‘అమ్మత్వమ్’ తెలుగులో ఇంతవరకూ లేని ఒక కొత్త పదం. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి తమ సరికొత్త గ్రంథానికి పెట్టిన పేరు ఇది. ‘అమ్మత్వమ్’ జిల్లెళ్ళమూడి అమ్మను గురించి శ్రీ మూర్తి ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికలో వ్రాసిన 34 వ్యాసాల సంకలనం.
భగవాన్ సత్యసాయి బాబా ఏనాడు శ్రీ మూర్తిని ‘ఆధ్యాత్మిక శాస్త్రవేత్త’ అన్నారో గాని నాటి నుంచి ఆయన వ్రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలకూ, అసంఖ్యాక వ్యాసాలకూ, ప్రసార మాధ్యమాలలో చేస్తున్న అనేకానేక ప్రసంగాలకూ తెలుగు నాట అపారమైన జనాదరణ లభిస్తున్నది.
జిల్లెళ్ళమూడి అమ్మను గురించి ఇంగ్లీషుతో సహా చాలా భాషలలో ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. ఏ గ్రంథం ప్రత్యేకత దానికి ఉంది. ‘అమ్మత్వమ్ ‘ పుస్తకానికీ అలా ప్రత్యేకం ఉంది. ప్రత్యేకత గ్రంథం పేరుతోనే మొదలవుతుంది. అపూర్వ భావకృతులకు అపూర్వ అంటే ఇంతకు ముందు లేని పదాలు అవసరమౌతాయి.
‘అమ్మత్వమ్’ అలా ఏర్పడిన పదం, దైవత్వం, రామత్వమ్, కృష్ణత్వమ్ లాంటిదే ‘అమ్మత్వమ్’ పదం. అమ్మ అనే తెలుగు పదానికి ‘త్వ’ అనే (సంస్కృత) ప్రత్యయాన్నీ, మకారాన్నీ చేర్చి రూపొందించిన పదం. మిశ్రమ శబ్దదోషం లేదు.
అవతారమూర్తుల జీవితాలుగానీ, మహనీయుల చరిత్రలు గానీ మూసపోసి తీసినట్లు ఉండవు. ఎవరి ప్రత్యేకత వారిదే. ‘అమ్మ’ కూడా అంతే. ఆమె చదువుకోలేదు. పురాణేతి హాసాలను గాని, శాస్త్ర గ్రంథాలను గాని అధ్యయనం చేసిన దాఖలా లేదు. అయినప్పటికీ సంభాషణలలో ఆమె అలవోకగా దొర్లించిన వాక్యాలు అద్భుతమనిపిస్తాయి. అమ్మ పలికిన సూక్తులు బ్రహ్మ సూత్రాలను తలపిస్తాయి. అవన్నీ ఏ తాత్విక చట్రంలోనూ ఇమడవు. ఆమె చేసిన రచనలు గానీ, ఇచ్చిన ఉపన్యాసాలు గాని లేకపోయిన్పటికీ పలికిన పలుకుల కలగలపే ‘అమ్మ’త్వమ్’.
‘అమ్మత్వమ్’ అంటే ఏమిటో శ్రీ మూర్తి తమ వ్యాసాలలో వివరించారు. ‘పరిమిత’ రూపమూ, అనంత శక్తీ, పూర్ణమాతృత్వం కలబోసుకున్న అవ్యాజ కారుణ్య త్రివేణీ సంగమం అమ్మ. కర్మాద్వైతం. ఉపాసనా ద్వైతం, భావాద్వైతం, వైరాగ్యాద్వైతం, మోక్ష నిండుగా పరచుకున్న శతపత్ర జీవితం అమ్మది. సంసారం ఉన్నది కనుక అది కర్మాద్వైతం. సర్వ దైవోపాసన ఉన్నది కనుక అది ఉపాసనా ద్వైతం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ – ఇదంతా నివృత్తి మార్గం. అదీ ఉన్నది గనుక జ్ఞానాద్వైతం… అమ్మత్వం అంటే అసలు తత్వమనేదే అర్థం. అంటే ఆత్మతత్వమనే గదా !
మరెందరికో వలెనే శ్రీ మూర్తికీ అమ్మ అద్భుత శక్తులూ అనుభవమైనాయి. అమ్మ తన శక్తులను ప్రదర్శించదు. కాని, జరుగుతుంటాయి. తనకు అట్టి శక్తులు ఉన్నాయని చెప్పనూ చెప్పదు. కాని వాటిని గురించి అమ్మ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాటిని క్రోడీకరించి “మనస్సు శుద్ధంగా ఉంటే సిద్ధులు అవే వస్తాయి” అని అమ్మ భావంగా శ్రీ మూర్తి వివరించారు.
యాభై సంవత్సరాల అనుబంధంలో సత్యసాయిబాబాతో ఏకాంతంగా మాట్లాడినప్పుడు ఆయన అమ్మను గురించి తనకు చెప్పిన మాటలను ఈ గ్రంథంలో అందించారు శ్రీ మూర్తి.
“లోకం అనుభవించవలసిన మాతృ స్వరూపం అమ్మ… నారాయణ సేవగా, అన్నదానంగా అనిపించే కలాపాన్ని సహజంగా ఈ ప్రపంచానికి నేర్పింది అమ్మ” అన్నారట శ్రీ బాబా. “అందరినీ తన బిడ్డలుగా భావించి, తానున్న ఇంటిని అందరిలుగా ప్రకటించిన అమ్మ దారే అసలు దారి” అంటారు శ్రీ మూర్తి.
సిద్ధపురుషుడు మౌనస్వామి. అమ్మతో చిన్నపిల్లగా ఉన్నప్పుడు మౌనం వీడి మాట్లాడటం, అవధూతేంద్ర సరస్వతీ స్వామి, లక్ష్మణ యతీంద్రులు పూర్ణానందస్వామి, మాస్టర్ ఇ.కె., డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి మొదలైనవారితో అమ్మ సంభాషణలు ‘అమ్మత్వమ్’లో ప్రస్తావనకు వస్తాయి. ‘నేను నేనైన నేను’, ‘అందరికీ సుగతే – కాస్త వెనుకా ముందు’ లాంటి అమ్మ అద్భుత వాక్యాలకు వివరణలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
తత్త్వవేత్తలకు తత్వబోధన చేసిన అమ్మ సాధారణ గృహిణిగా జీవించడాన్ని ‘గృహస్థాశ్రమానికి పచ్చతోరణం అమ్మ’ అని వర్ణించారు. ‘అమ్మత్వమ్’ చదివినప్పుడు అనేక తత్త్వశాస్త్ర గ్రంధాలను చదివిన అనుభూతి కలుగుతుంది.