1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మమాట – వాత్సల్యపు మూట

అమ్మమాట – వాత్సల్యపు మూట

Kondamudi Subba Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : July
Issue Number : 12
Year : 2013

మంచిమాట – సుగంధ పరిమళభరితం

తన చుట్టూ ఉన్న పరిసరాలను కూడ

పరిమళభరితం చెయ్యగలదు

-స్వామి వివేకానంద

ఒక్కొక్క అవతారపురుషుడికి ఒక్కొక్క ఆయుధం

భార్గవరాముడు, పరశురాముడు, దశరధరాముడు,.కోదండరాముడు శ్రీకృష్ణుడు – చక్రపాణి.

మరి ‘అమ్మ’ ఆయుధం ఏమిటి ? అది తప్పకుండా అమ్మమాటే ! లాలనతో కూడిన అమ్మ మాటే అమ్మ ఆయుధం.

ఈ మాట అంటుంటే ఒక అనుభవం స్ఫురణకు వస్తున్నది. అది నేను మాచర్లలో చైతన్యగ్రామీణ బ్యాంకు శాఖాధికారిగా పనిచేస్తున్న రోజులు. ఋణాల వసూలు నిమిత్తం గిరిజన ప్రాంతానికి వెళ్ళి తిరిగి వస్తున్నాను. రవాణా సౌకర్యాలు సక్రమంగా లేకపోవటంతో ఒక ఆటో ఎక్కాను. అప్పటికీ ఆటో అతనికి మరొక ప్రయాణీకురాలితో వివాదం నడుస్తున్నది. ఛార్జీ నిమిత్తం రూ. 50/-లు నోటు ఇచ్చానని తనకి చిల్లర రూ. 45/- వస్తాయని ప్రయాణీకురాలు, తన ఆటో ఛార్జీ రూ. 5/- ఇవ్వాలి అని ఆటో అతను ఘర్షణ పడుతున్నారు. కొంత ప్రయాణం జరగిన తర్వాత నేను కలుగజేసుకొని “బాబూ ! అమ్మా! ఇందాకటి నుండి మీ ఘర్షణ చూస్తున్నాను. ఇద్దరూ సన్నకారువారే ! మీ ఇద్దరిలో ఎవరికి అన్యాయం జరిగినా రూ. 50/- లు పెద్దవిషయమే. అయితే ‘అమ్మ’ దయవల్ల నాకు అది పెద్ద మొత్తం కాదు. నేను ఇస్తాను ఆ సొమ్ము. దానితో మీ సమస్య పరిష్కారమవుతుంది” అని అన్నాను. అంతే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

“మీ సొమ్ము ఎందుకులే బాబు ఆమె ఇచ్చాను అంటున్నది కదా ! మిగతా చిల్లర ఇస్తాను లేండి” అని ఆటో అతను.

“నీ సొమ్ము ఎందుకులే నాయనా. అతను ఇవ్వలేదని అంటున్నాడు కదా. ఛార్జీ డబ్బులు ఇస్తానులే” అని ప్రయాణీకురాలు ఒక్కసారిగా వాతావరణాన్ని ఆహ్లాదం చేశారు. ఇంతలోనే నేను దిగాల్సిన ప్రదేశం రావటంతో నేను ఎలాంటి సొమ్ము ఇవ్వకుండానే దిగిపోయాను.

నిజానికి నేను సామాన్యవ్యక్తిని. అందరికంటే ఆవేశ కావేశాల పాలు. ఒక పిసరు ఎక్కువే. కాని పలికిన వాడి స్థాయితో సంబంధం లేకుండానే ‘మాట’కు ఇంత విలువ ఉంటే ఇక ‘అమ్మ’ మాట గురించి ఇక చెప్పేదేముంది.

అమ్మ పెదవి విప్పితే చాలు. అత్యద్భుత ప్రతిభా: సంపన్నుడైన మహావైణికుడు విశిష్టమైన వల్లకీ వల్లరిపై సుందరమైన అంగుళితో సుతారంగా మీటినట్లు ఒక అలౌకిక నాదం ప్రభవిస్తుంది. ఆ నాదం నుండి ఒక దివ్యరాగం ప్రభవించి పరిసరాలన్నింటి పరివ్యాప్తమై అణువణువునూ పులకింప జేస్తుంది. గుండె గుండెలోనూ గులాబులు విరిసినట్లు ఒక అలౌకిక పరిమళం ప్రస్ఫుటమవుతుంది.

అదంతా ఒక దివ్యప్రక్రియ. ఆ వాగమృత తరంగిణిలో ఒక బిందువైనా ఆస్వాదించగల వారు అదృష్టవంతులు ధన్యులు.

*****

అమ్మ మాటలోలోని సానుభూతియే, ఆదరణయే, అనుబంధమే మనలను అమ్మకు సన్నిహితులను చేస్తుంది. మన కష్టసమయంలో లాలనతో అమ్మ పలికే ఒక్క అనునయ వాక్యము మనం ఆర్తితో అమ్మ ఒడిలో వాలి పోయి భోరున ఏడ్చేలా చేస్తుంది. ఈ లోకపు కష్టాలు సుడి గుండంలో చిక్కిన మనలో, బాధల ఎడారిలో వడగాడ్పులు దెబ్బతిన్న మనలో ఈ చల్లనితల్లి చల్లని మాటే సేదదీర్చి ఆదరించి, మనస్సుకు శాంతినీ జీవితానికి మార్గప్రబోధాన్ని ప్రసాదించి అమ్మపై ప్రేమను అంకురింప జేసి మనలను అమ్మవైపు ఆకర్షింపజేసి, అమ్మకు మనలను అత్యంత సన్నిహితులను చేసి చివరకు అమ్మలో విలీనం అయిపోవాలనే కాంక్ష దాకా తీసికొని వెళుతుంది.అపూర్వమైన నిర్వచనాలతో, ప్రవచనాలతో భాషకే ఒక సౌందర్యాన్నీ పరిపుష్టినీ ప్రసాదించేది అమ్మ వాక్కు అమ్మ మాట.

అమ్మను ఒకరు నీవు జీవితంలో అనుష్ఠించిన మంత్రం ఏమిటమ్మా? అని అడిగితే ‘సరే’ మంత్రం అని అమ్మ నిర్ద్వంద్వంగా సమాధానం చెప్పింది. ఎందుకూ, ఎవరికీ ఎదురు చెప్పటం అమ్మకు అలవాటు లేదు. ఇంకొక సందర్భంలో అమ్మచెప్పింది. ఎవరినీ ఎదురు తగిలి పట్టుకోకూడదు, వారి వెంట మనమూ పరిగెత్తి, వాళ్ళ అలసటతో ఆగినప్పుడు పట్టుకోవాలి అని ఈ వాక్యంలో అమ్మ మాటలోని అంతస్సూత్రం ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది.

*****  

“నీకు వీలయినట్లు చేసుకో నాన్నా! నీకెట్లా ఉంటే అట్లా చేసికో సంకోచించవద్దు”.

*****

అమ్మా ! డబ్బు ఉన్నది. ఇల్లు కట్టుకోవాలను కుంటున్నాను. పెంకుటిల్లు కట్టుకుండేదా ? డాబా వేసుకుండేదా?

నీ ఇష్టం నాన్నా – నీ దగ్గరున్న పైకం మొత్తాన్ని బట్టీ ……….. కట్టుకో 

  అమ్మా – అబ్బాయి తెలివయినవాడు. మెడిసిన్ చదవించమంటారా ? ఇంజనీరింగ్ చదివించమంటారా? 

వాడి ఇష్టప్రకారం చేయండి నాన్నా..

*****

అమ్మా ఏదయినా సాధన చెయ్యాలని అనుకుంటున్నాను. ఏమి చెయ్యమంటారు.

నీ ఇష్టం నాన్నా – నీకేది మంచిది అని తోస్తే అది చెయ్యి.

*****

అమ్మా ఇంటికట్టుబడి పూర్తి అయింది. గృహప్రవేశం ఎప్పుడు చెయ్యమంటారు.

మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు చేయండి నాన్నా.

*****

అమ్మా – నీ సన్నిధిలో నాలుగు రోజులు ఉండాలని ఉన్నదమ్మా.

నీ ఇష్టం నాన్నా – నీకు ఉందామనిపిస్తే ఉండు.

*****

అమ్మా – ఈ కష్టాలు పడలేనమ్మా చచ్చిపోవాలని ఉందమ్మా.

నీ ఇష్టం నాన్నా – అది నీ చేతిలోనే ఉంటే అట్లాగే చెయ్యి”

*****

ఇలా ఎవరు ఏమి చెప్పినా అన్నింటికీ సరే ననటం, ఎవరు ఏ మంత్ర జపం చేస్తుంటే అదే ఉత్తమమనటం ! ఎవరు ఏ సాధన చేస్తుంటే అదే సులభమయినదనటం.

ఎవరు ఎట్లా ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో దర్శనం ఇవ్వటం.

అందరి భావాలతో ఏకీభవిస్తూ ఎవరికి వారికి అమ్మ తనతోనే ఉన్నదని అనుపింపచేయటం ఒక్క అమ్మకే చెల్లింది.

*****

అయితే అమ్మ ‘సరే’ మంత్రానికి శ్రీ కొండముది రామకృష్ణ అన్న భాష్యం ఇదీ.

‘మీ ఇష్టం’ అనీ, సరే అని అన్నింటికీ మన అభిప్రాయానికీ అమ్మ స్వేచ్ఛనిస్తున్నట్లు కనిపిస్తున్నవి. కానీ ఆలోచిస్తే, యదార్థం కాదు. అమ్మయే ఒకసారి అన్నది నేను మీ ఇష్టప్రకారమే నడుస్తున్నట్లు కనిపిస్తాను గానీ నిజానికి నా ఇష్టప్రకారమే మిమ్ములను నడుపుకుంటాను అని. అనేక సంఘటనల వలన అది రుజువయింది కూడా. ఇలా ఇన్ని మనస్సులనూ, ఇందరు మనుష్యులను, తన అభీష్టానుసారమే నడుపుకొనడం అత్యద్భుతం. అమ్మ తత్వరహస్యం ఇది అమ్మ మాటల బలం. అమ్మ అవతారపరమార్ధం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!