1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మదర్శనం

అమ్మదర్శనం

Kondamudi Subba Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : March
Issue Number : 8
Year : 2022

బిడ్డల ప్రవాహం ఎప్పుడూ జిల్లెళ్ళమూడికి ఎదో దిశనుండి చేరుతూనే ఉంటుంది. ఒక మతంవారూ, ఒక జాతివారూ, ఒక వర్ణంవారూ, ఒక వర్గంవారూ కాదు, సకలజనం భేదాతీతంగా చేరుతారు, కొందరు మోక్షగాములై, కొందరు లౌకిక కామ్యార్థులై కొందరు జిజ్ఞాసువులై, మరికొందరు అమ్మ అనురాగామృత పానాసక్తులై.

వారి యాత్రా ఫలాలు ఒకసారి విశ్లేషిద్దాం. మొదటగా వారికి లభించేది అమ్మ దర్శనం. అమ్మ దర్శనమే చాలు – సకల పాప సమూల నిర్మూలనకు. పద్మాల కంటే అతి మృదువయిన ఆ దివ్య చరణాలపై ఒక్క క్షణం మన దృష్టి నిలిచిన చాలు – మన నాడీమండలంలోనే ఒక నవచైతన్యం నిండినట్లు మన రక్తప్రసరణమే ఉత్తేజితమయినట్టూ, మన మనసులు పునీతమైనట్టూ, మన మనుగడే సార్ధకమయినట్లు అనుభూతులమవుతాము.

అమ్మ కన్నులూ, వానిలోని జ్యోత్స్నలూ, ఉదయపు తెల్లని ఆకాశంలో ఎర్రటి సూర్య బింబంలా భ్రూకుటి మీద కాంతులీనే ఆ కుంకుమబొట్టూ, నాసికకు తళతళ లాడే బులాకీ, అమృత కలశాలు వ్రేలాడు తున్నట్లు ఆ కర్ణద్వయం, పద్మములవంటి ఆ నయనద్వయం, నాజూకైన ఆ హస్తాలూ, అంగుళులూ, వానిలోని కోమలత్వమూ; ఎక్కడ చూచినా దైవలక్షణ సమన్వితమే. మనం మంత్రముగ్ధులమై మైమరచి భక్తిపూర్వకంగా ముకుళిత హస్తయుగళితో అలా నిలిచిపోతాము. ఇక అమ్మ దృష్టియే మనపై క్షణకాలం ప్రసరించిందా కావలసిన దేమున్నది? మనం అమ్మ కారుణ్య వర్షంలో తడిసినట్టూ, మన ఎడదలలో సుధలు కురిసినట్లూ – మన జీవితాలే ధన్యమయినట్లు పులకించి పోతాము. ఆ చూపులు మన హృదయంలోకి సూటిగా గుచ్చుకుంటాయి. అవి ఎంతో పదునుగా బలంగా మన అంతరాంతరాళాల్లోకి వెళ్ళి మూలమూలలా శోధిస్తాయి. అవి మన మనసులోని కాలుష్యంపై దాడి చేస్తున్నట్లు మనకు భావన కలుగుతుంది.

మన వ్యక్తిత్వం ఉనికిని కోల్పోయి ఆ పాదాల చెంత సర్వార్పణ మవుతుంది. ఆ రూపం దర్శించటం మన నయనాలు చేసుకున్న పుణ్యం. అక్కడ జరుగుతున్న అమ్మ నామం వినటం మన చెవులు చేసుకున్న పుణ్యం. అక్కడ అమ్మకు పూజచేసిన పుష్పాల పరిమళాలు ఆఘ్రాణించటం మన నాసిక చేసుకున్న పుణ్యం. అమ్మ దివ్యచరణాలను స్పృశించటం మన హస్తాలు చేసుకున్న పుణ్యం. ఆ సన్నిధికి నడిచి రావటం మన పాదాలు చేసుకున్న పుణ్యం. భక్తిపారవశ్యంలో మునిగి తేలడం మన హృదయం చేసుకున్న పుణ్యం.

నిజానికి అమ్మను చూసిన పారవశ్యంలో ఈ ప్రపంచం మర్చిపోతాం. అప్పటి దాకా మనల్ని అల్లకల్లోలం చేసిన కోరికల సుడిగుండం శాంతపడి ఏ కోరికా మనసులో ఉండదు. మనలో చాలా మందికి ఇది అనుభవమే. ఈ విషయంలో మనకేమీ చింత ఉండవలసిన అవసరం లేదు.”అడిగితే అడిగినదే ఇస్తాను.అడగకపోతే కావలసింది ఇస్తాను.”అని అమ్మ ఇచ్చిన వరం ఉందిగా.

అమ్మ దర్శనం సకలార్ధ సాధకం.

ఒక అలౌకిక ప్రశాంతత, లౌకిక భరోసా ఏక కాలంలో కలుగుతాయి.

అమ్మలో ఒక దైవం, ఒక మాతృమూర్తి ఒకే సమయంలో దర్శనమిస్తారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.