక్కడ జీపు బాగయ్యిందని వార్త అందింది. దానిలో బాపట్ల ఆ రాత్రి 12 గం. దాటాక చేరాము. అక్కడ బాపట్లలో కరెంటు పోయి ఉండటంతో మా రాక కోసం మా అమ్మ, అన్నయ్య, లాంతరు పట్టుకున్న జీతగాడు అటూ ఇటూ పచార్లు చేస్తూ కంగారుగా కనిపించారు. ఆ కాలంలో ఇంకా పెద్దగా ఫోను సౌకర్యంలేదు. రోజు అమ్మ దయతో క్షేమంగా ఇంటికి చేరగలిగాము. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
మూడవ అనుభవం
1977 లో మా అమ్మాయి పుట్టింది. తనకు తరచూ విరేచనాలూ, జ్వరం వస్తూ ఉండేవి. అందువల్ల మాకు ఆ పిల్ల ఆరోగ్యాన్ని గురించి ఎప్పుడూ భయంగా ఉండేది. ఏ డబ్బా పాలూ సరిపడేవి కావు. చివరికి గేదెపాలు నీళ్ళు కలిపి పలచగా పట్టేవాళ్ళం. అన్నప్రాశన అమ్మ చేతితో చేయిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని మా అన్నయ్యతో అన్నాను. ఆయన సంతోషంతో ఏర్పాట్లు చేశాడు. అమ్మ చేత అన్నప్రాశన చేయించటంతోటే మా అమ్మాయి ఆరోగ్యం మెరుగయ్యింది. ఇలా ఆరోగ్య ప్రదాతగా అమ్మ ఆశీస్సులు అందాయి!
నాల్గవ అనుభవం
అలాగే అమ్మ జ్ఞాపక శక్తి అమోఘం. ఒకసారి నేను, మా అమ్మ, మా అక్కయ్య, జిల్లెళ్ళమూడి అమ్మని దర్శించటానికి ఆ ఊరు వెళ్ళాము. అమ్మ మా అక్కయ్యని చూడగానే మా అమ్మతోటి “నేను బాపట్ల మీ ఇంటికి వచ్చినప్పుడు ….ఫలానా సంవత్సరం, ఫలానా తేదీనాడు… ఉయ్యాలలో మీ అమ్మాయి ఎర్రగౌను వేసుకొని ఉన్నది” అన్నది. అంత నిర్దుష్టంగా అమ్మ సంవత్సరం మరియు తేదీతో సహా చెప్పటం అమ్మ యొక్క నిశితమైన ధారణాశక్తికి తార్కాణం!!
(సశేషం)