అమ్మ కరుణ నోచకుంటే -జగతికారాగారమూ
అమ్మ మనసు తెలుసుకో – అది జ్ఞానపారావారమూ
అమ్మబోధలు ఉపనిషత్తుల సారమూ
అమ్మ హృదయం దయామృత సారమూ
అమ్మ లీలలు ప్రేమపంకజ హారమూ
అమ్మతత్వం అసుర గుణ సంహారమూ
సృష్టి అంటే బ్రహ్మమేనని చాటి చెప్పిన యోగసిద్ధా
సత్తుకానిది అసలు లేదని నొక్కి చెప్పిన జ్ఞానమూర్తీ
ఎవరిని చూసిన బిడ్డయేనని మురిసిపోయే విశ్వజననీ
పరుల బాధకు కళ్ళు నదులై వరదలెత్తే దయాజలధీ.
ఆకలంటూ ఎవరు వచ్చిన ఆదరించే జగన్మాతా
అహంకారం అంధకారం తుడిచిపెట్టే జగద్గురువూ
ధ్యానమంటే ధ్యాసయేనని స్పష్టపరచిన నవ్యవాదీ
ముక్తి అంటే తృప్తియేనని విప్పిచెప్పిన తత్వవేదీ
కరుణతోడా తప్తజీవుల సేదతీర్చే చంద్రవదనా
ప్రేమపొంగా సుప్తజీవుల మేలుకొల్పే సూర్యనయనా
కోరికంటూ తనకులేదని తెలియచేసిన ముక్తజీవే
అన్ని నేనులు తానుయేనని పలికినట్టీ దేవదేవీ