అమ్మ చాలాసార్లు కలలో కనబడుతూ ఉంటుంది. ఏఅష్టోత్తరం గానీ, సహస్రం గానీ పారాయణ చెయ్యాలంటే ప్రతినామంతో అమ్మ నామం చేస్తాను. లేకపోతే నాకు పూజ సాగదు.
అమ్మ ఉన్నప్పుడు నేను జిల్లెళ్ళమూడిలో ఉన్నాను. 10వతరగతి సెలవల్లో అమ్మ బట్టలు ఉతికేదాన్ని. అమ్మ కృష్ణవేణి అక్కయ్యని పిలపించి దానికి బట్టలెట్లా ఉతకాలో నేర్పించు అని చెప్పింది. నేనూ నెల్లూరి నుంచి వచ్చిన స్వర్ణ అనే అమ్మాయి అమ్మ బట్టలు ఉతికేవాళ్ళం. అప్పుడు అమ్మ నన్ను జిల్లెళ్ళమూడిలో ఉంచేసింది. జేమ్స్ అమ్మ దగ్గర నామానికి తీసుకుని వెళ్ళేవాడు. జేమ్స్ హార్మోనియం వాయిస్తూ ఉంటే మేం పిల్లలం హాయిగా నామం చేసేవాళ్ళం. హారీ కెమిన్స్మీకి అమ్మ భీమ్ అని పేరు పెట్టింది. భీమ్ లావుగా తెల్లగా ఉండేవాడు. వాళ్ళ చెల్లెలు అచ్చు నాలాగా ఉండేదట. ఒకసారి ఫోటో చూపించాడు. ఆ అమ్మాయి అచ్చు నాలాగే ఉంది. మేమంతా భీమ్తో ఆడుకునేవాళ్ళం. వేసవికాలంలో భీమ్ దగ్గరకెళ్ళి “అన్నయ్యా! కొబ్బరి బోండాలు కొట్టియ్యవా”! అని అడిగితే కొబ్బరి బోండాలు దింపి ఉట్టి చేతులతో కొట్టి ఇచ్చేవాడు. జేమ్స్ నన్ను “భగవతి అక్కయ్యా”! అని పిలిచేవాడు. నేను చిన్నపిల్లని. మేమంతా నవ్వుకునేవాళ్ళం.
వసుంధరక్కయ్య నన్ను “అమ్మదగ్గర కూర్చో” అనేది. నాకు భయం. అమ్మ గురక పెట్టి నిద్రపోయేది. నాకూ నిద్రవచ్చేది. అమ్మ ఎంతో ప్రేమగా చూసేది. తినటానికి రోజూ ఏదో ఒకటి పెడుతూ ఉండేది. నేను 10వ తరగతి పరీక్షలు వ్రాసి అమ్మ దగ్గర ఉన్నాను. మా నాన్నగారికి నన్ను కాలేజిలో చేర్పించటం ఇష్టం లేదు. అమ్మని అడిగారట! “అది తప్పేలా చేయ”మని. నాకు తెలీదు. అమ్మ గది బయట కూర్చుని ఉండగా గుంటూరు నుంచీ ఫోను వచ్చింది. అమ్మ గబగబా గదిలో నుంచి పరిగెడుతున్నట్టుగా వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుంది. నాకేమీ అర్థం కాలేదు. అమ్మ మాటలు వినబడుతున్నాయి. “ఇంగ్లీషులో రెండు మార్కుల్లో పోతుంది. మళ్ళీ రాస్తే పాసౌతుంది” అని. ఎవరో ఫోన్ ఎత్తారు. “భగవతి రిజల్ట్స్ వచ్చాయి. పరీక్ష పోయింది” అని తరువాత చూస్తే తెలిసింది. ఇంగ్లీషులో 2 మార్కుల్లో పరీక్షపోయిందని. అమ్మ అన్నట్లుగానే మళ్ళీ రాస్తే 70 శాతం వచ్చింది. నేను కొన్ని ఆశ్రమాలకి వెళ్ళాను. శ్రీశైలం, బెంగుళూరు ఎక్కడికెళ్లినా అమ్మ దగ్గర ఉన్న అన్న, అక్క చెల్లెలి అనుబంధం నాకు కనిపించలేదు. ఈ విశ్వకుటుంబం ఎంతో గొప్పది.
1981లో అమ్మ నా వివాహం చేసింది. ఆయన కోపిష్టి అమ్మ నాకు ముందే చెప్పింది. “వాడి కెప్పుడైనా కోపం వస్తే నువ్వేమీ మాట్లాడకు. రెండు నిమిషాల్లో వాడి కోపం దానంతటదే పోతుంది’ అని అమ్మ చెప్పినట్టే ఆయనకి ఎప్పుడు కోపం వచ్చినా తాటాకు మంటలా క్షణాల్లో పోయేది. మళ్ళీ బాధపడేవాళ్ళు. అమ్మ నాకు అమ్మవారు, నా ఇష్టదైవం, నాకు ఆదిపరాశక్తి.
నేను జిల్లెళ్ళమూడిలో 10 నెలలు వివాహం తరువాత ఉన్నాను. రోజూ 11సార్లు ఖడ్గమాల చదివేదాన్ని అమ్మ మెచ్చుకునేది. అది 11 సార్లు ఖడ్గమాల చదువుతుంది అని. ఒకసారి నన్ను పిలిచి చెప్పింది. “నీ పూజల వేడి అంతా ఎక్కడికి పోతుంది. వంటింట్లోకి వెళ్ళి హనుమబాబుని అడిగి అన్నం తెచ్చుకో ! పెరుగు కలిపి నివేదన పెట్టి ఆ అన్నం తిను” అని నే నట్లాగే చేసేదాన్ని. నన్నూ మా ఆయన్నీ హైమాలయం వంటశాలలో తినమంది. మేం చాలాసార్లు అక్కడ భోజనం చేసేవాళ్ళం. ఫారినర్స్ని చాలామందిని మా పోర్షన్ కి పంపించేది. వాళ్ళ ఇంట్లో చల్లగా ఉంటుంది అని. మేం వాళ్ళందరికీ చిక్కటి పెరుగు వేసి పెట్టేవాళ్ళం. వాళ్ళు ఇష్టంగా తినేవాళ్ళు..
1982లో హైదరాబాద్ బదిలీ కావడంతో హైదరాబాద్క మారాం. కొన్నాళ్ళు ఆయనొక్కళ్ళే జిల్లెళ్ళమూడి వెళ్ళేవారు. తరువాత అమ్మ చెప్పింది. “దాన్ని కూడా తీసుకుని రా!” అని. అప్పట్నుంచి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులు ఎంతో అపురూపం !
కొమరవోలు సరోజిని అక్కయ్య (వాళ్ళ పిల్లలు) కుసుమ అక్కయ్య, పాప, భీమ్, టెర్రి, జేమ్స్, నేనూ అందరం కలిసి మధ్యాహ్నంపూట అమ్మ నామం చేసేవాళ్ళం.
ఆ రోజుల్లో జిలెళ్ళమూడిలో ఒకటే ధ్యాస, అమ్మ పని, అమ్మ నామం. జిల్లెళ్ళమూడి పాతరోజుల్ని చూస్తామా! ఎప్పటికైనా?