కాలప్రవాహంలో మనలో చాలామంది పరమాత్మ స్వరూపమే తానైన అనసూయా నామంతో మన మధ్య మన సుఖదుఃఖాలతో పాలుపంచుకుంటూ భౌతికంగా తన 63వ సంవత్సరములో తన స్వరూపమే అయి, ఆలయ ప్రతిష్ఠితయైన “అమ్మ” సాన్నిధ్యభాగ్యం పొందినవారము.
“అమ్మ” చిన్నతనంలోనే తన పేరుకు అర్థ వివరణ చేస్తూ రాగద్వేష అసూయలను పారద్రోలేదే అనసూయ అని తనతత్త్వం అదేనని హామీ యిచ్చింది.
మనిషికి ప్రధమ శత్రువు అయిన ఏ ‘అసూయ’ను అమ్మ బిడ్డలమయిన మనమందరం జయించి, ఎవరిలో ఏ మాత్రం ప్రజ్ఞ ఉన్నా గుర్తించి ఆనందం పొందుదాము. “అమ్మ” నోటి వెంట ఏ మాట వచ్చినా, అది తాలు మాట కానేకాదు. అన్నీ జీవిత సత్యాలు మాత్రమే. ఉదా: ఒకటి రెండు మాటల ప్రస్తావన.
మహావాక్యాలలో ‘తత్త్వమసి’ ఒకటి అని అందరకూ తెలుసు. “అమ్మ” సందర్భవశాన ఎదురుగా లేని మనిషిని గురించి మాట్లాడే అలవాటు తనకు లేదన్నది – అంటే అది మనకు చెప్పడమే. ఎదుటివ్యక్తిలో మంచిని చూస్తే అదియే మంచితనమని, తప్పొప్పులు అనేవి మానవనైజమని, మనిషి తప్పించుకోలేకనే తప్పు చేస్తాడని, పొరపాట్లతో కూడినదే మానవత్వమని, ఏమీ తన చేతిలో లేకపోయినా, అంతా తానే చేస్తున్నానని బాధపడే మనిషి అమాయకుడు అన్నది. అంతా ముందుగా నిర్ణయించిన ప్రకారమే మనం నడుస్తున్నామని, విధే విధానం – అంటే – విధి కర్త. విధానం- కర్మ అని, ఈ రెండే సాంఖ్యవిచారణ అని చెప్పినది. అంటే ఒక్కమాటలో నీకు నీవై ఉండు – అంతకంటే ఏమీ లేదన్నది. పంచదారచిలకతో పోల్చిన సోదరుడు. ఏ మాట పట్టుకున్నా అంతా అద్వైతం వైపుకే పరుగు. భేదమే బాధకు కారణమని, అంతా ఆత్మగా తోచడమే ఆత్మ సాక్షాత్కారమన్నది. యోగవాశిష్టం మనమంతా శూన్యంలో వ్రేలాడుతున్నామన్నది. “అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణస్థితః లోపల ఉన్నదేదో – బయట అదే అయినపుడు కళ్ళు మూతలెందుకు? అన్నది. “అమ్మ” అంటే జిలెళ్ళమూడిలో ఈ మంచం మీద కూర్చున్నదే కాదని, అంతటా ఉన్న అమ్మ తెలియడానికే ఈ అమ్మ రాక అని
మరొక్కమాట
సంఘటనలకూర్పే జీవితం – అని ఈ వాక్యంలో ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ప్రతిఫలిస్తాయి. అది మంచిగాని చెడుగాని, గొప్పగాని, తక్కువగాని, ఏదీ దేనికీ మన బాధ్యతలేదని, ఎందరికో మన వల్ల మంచి జరిగినా, వారు తరువాత స్పందించకపోయినా, మనం జీవితాంతం ఎన్నో పదవులు అలంకరించి ఎంతో ప్రజ్ఞ చూపామనుకున్నా, ఏదీ చేయలేక ఒక్కొక్కసారి. అకర్మణ్యులుగా ఉండిపోయామే అని ఇటువంటి ఆలోచనలన్ని పైన “అమ్మ” చెప్పిన మాటతో సర్దుమణగి పోతాయి.
“అమ్మ” ఏమీ చెప్పలేదని, సాధనలేదంటుందని అంటారు. కాని, మనిషి మనిషికి వేరు వేరుగా “అమ్మ” గోరు ముద్దలు తినిపించినట్లుగా ఉపదేశంచేస్తుంది. అది ఆ మనిషి స్థాయి, కోరిక, భవితను బట్టి ఉంటుంది. అందుకే అమ్మ “ఉపదేశమంటే దైవ సన్నిధికి చేర్చడమే అని నిర్ద్వంద్వంగా చెప్పింది. దానికి మన అర్హత ఆలోచిస్తే, ఏడవమైలు దాటలేకపోవడం కాదు మన ఇంటి ఆవరణయే దాటలేమని పిస్తుంది. అందరి జీవితాలు “అమ్మ” ముందు తెరచిన పుటలే.
నాతో ఒక సందర్భంలో “సహజాన్నుండి విశేషాన్ని విడదీసి మరల దాన్ని సహజం చేసుకోవడమే సాధన” అని చెప్పినది. అంటే దాని అర్ధం ఏమిటో జీవితంలో 70 వసంతాల తరువాత ఇపుడు గోచరించేదేమంటే అంతా ఆత్మగా తోచినపుడు, ఫలానాచోటనే దేవాలయంలోనే ఉన్నదే దైవం కాదని, పైన ఆకాశం ఏలాగ అందరికి అచ్ఛాదనగా ఉండి, మనలో ఉన్న దహరాకాశము అదీ ఒక్కటేనని భావన స్థిరపడడము, అది కానిది ఏదీలేదు అని, మీరు రాజరాజేశ్వరి అంటే, మీరు కానిది నేనేదీ కాదని, ఈ భావన స్థిరత్వం “అమ్మ” నాకు ఉపదేశించిన వాక్యం నా ఆత్మమూలానికి వెళ్ళి, దేహం కూడ ఆత్మకనుకనే, ఈరోజు ఈ వ్యక్తీకరణకూడ సాధ్యమవుతున్నదని అనిపిస్తుంది. ఒకసారి సందర్భవశాత్తు, ధ్యాననిష్ఠ అంటే “కనడం కాదు” – అనిపించడమేనని కూడ అన్నది.
సాధనసోపానం చెప్తూ, సత్యం గురించి నాకు చెప్తూ సత్యం ముందు దైవంకూడ నిలవదని చెప్పింది. మనం ఇవన్ని ఏదోలే అని తీసుకుంటాము. కాని అది పాటించమని, మనకు చెప్పడమే. ఇది పాటిస్తూ దాదాపు 15 సంవత్సరాల నుండి సరదాకుగాని, నేను చేయలేని పనిగాని, ఎన్నడూ, అసత్యం మనసా, వాచా చెప్పని నియమం పెట్టుకుంటే ఒక విచిత్ర సంఘటన ఉదహరిస్తాను-
మా శ్రీమతి ఒక టూరిస్టు వారిద్వారా శ్రీలంక తను ఒకతే వెళ్ళివచ్చినది.
ఆ సందర్భంగా తను వచ్చిన తరువాత సరదాగా ఆ నాడు రాముడు లేకుండా సీత వెళ్ళినదని ఆమెను వదిలేశాడు – అదే విధంగా నేను రాకుండా వెళ్ళావు కదా నిన్ను అదే చేస్తాను – అన్నాను. ఆ మాట ఫలితమనుకుంటాను – 6-11-2019 వ తేదీన ఒక ఘోర ప్రమాదంలో ఆమె నన్ను వదలి అమ్మ సన్నిధి చేరినది. అది సత్యనిష్ఠకున్న గొప్పదనం. అమ్మమాట వేదసారం అని – తెలుసుకున్నాను-
అదీకాక ఒక సందర్భంలో ఈభార్యా వియోగం గురించి అన్యాపదేశంగా సూచనచేస్తూ, ఏలూరు రామకృష్ణ మాష్టారి భార్యావియోగం గురించి ప్రస్తావిస్తూ, భర్త లేకుండా భార్య ఉండగలదుగాని, భార్య లేకుండా వృద్ధాప్యంలో ఉండడం మగవారికి కష్టమని చెప్పక చెప్పింది.
అపుడే నాకు వచ్చిన ఈ అవసరం గురించి కూడ సోదరుడు నదీరాను ఉదహరిస్తూ సూచన చేసింది. “అమ్మ”కు మన జీవితమంతా తనముందు పరచిన కాగితమే. ఆమెకు త్రికాలాలూ ఒక్కటే కదా! తను విశ్వమాతను నిర్వచిస్తూ, ఈ విశ్వమే మాత అన్నది – అంటే ఆత్మయేనని అందువల్ల మనందరమూ విశ్వసోదర భావంతో మెసలమని, మన చేతులు ఆర్తులవైపు చాచమని, మన హృదయం సంకుచిత పరచక అందరను సమాదరణ చేయమని, ఒకరికొకరుగా మసులుకోమని, ఆదరించే ప్రతి ఇల్లు అన్నపూర్ణాలయమని, మనందరనూ శ్రీ లక్ష్మణయతీంద్రులు చెప్పినట్లు- లలితామూర్తులుగా తీర్చిదిద్ది తను ఆలయంలోనే కాక మనందరి వెన్నంటియే ఉన్నదని, ఈ భావన పెంపొందించుకొమ్మని చెప్పిన “అమ్మ” మన భౌతిక దృష్టిలో శతవత్సరముల ఉత్సవములు దివ్యంగా జరుపుకోగలందులకు, మనందరను సాధనవైపు నడిపి, తరంగాల పారాయణ లొకవైపు మాతృశ్రీ నామ జప మొకవైపు చేయమని ప్రేరణనిచ్చిన సోదరీ సోదరులందరకు పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ –
ఈ మధ్యకాలంలో మనలందరను విడచి, ఎందరో మాన్యసోదరులు, “అమ్మ”ను జేరినారు. వారిలో ఒక పూజారిని, ఒక విలేఖరిని, వంటవారిని, తినేవారిని, పారాయణ కర్తలను తన వద్దకు జేర్చుకొని, అందరితో మరల “అమ్మ” పునరావిర్భావ సన్నాహంలో ఉన్నదనిపిస్తున్నది.