(ఎంతటి వారైనా తలరాతకు తలంవచాల్సిందే)
(ముందుమాట :- ఇంతకు ముందు నేను రాసిన వ్యాసం ‘అమ్మ సన్నిధి మధుర ”స్మృతులు ఘననిధి’ మూడు సంచికల్లో వరుసగా ప్రచురితమైంది. దానికి పాఠకుల నుంచి వచ్చిన స్పందన చూసి ముఖ్యంగా కాకినాడ నర్సింహమూర్తిగారు రాసిన ఉత్తరం పత్రికలో చదివి ప్రోత్సాహం పొంది మళ్ళీ అమ్మ గురించిన నాలుగు మాటలు రాయాలనిపించి ఈ వ్యాసం రాస్తున్నాను. ఇందుకు ప్రోత్సహించిన తమ్ముడు తంగిరాలు సింహాద్రి శాస్త్రికి వ్యాసం ప్రచురించే ఎడిటరుగార్కి నా ధన్యవాదాలు)
నేను ప్రథమంగా అమ్మ సన్నిధికి వెళ్ళినపుడు కొన్ని కోరికలతో, కొన్ని సమస్యలు తీరుస్తుందనే ఆశతో వెళ్ళాను. తీరా ఆమె రూపం చూశాక, ఆమె సంభాషణలు విన్నాక అన్నీ నాలోనే అణిగిపోయాయి. అమ్మ మాటల సందర్భంలో “కర్మను తప్పించటం ఎవ్వరి తరమూ కాదు. తనకున్నది తప్పదు. తాను అనుకున్నట్లు జరగదు” అన్న మాటలు నన్ను నిరాశ పర్చినా జ్ఞానోదయం కల్గించింది. తాను స్వయంగా ఎన్నో కష్టాలను జీవితంలో అనుభవించానని, సీతాదేవి, పాండవులు భగవంతుడు చెంతనే వున్నా కష్టాలు అనుభవించలేదా? అందుకోసం మనసుని మనిషి సిద్ధం చేసుకోవాలి. అందులోనె సాధన ఇమిడి వుంది. మనస్సుని చలనం లేకుండా ఆత్మలో స్థిరం చేసుకొని మనిషి ఆత్మవంతుడు కావాలి. మనం సముద్ర తీరాన ఇసుకలో పాదాలు గట్టిగా ఆన్చి నిలబడితే అలలు అలవోకగా తాకి వెళ్ళి పోతూంటే చూసి వినోదిస్తాం. అదే మనం పాదాలు ఇసకలో ఆన్చకపోతే కెరటం బలంగా మనిషిని తనలోకి లాక్కుని ప్రాణాంతకం అయి విషాదాంతం అవుతుంది. అదే జీవితంలో కూడా జరిగేది. ఆత్మరతుడై, సాక్షీభూతుడై సంఘటనలు చూసే ఆత్మవంతుడ్ని సుఖదుఃఖాలు ఏమీ చెయ్యలేవు. సుఖదుఃఖాల వలయంలోంచి మనసు బైట పడాలి కాని వాటిని జీవితంలో తప్పించుకోలేము. అందుకనే అమ్మ ఆత్మ పరిశుద్ధతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు బాహ్య ఆచారాలకు, మడి మైలలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ‘పుట్టుకకు సంతోషించని వాడికి పురుడు లేదు. మరణానికి దుఃఖించని వారికి మైల లేదు’ అనేవారు. అనేక మహాత్ముల జీవితాల్లో ఈ సూత్రం అమలు జరగటం చూస్తాం.
అమ్మ తన జీవితంలో ఈ విషయాలను ఆచరించి చూపింది. A కళ్ళముందే ఆమె ఏకైక పుత్రిక హైమవతి కన్నుమూసింది. అమ్మ ఈ దుఃఖాన్ని గరళంలా మింగి మిగిలిన తన బిడ్డలకు ప్రేమామృతాన్ని పంచింది. ఆమె జీవిత భాగస్వామి “నాన్నగారు” గతించినా, ఆమె అమ్మలాగే మిగిలి ఆఖరి శ్వాసవరకూ అమ్మ ప్రేమను వర్షిస్తూనే వుంది. ఆమె ప్రాతఃకాలంలో దంత ధావనం పూర్తికాగానే తన మంగళ సూత్రాన్ని ఒక గ్లాసు నీళ్ళలో అభిషేకించి సేవించేది. ఇది నేను కళ్ళారా చూశాను. ఆడవారికి భర్తే దైవంగా భావించి జీవించడమే పరమార్థమని బోధించేది.
ఈ విషయం ఈ కాలంలో విడ్డూరంగా కన్పించవచ్చు. భగవంతుడు స్త్రీకి ఎలాటి భర్తను లభింప జేసినా అతన్ని సేవించటం స్త్రీకి తపస్సులాంటిది అనేది. అడవులలోకి వెళ్ళి సన్యాసం పుచ్చుకుని మోక్షం కోసం తిండి తిప్పలు మాని తపస్సు చేసేవారి మార్గం కన్నా స్త్రీకి ఇంట్లో పదిలంగా వుంటూ తన ధర్మాన్ని నిర్వర్తించటం సులభమే కదా! అక్కడ వచ్చిన వారిలో ఒకరు “అమ్మా! భర్త మరణిస్తే ఆ స్త్రీ ఏం చేయాలి?” అని ప్రశ్నించారు. “భర్త అనే భావనను ఆరాధిస్తే చాలు” అని అమ్మ అన్నారు. ఇక్కడ ఆరాధనా భావం ముఖ్యంకాని వ్యక్తి కాదు అని అమ్మ భావం. పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందా? అని ప్రశ్నించేది. అమ్మ వెలుగు ముందు పుస్తకాల జ్ఞానం వెలవెల పోయేది”. అమ్మని చూడటం ఒక్కటే చివరి ధ్యేయం. అన్ని ధ్యేయాలూ అందులోనే వున్నాయి అనేది. అమ్మ మాయకు లోబడినట్లు నటిస్తూ మాయాతీతురాలై జీవించి మాయమయింది.
ఆమె మాటలో భౌతికంగా “అమ్మ దగ్గరవుంటేనే ఆమె సన్నిధిలో వున్నట్లు కాదని ఎవరు ఎక్కడ తల్చుకుంటే అక్కడ వుంటానని ఆమె సర్వాంతర్యామిత్వాన్ని ఆమె దేహంతో వున్నప్పుడే చాటి చెప్పింది. అమ్మ చిన్న వయసులో కాపురం చేసుకుంటున్న రోజుల్లో కరణంగారి భార్యగానే అన్నదానంతోనే జీవితం ప్రారంభించింది. వచ్చినవారి ఆకలి ముందు తీర్చాకనే మిగతా ఏ విషయమైనా మాట్లాడేది. ఇది ఆమె జీవితంలోనే ముఖ్యమైన ధర్మ సూత్రం. మా తోటికోడలు మంగ (అమ్మ వద్ద కొన్ని సంవత్సరాలు వున్నది) తన అన్నా వదినా ఎక్కువ జనం రద్దీ లేని రోజుల్లో తరచు జిల్లెళ్ళమూడి వెళ్ళేవారని, అమ్మ మాట్లాడుతూనే ఏగరిట సహాయం లేకుండా వేడి మూకుట్లో చేతి వేళ్ళతో పోపు వేయించేవారని ఆమె శరీరం రకరకాల సువాసనలు వెదజల్లుతూంటే కొంత మంది బంధువులు అపార్థం కూడా చేసుకున్నారని, ఆమె నిద్దరలో అనేక భాషలు మాట్లాడేవారని అవన్నీ చూసి తన అన్నా వదినలు ఆమె భక్తులు అయ్యారని చెప్పింది. ఆయనే అమ్మ మీద అనేక గేయాలు రాసిన మన్నవ బుచ్చిరాజు శర్మగారు. ఇట్లాంటి విచిత్రాలు ఎన్నో నేను కళ్ళతో చూడక పోయినా విన్నాను. కాఫీ కోసం సత్యంగారి హోటలు కెళితే అక్కడ సుబ్బయ్య అనే కాపు వుండేవాడు. అతడు అమ్మ జీవితంలో జరిగిన అనేక అద్భుతాలు చెప్పేవాడు. నాకు జ్ఞాపకం వున్నంత వరకూ ఒకే సమయంలో రెండు మూడు చోట్ల శరీరంతో కనిపించారని అది ఋజువు చేసిన వారు చెప్పారని చెప్పాడు. ఎన్ని దివ్య శక్తులు వున్నా అమ్మ అమ్మే. నాకు ఎవరూ శిష్యులు లేరు. భక్తులు లేరు. నేనందరిలో దైవాన్ని చూస్తాను. అందరూ నా బిడ్డలే అనేది.
ఒకసారి అంధుడైన రాధాక్రిష్ణరెడ్డి అమ్మ విగ్రహ ప్రతిష్ట కాక మునుపు కడుతున్న దేవాలయంలో కూచుని 7 రోజులు అమ్మ నామం సప్తాహం చేశారు. ఆ సమయంలో ఆ ఏడురోజులూ ఒక మంచి నీటి చుక్క కూడా తీసుకోలేదు. అది చూసి అమ్మ అందరితో “ఈ సమయంలో అతని శరీరంలో రక్తమే నీరుగా మారి అతని దాహం తీరుస్తుంద”ని చెప్పడంతో అంతా ఆశ్చర్య పోయాము. అమ్మ కంఠ స్వరం వేణువులా వుండేది. ఇది ఎవరికి వినపడాలో వారికే విన్పించేది. అనేకసార్లు నేను మంచానికి ఆనుకుని దగ్గరగా కూచున్నా ఎవర్నో పిలిచి ఆదేశాలు ఇస్తున్నా నాకు ఒక్క ముక్క విన్పించేదికాదు. క్షణంలో ఆమె జారీ చేసిన ఆదేశాలు అమలు జరిగేవి. ఆమె కదల కుండా కూచుని కనుసన్నలతో ఆశ్రమ చక్రం అంతా తిప్పేది. ఆమె నడక విషయం చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను. ఒకసారి తనతో కూడా రమ్మని అన్నపూర్ణశాలకు దారి తీసింది. నేను ఆమెతో సమానంగా నడవడానికి పరుగులాంటి నడకను సాగించాల్సి వచ్చింది. బైటికి నిదానంగా నడుస్తున్నట్లు కనిపించేది. ఆహారశాలకు వెళ్ళింతర్వాత డాబా మీదకాసేపు పచార్లు చేశాం. క్రిందకు వచ్చి మళ్ళీ ఆమె వెనక పరుగులాంటి నడకతో అనుసరించాను. ఇక్కడ ఎంతో కష్టపడి వందల కొద్దీ వంకాయలు కూరి, గుత్తి వంకాయ కూర చేస్తారు. కానీ తినడానికి కొన్ని నిముషాలు పడుతుంది. మోసేవాళ్ళు వుంటేనే పల్లకీలో వారు సుఖపడేది. మోసేవారి బరువు బాధల్ని గూర్చి ఒక్క దైవమే ఆలోచిస్తాడు. అమ్మ ఆలోచన కూడా అట్లాగే పూర్తి మానవతా దృక్పథంతో వుండేది. ఆమెలో నన్ను విపరీతంగా ఆకర్షించింది ఈ దయాగుణమే. హైదరాబాదు వచ్చినపుడు కూడా నిరుపేదవారిని, పూరి గుడిసెల్లో వారిని విచారించడానికి ఆతృతపడుతూ వుండటం చూశాను. వాళ్ళ బాధల ముందు మన బాధలు చాలా చిన్నవి కదూ! అనేది.
ఇదీ అమ్మ దగ్గర చివరిసారిగా నేను విన్నది. ఇంక అమ్మను దర్శించే అదృష్టం మాటలు వినే పుణ్యం నాకు లేకపోయింది.