1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మతో మా అనుబంధాలు

అమ్మతో మా అనుబంధాలు

P Narasimha Murthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : March
Issue Number : 8
Year : 2013

1969లో అనుకుంటాను. నాకు కాకినాడ నుండి గుంటూరుజిల్లాలోని మాచెర్లకి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది. పొలిటికల్ సైన్సు లెక్చరర్గా గవర్నమెంటు కాలేజీలో జాయిన్ అయినాను. నా కోలీగ్ యింగ్లీషు లెక్చరర్ బంధువు శాయమ్మగారు జిల్లెళ్ళమూడిలో అమ్మ ఆవరణలో ఉండేవారు. ఆయనతో నేను జిల్లెళ్ళమూడి వెళ్ళడం జరిగింది. అమ్మను మొదటిసారి చూచినప్పుడు ఒక విధమైన భయం, ఆందోళన, ఆనందం కలిగింది. అమ్మచూపు మనల్ని తీక్షణంగా పరీక్ష చేస్తున్నట్లు పరిశోధన చేస్తున్నట్లు అంతలోనే శూన్యంలోకి చూస్తున్నట్లు, మళ్ళీ మనని ఆప్యాయతతో ధైర్యం చెపుతున్నట్లు కనబడింది.ఆ  కళ్ళలోని భావాన్ని అర్థం చేసుకోవడం నాకు అందని విషయం. “ఏదో అడగదలచు కున్నావు అడుగునాన్నా! అని అమ్మ అంది” పక్కనే డైరీ వ్రాసే గరుడాద్రి సుబ్రహ్మణ్యం గారు వ్రాసుకుంటున్నారు. అమ్మా! నేను బాలమంత్రం, పంచముఖీకవచం వంటి జపాలు చేసుకుంటున్నాను. ఆచారంగా చేయకపోతే చెడుచేస్తాయేమోనని భయంగా ఉంది అన్నాను. అప్పుడు అమ్మ ! నీవు యిష్టం వచ్చినవి యిష్టమొచ్చినట్లు చేసుకో, చెడు చేయవు అని ధైర్యం చెప్పి భోజనం చేసి వెళ్ళమన్నారు.

హైమ ఆలయానికి వెళ్ళి తరువాత భోజనం చేసి బాపట్ల బయలుదేరినాము. ఏడవ మైలురాయి దాకా నడిచి వెళ్ళుతూ దారిలో మాటల సందర్భంలో “అంతా బాగానే ఉంది కాని, కూతురికి గుడి కట్టించడం ఎలాగో ఉంది అనుకున్నాము. మాముందు కానీ వెనుక కానీ ఎవరులేరు. కానివి పంచెకట్టుకున్న ఆయన, ఒకరైతు, తిరువణ్ణామలైలో రమణమహర్షి తల్లికి గుడి కట్టించినారు అది పిల్లలకి తల్లి మీద ఉన్న ప్రేమకి చిహ్నం, ఇక్కడ అమ్మ హైమకి కట్టించిన గుడి తల్లికి పిల్లలమీద ఉన్న ప్రేమకు చిహ్నం అనుకుంటేపోలేదా! అని అన్నారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ! లేరు. అక్కడే మేము అమ్మా! క్షమించు తల్లీ! అని నమస్కారము చేసినాము.

తరువాత నేను ఒక్కడిని, మా శ్రీమతి జానకీ సుబ్బలక్ష్మితో కలిసి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఏమైనా బాధ కలిగినా, సంతోషం వచ్చినా, అమ్మ దగ్గరకి రావడం జరిగేది.

మాచెర్ల వచ్చిన కొత్తలో నాకు డయాబిటీస్ వచ్చింది. నాకు తెలిసిన డయాబిటీస్ వ్యక్తులకు ఒకాయనకు కాలు తీసివేయడం రెండవది ఆయన చిన్న దెబ్బ తగిలి తరువాత చనిపోవడం జరిగింది. నేను ఏడుస్తూ నేను చనిపోతే పిల్లలు గతి ఏమిటి? మా నాన్నగారు నాకు 5వ ఏట చనిపోతే ఆస్తి ఉండి నానాబాధలు పడ్డాము. ఆగతి నా పిల్లలకి పట్టకూడదు అని అమ్మని నిద్రలో ప్రార్థిస్తే కలలో అమ్మ నీకు అటువంటివి జరగవు బాధపడకు అంటే హైమ పక్కన ఉండి “నీవు ఎప్పుడూ చెడు ఊహించుకుంటావు ఛా! అని అంది. అమ్మ కలలో తరువాత కనపడినా హైమ మాత్రం ఆ ఒక్కసారే గళ్ళ గళ్ళ గౌనుతో కనిపడి ఆ మాటలు అంది.

మరొకసారి జిల్లెళ్ళమూడి వచ్చినపుడు నీవు మీ కాలేజీలో ఏ సబ్జెక్టు చెబుతావురా అని మా కాలేజీలో పొలిటికల్ సైన్సు కాని ఆ సబ్జక్ట్ లేదు నీవు సాయంత్రం మా కాలేజీ స్టూడెంట్స్ పొలిటికల్ సైన్సు అంటే చెప్పు అని ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ రామచంద్రరావుగారికి కబురు పంపి మీటింగ్ పెట్టమంది. కాలేజి పాకలలో ఉంది. ఆ హాలులో రెండే కుర్చీలు ఉన్నాయి. నన్ను కుర్చీమీద కూర్చోమని ఆయన మిగతావారితో కలసి కూర్చున్నారు. నేను కూర్చొని మాట్లాడలేదు. పక్కన ఉన్న కుర్చీలోకి అమ్మా! రావమ్మా! అనసూయా! రావమ్మా! అని ఆహ్వానించి. సోక్రటీస్ నుంచి అపుడు ఎమర్జెన్సీ రోజులు ఆ రోజు దాకా రాజనీతిశాస్త్రము గురించి మాట్లాడినాను. నాకు తృప్తిగా ఉంది. సాయంత్రం అమ్మదగ్గరికి వెళ్ళిన తరువాత కాఫీ యిచ్చి బాగా మాట్లాడినావు అని. సొక్రటీస్ ఆయన శిష్యపరంపర గురించి నేను మాట్లాడిన దానిలో ప్రశ్నలు వేసి తెలుసుకుంది. పొలాల్లో ఉన్న కాలేజికి అమ్మ ఉన్న గదికి చాలా దూరం. మైకు లేదు నా స్పీచ్ అమ్మ వింది అంటే నేను ఆహ్వానించితే వచ్చి కుర్చీలో కూర్చున్నది అన్నమాట. నాకు చాలా సంతోషం. జీవితాంతం జ్ఞాపకం ఉంచుకునే ఆనందమయిన విషయం.

ఒకసారి మాచెర్ల నుండి జిల్లెళ్ళమూడి వస్తూ గుంటూరులో ఆగి ఒక కొలీగ్ చెపితే రంగన్నబాబు గారి దగ్గరకు వెళ్ళినాను. ఆయన శ్రీరాముని ఫోటోకి ఎదురుగా నిలబడి రామా! మాష్టారుకి ఏమైనా ప్రసాదం యివ్వండి అని అన్నారు. రెండు చేతులలోకి, రెండు అరటిపళ్ళు వచ్చినవి. ఆయన నాకు యిస్తూంటే నేను తీపి తినను డయాబిటీస్ అన్నాను. మళ్ళీ వాటిని మాయం చేసి యీసారి ద్రాక్ష పళ్ళు గుత్తులు వచ్చినవి. అవి మరీ ప్రమాదం నేను భగవంతుడే యిచ్చినా నోట్లో పెట్టినా తినను. చావుకి ఎదురు వెళ్ళలేను డయాబిటిస్ అన్నాను. అంటే తీక్షణంగా చూసి ఏమి తింటారు అంటే, కొబ్బరికాయ ముక్కలు యివ్వండి అంటే, పక్కన కొబ్బరికాయ కొట్టినట్లు చప్పుడు అయి ఆయన చేతులలోకి రెండు చెక్కలు వచ్చినవి. అవి తీసుకొని ఆయనతో పాటు ఆయన శిష్యుల దగ్గరికి రిక్షాలో వెళ్ళి తిరిగి మర్నాడు జిల్లెళ్ళమూడి వెళ్ళినాము.

జిల్లెళ్ళమూడిలో అమ్మని దర్శించుకుందుకు హైదరాబాద్నుండి పెద్ద పోలీసు ఆఫీసరు సకుటుంబంగా వచ్చినారు. వారు పెద్ద అరటిపండ్లు గెల, స్వీట్స్ తెచ్చినారు. నేను వరండాలో కూర్చున్నాను. అమ్మ చూసే వీలు లేదు. కాని కొంతసేపటికి బయట నరసింహమూర్తి కూర్చున్నాడు. వాడిని లోపలికి రమ్మను అంటే వెళ్ళినాను. వాళ్ళు అందరికి అరటిపండ్లు పంచి పెట్టి నానోట్లో పెట్టబోతే నేను నోరు తెరవలేదు. వాడు కాలేజి లెక్చరర్ పండు పెడితే తిననంటున్నాడు. వారందరి నుదురుబాదుకొని, శుభ్రంగా ఉన్నాడు పాపం మెంటల్ కేసులాగుంది అని తినండి బాబు అన్నారు. ఒరేయ్ భగవంతుడు నీ నోట్లో పెట్టినా తినకపోవచ్చు, కాని అమ్మ పెడితే తినాలిరా. అంటే తిన్నాను. వారందరు వెళ్ళిన తరువాత ఎప్పుడు ప్రతిజ్ఞలు చేయకు అంటే. నిన్న గుంటూరులో నేను అన్న మాటలు తలుచుకుంటే గుండె జల్లుమంది.

పెంటపాడు వచ్చిన కొత్తలో మా రెండవ అబ్బాయి చిరంజీవి రవిశంకరి రోజూ సాయంత్రం 3 గంటలకి జ్వరం వచ్చి రాత్రి 10 గంటలదాకా ఉండేది. అన్ని టెక్స్ట్ చేయించినాము. అన్ని నార్మల్. స్కూల్ ఫస్ట్. నీరసించి చదవలేకపోతున్నాడు. అప్పుడు జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరకి వచ్చి ఏడుస్తూ చెపితే, చేతిలో పువ్వు తీసుకొని రేఖలు తీయడం మొదలుపెట్టింది. కాసేపయిన తరువాత నీవు యింటికి వెళ్ళేటప్పటికి మీవాడు నవ్వుతూ ఎదురు వచ్చి యీవేళ జ్వరం రాలేదు అంటాడు. వెళ్ళు అని చెపితే సంతోషంగా ఇంటికి వస్తే అలాగే మావాడు నవ్వుతూ ఎదురు వచ్చినాడు. అప్పటి నుంచి ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినా, మీ టెంపరేచర్ గాడు ఏమి చేస్తున్నాడు. వళ్ళు చేసి లావెక్కినాడురా. యింజనీరు అవుదామనుకుని ప్లాను వేస్తున్నాడు. అవుతాడు అనేది. వాడు బి.టెక్ పాసయ్యి ఎమ్. బి.ఎ. చేసి, అమెరికాలో ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. వాడు అమెరికా వెళ్ళే ముందర వాడిని కోడలు చి.ల.సౌ. మల్లీశ్వరి, మనవడు చి. ప్రజాతి జిల్లెళ్ళమూడిలో అమ్మ ఆలయంలో అమ్మ పాదాల వద్ద పడవేసి పంపించినాను.

నేను మా శ్రీమతి ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళినాము. అమ్మను దర్శించుకున్నాము. “ ఆ వేళ మచిలీపట్నం వ్యాపారస్తులు అబ్బాయికి పెండ్లి. పెండ్లి అయి భోజనాలు అయ్యేటప్పటికి 2 గంటలు అవుతుంది. మా రైలు బాపట్లలో 10 గంటలకి. అందుచేత భోజనం చేయకుండా బయలుదేరదాము అనుకున్నా మా శ్రీమతికి ఇష్టం లేదు. అమ్మ చేత బొట్టు పెట్టించుకోకుండా మా యిద్దరికీ కలిపి అమ్మ చేత మాల వేయించుకోకుండా ఎప్పుడు బయలుదేరలేదు. వ్యాన్ 9 గంటలకు గేటు దగ్గర పెడితే సామాన్లు అందులో వేసి గేటు దగ్గర నిలబడ్డాము. వ్యాన్ డ్రైవర్ కోపంతో వచ్చి ఒకళ్ళు పెదనందిపాడు వెళ్ళమంటారు ఒకరు చీరాల వెళ్ళమంటారు అని. యీ సామాన్లు ఎవరివి వారు తీసివేయండి అన్నాడు. మేము బాపట్ల వెళ్ళుతున్నాము. తీసి వేయమంటే మీకు కాదా! అని సామాన్లు కార్లో లోంచి బయటకి విసిరివేసినారు. నేను చాలా బాధపడి అమ్మకి భోజనం చేయకుండా వెళ్ళడం ఇష్టం లేదు. మనదే తప్పు అనుకున్నాము. ఈ లోపల రామకృష్ణ అన్నయ్య చూసి సామాన్లు ఆఫీసులో పెట్టించి రండి భోజనం చేద్దాము అన్నారు. విస్తర్లు వేసిన తరువాత అన్నయ్య పెండ్లి పెద్దతో చెబితే నాకు ఆయనకి అన్నయ్యకు మధ్య వేసినారు. స్వీట్స్ వడ్డిస్తూంటే నేను వద్దంటే మాష్టారు ఆ అదృష్టం మీకే లేదు నాకు అన్నయ్యకు ఉంది తినండి, తినండి. బలవంతం మీద, స్వీట్లు మామిడిపళ్ళతో సహాభోజనం చేసినాము. వారితో అన్నయ్య వారిద్దర్ని బాపట్ల స్టేషనులో డ్రాప్ చేయండి అని చెప్పారు. బస్ బాపట్ల రైల్వే గేట్ దగ్గరకు వచ్చేసరికి గేటు వేసి ఉంది. పదినిమిషాలలో మేము ఎక్కవలసిన రైలు 4 గంటలు లేటుట. ఆ రైలు ఎక్కి కులాసాగా చేరినాము.

ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళినపుడు ఒరే ఓ పని చేస్తావురా అంది. ఇక్కడ కాన్వెంట్ పెడదామని అనుకుంటున్నాను. నీవు ప్రిన్సిపాల్ గా వస్తావురా అంది. అమ్మా ప్రిన్సిపల్గా పనికిరాను అది బాగా జరగకపోతే చాలా బాధపడవతావు అంటే అందుకే నిన్ను రమ్మంటున్నాను అంది. అమ్మా ! కాన్వెంట్కి సరిపడి లక్షణాలు లేవమ్మా. మనం కాన్వెంటు పెడితే చాలా కష్టపడాలి. 4,5 సంవత్సరాలలో జిల్లాలో పెద్ద పేరు రావాలి. ఆ లక్షణాలు యిక్కడలేవు అన్నా. అంటే జరగదంటావు అంది. అమ్మ నీయిష్టం. ఓరేయ్ జ్యోతిషం చదవాలనుకున్నావని తెలుసు. జ్యోతిషం చెప్పకు నీవు రావంటావు అంతేనా అంది. మళ్ళీ జరగదంటావు అంది.

1982లో కడుపులో మంట ఆఖరికి మజ్జిగ అన్నం తిన్నామంట. భరించలేకపోయేవాడిని ఎన్నిమందులు వేసుకున్నా తగ్గలేదు. డాక్టర్ కడుపులో అల్సర్ డయాబెటిక్ కనుక ఆపరేషన్ మంచిది కాదు. మందులు వేసుకొని అలాగే కాలక్షేపం చేయాలి అంటే 1983లో అమ్మ దగ్గరకి జనవరి 25న వచ్చి అమ్మా! ఇది నా పరిస్థితి – పుట్టినరోజు నీ దగ్గర చేసుకుందామని వచ్చినాను. మజ్జిగ అన్నం కూడ తినలేకపోతున్నాను. అంటే పక్కనున్న వసుంధర అక్కయ్య కేసి చూసింది. 5 నిమిషాలలో పులిహోర, పాయసం చెరో ప్లేటులో తెచ్చింది. చెమ్చాలతో నా నోట్లో పెట్టి వికారం, వాంతి అవడం ఉందిరా అంటే లేదు అన్నాను. అయితే అది అల్సర్ కాదు. హైపర్ ఎసిడిటి హోమి యోపతి మందులు నీవు మీ అన్నయ్య దగ్గర తీసుకొని వేసుకో తగ్గుతుంది అన్నది.

కాకినాడ ట్రాన్స్ఫర్ అయిన తరువాత మా యిల్లు సరిపోయేది కాదు. 3 గదులలో కాలక్షేపం చేయవలసి వచ్చేది. ఉత్తరం వైపు చాలా స్థలం ఉంది. యింటిని ఎక్స్టెన్డ్ చేస్తానంటే వాస్తు శాస్త్రవేత్తలు వద్దు యింటికి కనెక్షన్ లేకుండా కట్టుకోయిల్లు. ఎక్స్టెన్డ్ చేస్తే నానా కష్టాలు అనుభవిస్తావు అన్నారు. అమ్మ దగ్గరకు వెళ్ళి పరిస్థితులు చెపితే “నేను ఉన్నాను ఏమి ఫర్వాలేదు. యింటికి ఎక్స్టెన్డ్ చేసి కట్టుకో అన్నారు. తరువాత కష్టాలు లేవు సరిగదా ఆ యింటిలో అన్నీ శుభాలే జరిగినవి.

అమ్మ ఆలయప్రవేశం చేసిన తరువాత రెండు సంవత్సరాల తరువాత నేను శ్రీమతి జిల్లెళ్ళమూడి విగ్రహం ముందర నిలబడి అమ్మా! రాయి అయిపోయినావా! అని ఏడిస్తే విగ్రహంలోని రెండు కళ్ళు, రెప్పలు ఆడించి కనబడింది. యిద్దరం నమస్కారం చేసి నీవు శరీరంతోటి ఉన్నావు అని తృప్తిపడ్డాము.

మేము అమెరికా నుండి తిరిగి వచ్చి హైదరా బాదులో ఉన్నాము. గుండెలో బాధరావడం అపోలో చేరడం బైపాస్ సర్జరీ అన్ని జరిగినవి. వయస్సు 75 సంవత్సరాలు, డయాబెటిక్, ఆపరేషన్ అయిన తరువాత న్యూమోనియా రావడం జరిగింది.

అమ్మా ! నీకు దయలేదా! అంటే 9 సంవత్సరాల క్రింద పడి పెరిగి పెరిగి అమ్మగా ! సీలింగుని తగులుతూ కనబడింది. మా శ్రీమతి చూపించు అంటే తీసుకుని వచ్చి మంగళసూత్రాలను చూపించి నల్లబడినవి అంటే నీ పాదాల మీద పెట్టి మళ్ళీ కట్టుకుంటుంది అని ప్రార్థిస్తే, ఆరోగ్యం రావడం కొద్ది నెలలకి జిల్లెళ్ళమూడి వెళ్ళి తృప్తిగా యిద్దరు పూజ చేసుకోవడం జరిగింది. అమ్మ పాదాల మీద శ్రీమతి మంగళసూత్రాలు ఉంచి కట్టుకుంది. అమ్మకు కొత్త మంగళసూత్రాలు యిచ్చే అదృష్టం మాకు లభించింది. తరువాత ఆరోగ్యంగా కాలక్షేపం చేసినాము. అమ్మ మమ్మల్ని కాపాడుతూనేఉంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!