శ్రీ లక్ష్మీకాంతానందయోగి గారితో – 2వ సమావేశము
క్రితం రాత్రికి అందరము చేరితిమి. తెల్లవారు జాముననే అందరు స్నానములకు వెళ్ళినపుడు బాబుగారు (శ్రీ కొ.ల. యోగిగారు) మాత్రము ఇంటివద్ద ఉండిరి. తిరిగి వచ్చిన వారిలో కోన సుబ్బారావుగారు ముందుగా వచ్చిరి. వారి వల్ల జరిగినది తెలిసికొనిరి {అమ్మ ఓంకార నదిలో (నల్లమడ వాగులో) స్నానములు చేసిన పిదప అందరికి మంత్రోపదేశము – గురుబ్రహ్మ.. శ్రీగురవేనమః అని చెప్పించి. సోహం అని చెవిలో చెప్పిరి – చెప్పించిరి – శేషు} అందరు వచ్చినపుడు అమ్మ వచ్చి దగ్గరగా కూర్చొనిరి.
కాం : (అప్పటి వరకు మంచము మీద కూర్చొని యుండిరి) అమ్మా ! నీవు క్రింద కూర్చుండగా నేను మంచము మీద ఎందులకు?
అమ్మ : అందరము భూమి మీదనే ఆధారపడి యున్నాము. మీరు కూర్చొనిన మంచపు కోళ్ళకు భూమియే ఆధారము. ఎత్తుకాదు కావలసినది.
కాం : అమ్మా ! ఎవరెవరి అర్హతల ప్రకారం వారి వారికి యోగ్యమైనవి. (మంత్రములు) ఇచ్చి వేస్తిరా !
అమ్మ : అందరికి ఒకే మంత్రము – పిల్లి మంత్రము
(అమ్మ జీవిత చరిత్రలో పిల్లి మరణము – శ్వాస ఆగడమూ మొదలైనవి. అమ్మ పరీక్షించడం కనపడుతుంది. పిల్లి మొగ్గ లేక పిల్లి మంత్రము అంటే తలక్రిందులు గావడం అనీ వాడుకలో అర్థం ఉంది. పల్టీకొట్టడం అనీ అంటారు. – శేషు)
తరువాత పొగాకు పాకలో అందరు చేరగా బాబుగారు శివోహం అనునది
తీసుకొని వేదాంత విచారము సాగించిరి.
అమ్మ, తాను చెప్పినది అధికాదనియు, ‘సోహం’ అనియు చెప్పినపుడు, తిరిగి అదే సమర్థించిరి. ఇంతలో రాజు (బుచ్చిరాజు శర్మగారు) అమ్మను ఎత్తికొని తీసుకు వెళ్ళిరి.
తరువాత కొత్తగా వేసిన పాకలో (మందిరములో).
కాం :మీరు కట్టించు దేవాలయమునందే ప్రతిష్ఠ చేయ నెంచిరి?
అమ్మ : పంచాయతనము (కాయలు, ఇసుక కుప్పలు పెట్టిరి సాంకేతికముగా ఔనౌననుకొనిరి)
రాజుగారిచే పాటలు పాడించిరి. శ్రీరాజరాజేశ్వరీ మొదలగు పాటలు పాడిరి.
కాం : శ్రీరాజరాజేశ్వరి, రాజరాజేశ్వరి, రాజేశ్వరి అనుటలో భేదములు గలవు. బుచ్చిరాజు శర్మగారు : ఆ విశేష భేదములు తెల్పుదురా ?
కాంతయ్య బాబుగారు (రాజును చిన్న పిల్లవానిగా పరిగణించి) పల్లకి ఎక్కి ఊరేగినపుడున్న సంతోషము భార్య కాపురమునకు వచ్చిన తెలియును. (కష్ట నష్టములు, బాధ్యతలు మొ||)
ఇంతలో అమ్మ ఒక అరటి పండు తొక్క వొలిచి
అమ్మ : దీనికి మూల కారణమేమి ?
కాం : మహదహంకార ప్రకృతులు – అని మొదలిడి – ఇట్టివి బహిరంగముగా తెలుప వలనుపడదు. ఇప్పటికీ మాకిచ్చిన కాఫీ విలువ కంటే ఎక్కువ మాట్లాడినాము అని లేచి వెళ్ళిరి.
దరిమిలా బాబుగారు, స్థానం నరసింహారావుగారు బయలు దేరుచుండగా ఒకరు ‘ఎక్కడికి బాబుగారు’ అని అడిగిరి.
కాంః నన్ను గోపాలరావు అనునతడు ఈ స్థలములో మంచినీరెక్కడ పడునో చూడమని అడిగిరి. అందులకు పోవుచున్నాను.
బా: ఇది ఏమి ధర్మము? మిమ్ములను అమ్మగాని, నాన్నగారుగాని, బామ్మగారు
గాని – వీరిలో ఎవరు అడుగలేదుగదా ! ఎవరో మరి యొకరి ఇంట సంగతి = అడుగగా మీకెందులకు?
కాంః సబబుగానే యున్నది. మంచి చిన్నవారు చెప్పినను వినవలె.
మరుదినము గోపాలరావడిగిన సంగతి బాబుగారే ప్రస్తావించగా అమ్మ సరే మంచిది చూపుడని కోరిన పిదపనే వారు బయలుదేరి ఆవరణ మంతయు తిరుగుచు పరీక్షలు జరిపిరట.
అమ్మ ఈ ఊరిలో మంచినీరు పడవు. ఉప్పునీళ్ళు తప్ప అనిరి.
బాబుగారు కొన్ని తావులు తిరిగి తాము 50 అడుగు లోతు వరకు వెళ్ళి పరిశీలించితిమనియు ఎచటను దొరక లేదు, అనిరి. పిమ్మట ప్రస్తుతము శేషగిరిరావుగారు అమ్మ కొరకై వేసిన ఇంటికి గుంటూరు కుమారస్వామిగారు వేసిన పాకకు మధ్యలో ఒక తావునను, పుట్టమట్టి నోటిలో వేసికొని చూచి అచటనైన; మూడవదిగా ఊరి వెలుపల గల ఒక తావును మూడింటిని చూపిరట.
దరిమిలా పొన్నూరునుండి వెంకటేశ్వర్లుగారు బోరింగు పైపు తెచ్చి (కుమారస్వామిగారు పాక వేయక ముందే) బాబుగారు చూపిన తావున చాల వరకు పైపులు దింపిరిగాని ప్రయోజనము లేక పోయెను. శ్రీవెంకటేశ్వర్లుగారు గూడ పట్టుదలతో నీరు పడునంత వరకు భోజనము చేయనని పనిచేయించిరి గాని ప్రయోజనము లేక పోయెను.
తరువాత కాలములో పానీవాలా తాను మూడు వేల పంపులు వేయించగా అఖండ ప్రవాహము వచ్చెనని బోరింగు వేయించి చాలా లోతుకు పోగా తళుకు రాళ్ళు కన్పించగా ఇక నీరు పడదని నిర్ధారించుకొని, ఏదో పని మీద వెళ్ళినట్లు హోల్డాల్ కట్టించుకొని వెళ్ళి పోయిరి. డిపార్టుమెంటు వారిచే మిషను తెప్పించమని సలహానిచ్చి వెళ్ళిరి. కాని ఒక వారము తర్వాత గొట్టములు పెరికి వైచిరి. వారెక్కడికి వెళ్ళిరోగాని అన్నమాట ప్రకారము తిరిగి రాలేదు.
కొంతకాలమైన పిదప అమ్మయే ప్రస్తుతము బావియున్న చోటు చెప్పగా బావి తీయించి, చీరాల నుండి సిమెంటు వరలు తెప్పించి ఏర్పాటు చేసిరి. నీరు మాత్రము ఉప్పగా నుండెను. వర్షాకాలములో ఎక్కువగను, ఎండాకాలములో తక్కువగను ఉండునుగాని వట్టిపోవుట లేదు.