రామాయణ మందరమౌ వాసుదాసు ఏమనెను?
“రామబ్రహ్మము” అమ్మలో కనుపించారని యనెను.
పరమతపస్సంపన్నుడు మౌనస్వా మేమనెను?
‘నీతో మాటాడుటయే మౌనము పరమార్థమనెను’
శృంగేరి విరూపాక్ష శ్రీ పీఠులు ఏమనిరి?
నీవు నిజంగా ‘బాలా రాజరాజేశ్వరి’ వనిరి.
పాకీ బిడ్డను ఎత్తి రక్షించగ ఏమనెను?
సంఘమాత బ్రహ్మతత్వభావ మ్మీవేయనిరి.
అమ్మవారి అర్చకుడు రంగాచార్లేమనెను?
రాజ్యలక్ష్మి అమ్మవారే యీ అమ్మాయనుకొనెను
అంకదాసు మస్తాను అమ్మను ఏమనుకొనిరి?
ఎరుక నెరుక చేసినట్టి అమ్మే ఎరుకనుకొనిరి.
కౌంపౌండర్ కృష్ణమూర్తి ధ్యానములో ఏమనెను?
భావాద్వైతము నిచ్చి ముక్తి నిచ్చు మాతయనెను.
భ్రాంతిలో తాతామనుమలు అమ్మను ఏమనుకొనిరి?
అమనస్కస్థితి కల్గిన అమ్మే యీమనుకొనిరి.
పొడుముకాయవంటి అమ్మ పొడిమి గని ఖాసీమేమనె?
గుంటూరు మస్తానయ్యే అమ్మై వచ్చాడనుకొనె
చన్ను గుడిపి తృప్తిగన్న సుబ్బలక్ష్మి ఏమన్నది?
ప్రపంచమున ఇంతకన్న సుఖమేమున్నది అన్నది.
పురుడుపోసి పెంచినట్టి గొల్లనాగ మేమన్నది?
శ్రీకృష్ణుని పెంచినట్టి యశోదనే అనుకొన్నది.
కవి భక్తుడు గంగరాజు పున్నయగారేమనెను?
బాలకృష్ణుడే తనకై పరుగెత్తుక వచ్చెననెను.
చిదంబరం తాతగారు అమ్మను ఏమనుకొనిరి?
లోకజననిగా తలచి అమ్మే అయిపోయినారు.
మనుమరాలి మహిమలు గని మరిడమగారేమనిరి?
సాధన చతుష్టయసారం అమ్మగా వెలసెననిరి.
ప్రతిరోజు పనిచేసే ఎరుకల నల్లేమన్నది?
ఏసుతల్లి మరియమ్మని – మరియాకు అమ్మేనని.
పరమనృసింహోపాసకులు లక్ష్మణాచార్యులేమనిరి?
బాలా త్రిపురసుందరి, నృసింహుం డీమేననిరి.
తిరువళ్ళూరు పహిల్వాను అమ్మను గని ఏమనెను?
వడ్డించే అన్నపూర్ణ – శ్రీకృష్ణుడె యీమె అనెను.
అయాచిత సేవకొనిన గుండేలరావు ఏమనెను?
రామచంద్రుడే యీ విధి అమ్మయౌచు వచ్చెననెను.
మంచినీళ్ళ తురిమెళ్ళ వేంకటప్ప ఏమనెను?
సత్యనారాయణుండే అమ్మని సత్యమైన తల్లియనెను.
శ్రీరంగపురంవాసి సంకా ప్రకాశ మేమనె?
పాపులను సంస్కరించు పరాశక్తియే అనెను.
దొప్పలపూడి ఆసామి బ్రహ్మయ గారేమనిరి?
కనకదుర్గవీవేయని కాళ్ళమీద పడిపోయెను.
శ్రీశైలం తపస్వియౌ పూర్ణానందేమనిరి?
తల్లిలేని శివుడిప్పుడు అమ్మను చూచెను అనిరి.
రమణాశ్రమమందు చలం అమ్మను గాని ఏమనిరి?
ఈశ్వరుడేడని అడిగితే అమ్మను చూపెదననిరి.
అమ్మమ్మతొ ఘోషాయి అమ్మనుగని ఏమనెను?
నీ బిడ్డడో భగవంతుడు,నీకు జన్మలేదనెను.