1980 వ దశకంలో అమ్మకి Lung abscess కారణంగా తీవ్ర అస్వస్థత చేసింది. అమ్మను హైదరాబాద్ లోని వైద్య నిపుణులకు చూపించి వైద్యం చేయించాలని నిర్ణయించారు. అంతదూరం అమ్మని ప్రయాణం చేయించటం ఎలా? విజయవాడ వరకు రైలు మార్గంలో, అక్కడినుంచి విమానంలో హైదరాబాద్ తీసుకెళ్ళాలని నిర్ణయించి, దాదాపు అందరూ రిజర్వేషన్ చేయించుకున్నారు.
అమ్మ బుద్ధిమంతుడు గారిని, సుబ్బులక్కయ్యని కూడా తనతో పాటు హైదరాబాద్ రావల్సిందిగా కోరింది. “ఇంతవరకు విమాన ప్రయాణం చేయలేదు నాకు భయం. అమ్మా! ‘రైల్లోనో, బస్సులోనో వస్తాను” అన్నారు బుద్ధిమంతుడు. “నీ గుండెలో నే ఉంటా. భయమేమీ లేదు, నువ్వూ సుబ్బులూ రండి” అని అమ్మ ఆదేశించింది.
నాన్నగారు, రామకృష్ణ అన్నయ్య, గోపాలన్నయ్య, అమ్మ భక్తులు అందరూ ప్రయాణమయ్యారు. 12-4-1980 వ తేదీ ప్రయాణం. అమ్మ కూర్చున్న సీటు వెనుక బుద్ధిమంతుడు గారికీ, వారి సతీమణికీ సీట్లు వచ్చాయి. “ఏమిటమ్మా! నా గుండెల్లో ఉంటానన్నావు. నాకు కనిపించటం లేదు. అప్పుడే భయం, దడ మొదలైనాయి” అని బుద్దిమంతుడు మొరపెట్టుకున్నారు. తక్షణం అమ్మ తనకు గాలి అందడం లేదంటూ బుద్ధిమంతుడు గారికి బాగా కనపడేటట్లు మరొక సీటులోకి మారింది. విమానం గాలిలోకి లేచింది.
అమ్మని చూస్తూ బుద్ధిమంతుడు గుండెదడ సంగతి మరచి పోయారు. ఒక గంటలోపే విమానం హైదరాబాదులో దిగింది. ఛార్జీ రు. 1200/- అంటే నిముషానికి 2 రు.లు అని చమత్కరించింది సుబ్బు లక్కయ్య. హైదరాబాద్లో చారిగారింట్లో అమ్మ బస. ఎంతగా వారించినా అమ్మ దర్శనార్ధం వచ్చే బిడ్డలతో చాలా కోలాహలంగా ఉంది ఆ వాతావరణం. అమ్మ ఉన్నదంటే అక్కడ అన్నపూర్ణాలయం ఉంటుంది.
వైద్యులు తగు పరీక్షలు నిర్వహించి వైద్యం చేస్తున్నారు. చివరికి అమ్మ దగ్గితే అది కళ్ళె రూపంగా బయటికి పోతుంది అని తీర్మానం చేశారు. అందుకు అమ్మ నవ్వుతూ “నన్ను తగ్గించటం కోసం తీసుకు వచ్చారా? దగ్గించటం కోసం తీసుకువచ్చారా?” అన్నది; అందరూ పగలబడినవ్వారు. కానీ, అమ్మ ఖంగు ఖంగుమని దగ్గుతూంటే ఆ ప్రాంగణమేకాదు, అందరి గుండెలూ దద్దరిల్లాయి.
నాన్నగారి ఆందోళన వర్ణనాతీతం. వారు ఒకనాడు బుద్ధిమంతుడు గారిని ప్రక్కకి పిలిచి “త్వరగా తగ్గించుకొమ్మని నువ్వు అడుగు. నేను చూడలేక పోతున్నాను” అన్నారు. ఆయన వెళ్ళి “అమ్మా! నాన్న గారిలా అంటున్నారు”అంటే, “త్వరలో పడిపోతుందని చెప్పు”అన్నది. అమ్మ చెప్పినట్లుగానే క్రమంగా వ్యాధి తగ్గుముఖం పట్టింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కొన్నాళ్ళకి బుద్ధిమంతుడు గారికి విపరీతంగా విరోచనాలు కావటంతో అందరూ భయపడ్డారు. అమ్మ నాకు కబురుచేసింది. అప్పుడు నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూండేవాడిని. నేను, నా శ్రీమతి వెళ్ళి వారిని మా ఇంటికి తీసుకువచ్చాం.
అమ్మకి కాస్త స్వస్థత చేకూరగానే వాత్సల్యయాత్ర మొదలు పెట్టింది. ఆస్పత్రులు, మురికి వాడలు, వృద్ధాశ్రమాలు ఎన్నిటినో దర్శించి, వారందరికీ తన దర్శనాన్ని, ప్రసాదాన్ని పంచింది.
ఇక తిరుగు ప్రయాణంలో అందరూ హైదరాబాద్ నుంచి బాపట్ల రైలులో Ist. class reservation చేయించుకున్నారు. కానీ, బుద్ధిమంతుడు గారికి 2 tier reservation దొరికింది. “వాడిని వదలి మీరంతా First class లో వచ్చారా?”అని అమ్మ ఆరా తీసింది.
ప్రతి బిడ్డపట్ల అమ్మకి ప్రత్యేక దృష్టి, శ్రద్ధ. అమ్మ ఎక్కడ ఉన్నా బలహీనులు, దీనులు, బాధితుల పైనే విశేషమైన ప్రేమ, ఆదరణ చూపిస్తుంది. ప్రేమామృత వర్షిణి అమ్మకి శతకోటి నమస్సుమములు.