మనసు చరాస్తియై మార్పు స్థిరాస్తిగా
కాల మనుభవ సంకలన కర్త
తెలివితీరు మరియు తెలివి తక్కువ తెన్ను
మనసుకు మారుగా మసలు నెపుడు
తడిగుడ్డలో తడి విడిగలేనట్లుగా
మహినున్న సర్వమ్ము మనసు దినుసు
వైకల్యరహితమై వరలు మనసునందె
కైవల్య తుల్యమౌ ఘనత వెలయు
వృక్ష సంభావ్య దృశ్యమ్ము విత్తనమున
ఒదిగియుండి కాలికముగ ఎదిగినట్లు
శక్తికర్మలు ఏకమై సంఘటిల్లు
కాలఫలితమె బహురూప గతులు కలిమి..
నా యందు మీరు మానవ లక్షణము జూడ
అంతట దైవత్వ మరియు దేను.
అడిగిన వారికి అడిగిన దిచ్చెద
అవసరమును దీర్తు నడుగకున్న
ఒక శక్తికలదని ఒప్పికొనుటొ – లేక
అంతయు నీవని అనుకొనుటయొక
కర్తృగతమె సుమా కర్మయు క్రియయును
అవు – కామి ఏదైన అమ్మదయ
వ్యష్టి లక్షణపూర్ణమే సృష్టియంత;
సర్వమును దైవ సంకల్ప సరళి రవళి
జీవ-దైవములకు మరి భావమందె
భేదమమరు; మౌలికముగ వేఱుగావు.